STOCKS

News


రికవరీ బాటలో పీఎస్‌బీలు

Friday 10th August 2018
news_main1533896462.png-19126

ముంబై: మొండి బాకీల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) క్రమంగా రికవరీ బాట పడుతున్నాయి. బాకీలు రాబట్టుకునేందుకు అవి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయా బ్యాంకులు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఉదాహరణకు నీరవ్‌ మోదీ కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో స్థూలంగా రూ. 7,700 కోట్ల బాకీలను రికవర్‌ చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రాబట్టిన రూ. 4,443 కోట్ల కన్నా ఇది అధికం కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య కాలంలో కనీసం రూ. 20,000 కోట్లు రికవర్‌ చేసుకోవాలని పీఎన్‌బీ లక్ష్యంగా పెట్టుకుంది. దీని ప్రకారం చూస్తే సెప్టెంబర్‌ క్వార్టర్‌లో మరో రూ. 11,500 కోట్లు రాబట్టుకోవాల్సి ఉంటుంది. దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) వద్ద ఏడు కేసులు తుది దశలో ఉన్నాయని, వీటి నుంచి పెద్ద మొత్తమే రికవర్‌ కాగలదని పీఎన్‌బీ వర్గాలు వెల్లడించాయి. అలాగే మరో ప్రభుత్వ రంగ దిగ్గజం కెనరా బ్యాంక్‌ కూడా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ. 3,537 కోట్లు రాబట్టింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కెనరా బ్యాంక్‌ రూ. 6,458 కోట్లు రికవర్‌ చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రికవర్‌ అయిన మొత్తంలో చాలా భాగం రెండు పెద్ద ఖాతాల పరిష్కారం ద్వారా వచ్చినదేనని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా విశ్లేషకులు తెలిపారు.  ఎన్‌సీఎల్‌టీ దగ్గరున్న మరిన్ని కేసులు పరిష్కారమవుతున్న కొద్దీ రికవరీ మరింతగా పెరుగుతుంది కాబట్టి.. త్వరలోనే బ్యాంకుల రుణ నాణ్యత మరింత మెరుగుపడగలదని వివరించారు. 

రికవరీకి స్పెషల్ టీమ్‌లు ..
భారీ మొండి బాకీలను (ఎన్‌పీఏ) రాబట్టేందుకు పీఎస్‌బీలు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యేకంగా రికవరీ బృందాలు, ప్రధాన కార్యాలయ స్థాయి నుంచి ఫాలో అప్‌ చేయడం, బడా సంస్థలను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముందుకు తీసుకెళ్లడం మొదలైనవి ఇందులో ఉంటున్నాయి. విజయా బ్యాంక్‌ లాంటివి ప్రత్యేక రికవరీ టీమ్స్‌ను ఏర్పాటు చేసి ..  వాయిదాలు డిఫాల్ట్‌ అయిన రుణగ్రహీతలను ఫాలో అప్‌ చేస్తోంది. ఈ రకంగా ప్రస్తుత క్యూ1లో సుమారు రూ.410 కోట్లు రాబట్టింది. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇది సుమారు రెట్టింపు కావడం గమనార్హం. మొండి బాకీలు తక్కువ స్థాయిలో ఉన్న అతి కొద్ది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విజయా బ్యాంక్‌ కూడా ఒకటి. 

కాల్‌ సెంటర్ల ఏర్పాటు..
మరికొన్ని బ్యాంకులు మరో అడుగు ముందుకేసి.. ప్రత్యేకంగా కాల్‌ సెంటర్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) రూ. 1 కోటి పైబడిన ఎన్‌పీఏ ఖాతాలను ఫాలో అప్‌ చేయడం కోసం ఇలాంటి కాల్‌ సెంటరే ఏర్పాటు చేసింది. అంతే కాకుండా మిషన్‌ గాంధీగిరీ పేరుతో ప్రత్యేక రికవరీ కార్యక్రమాలు కూడా చేపట్టింది. బాకీ పడిన రుణగ్రహీతల ఇళ్లు, కార్యాలయాల దగ్గర రికవరీ టీమ్‌ సిబ్బంది శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా 3,000 మంది సిబ్బందిని వినియోగిస్తోంది. మొండిబాకీల విషయంలో కొంగొత్త వ్యూహాలను అమలు చేస్తుండటంతో క్యూ1లో మొత్తం రూ. 200 కోట్లు రాబట్టుకోగలిగామని సిండికేట్‌ బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి.       You may be interested

6,700 యూనిట్లకు క్లియరెన్సులు ఇచ్చాం

Friday 10th August 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇప్పటి వరకు 6,700 యూనిట్లకు క్లియరెన్సులు ఇచ్చామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం వెల్లడించారు. వీటి ద్వారా రూ.1,36,000 కోట్ల పెట్టుబడులను ఆకర్శించామని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. పరోక్షంగా మరో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల విస్తరణకు తోడ్పాటు

ఈ మూడు బ్యాంకుల్లో అప్‌ట్రెండ్‌

Friday 10th August 2018

స్టాక్‌ మార్కెట్‌ పరుగులకు లార్జ్‌క్యాప్స్‌ కారణమన్నారు నిర్మల్‌ బ్యాంగ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ గిరీశ్‌ పాయ్‌. క్రూడ్‌ ధరల తగ్గుదల, స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి భారత్‌ మార్కెట్లలోకి రావడం వంటి అంశాలు వల్ల ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్స్‌పై బుల్లిష్‌ ఉన్నారని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. దేశీ ఇన్వెస్ట్‌మెంట్లు తగ్గినప్పటికీ సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్లు బాగా పెరిగాయని

Most from this category