News


గతేడాది వాహన విక్రయాలకు స్పీడు బ్రేకర్లు..

Tuesday 9th April 2019
news_main1554793771.png-25029

- 2018-19 ప్యాసింజర్ వాహనాల విక్రయా వృద్ధి 2.7%

న్యూఢిల్లీ: దేశీయంగా ప్యాసింజర్ వాహనాల విక్రయాల జోరుకు గతేడాదిలో అత్యధికంగానే స్పీడు బ్రేకర్లు తగిలాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాలు కేవలం 2.7 శాతం వృద్ధితోనే సరిపెట్టుకున్నాయి. గతేడాది విక్రయాలు 33,77,436 యూనిట్లు కాగా, 2017-18 అమ్మకాలు 32,88,581 యూనిట్లుగా నమోదయ్యాయి. నూతన వాహనాల విడుదల ఉన్నప్పటికీ.. గతేడాది ద్వితియార్థంలో గణనీయంగా తగ్గిన అ‍మ్మకాల కారణంగా కనీసం అంచనాలకు దగ్గరగా కూడా విక్రయాలు చేరుకోలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది ప్రారంభంలో 8 నుంచి 10 శాతం వరకు విక్రయాల్లో వృద్ధి ఉంచవచ్చని సియామ్‌ అంచనా వేయగా.. మారిన పరిస్థితుల రిత్యా ఈ అంచనాను 6 శాతానికి సవరించింది. అయితే, ఈకాలంలో ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) తగ్గడం, అధిక వాహన ధరలు, సాధారణ ఎన్నికల కారణంగా ఏర్పడిన అనిశ్చితి వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో పూర్తిఏడాది అమ్మకాలు 2.7 శాతం వృద్ధికే పరిమితమయ్యాయి. ఈ అంశంపై సియామ్‌ అధ్యక్షుడు రాజన్‌ వదేరా మాట్లాడుతూ.. ‘సానుకూల అంశం వైపు నుంచి చూస్తే.. వృద్ధిరేటు ఒక అంకెకే పరిమితం అయ్యిందా, లేదంటే రెండెంకల వృద్ధిరేటా అనే విషయాన్ని పక్కన పెడితే.. గతేడాదిలో కూడా వృద్ధి కొనసాగింది. అధిక ముడివస్తువుల ధరల కారణంగా పరిశ్రమ గతేడాదిలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఇక బీఎస్‌ సిక్స్‌ పరివర్తన మరో కీలక అంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈఏడాది అమ్మకాలు 3 నుంచి 5 శాతం మధ్య ఉండవచ్చని అంచనావేస్తున్నాం. దేశ అర్థిక అభివృద్ధిపై పాజిటివ్‌గా ఉన్నాం. ప్రభుత్వం పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ ఇన్‌ఫ్రా అభివృద్ధి కొనసాగిస్తోంది. బీఎస్‌ సిక్స్‌ ఉద్గార నిబంధనల పరివర్తన ముందు కొనుగోళ్లు జరుగుతాయని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. 

గతేడాది కార్ల అమ్మకాల్లో 2.05 % వృద్ధి
దేశీ కార్ల విక్రయాల్లో గతేడాది స్వల్ప వృద్ధిరేటు నమోదైంది. 2018-19లో 22,18,549 కార్లు అమ్ముడు కాగా, అంతక్రితం ఏడాదిలో 21,74,024 యూనిట్లు అమ్ముడయ్యాయి. యుటిలిటీ వాహనాలు (యూవీ) విక్రయాలు 2.08 శాతం వృద్ధితో 9,41,461 యూనిట్లుగా నిలిచాయి. మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో 9.64 శాతం క్షీణత నమోదైంది. గతేడాది ఎగుమతులు 6,76,193 యూనిట్లు కాగా 2017-18లో 7,48,366 యూనిట్లు ఎగుమతయ్యాయి. 

అగ్రస్థానంలో మారుతీ సుజుకీ
గతేడాది అమ్మకాల్లో మారుతీ సుజుకీ ఇండియా మరోసారి తన మార్కెట్‌ లీడర్‌ స్థానాన్ని కొనసాగించింది. 17,29,826 యూనిట్ల విక్రయాలను నమోదుచేసి 5.25 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. పోటీ సంస్థ హ్యుందాయ్ అమ్మకాలు 1.68 శాతం వృద్దితో 5,45,243 యూనిట్లుగా నమోదయ్యాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 2.21 శాతం పెరిగి 2,45,351 యూనిట్లుగా నిలిచాయి. మరోవైపు ద్విచక్రవాహన అమ్మకాలు గతేడాదిలో 4.86 శాతం వృద్ధిచెంది 2,11,81,390 యూనిట్లుగా నిలిచాయి. 



You may be interested

ఆర్‌కామ్ దివాలా పిటీషన్‌పై ఎన్‌సీఎల్‌ఏటీ దృష్టి

Tuesday 9th April 2019

న్యూఢిల్లీ: రుణభారం పేరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) దివాలా అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దివాలా పిటీషన్‌పై విచారణ కొనసాగించాలా లేదా అన్న దానిపై తానే తుది నిర్ణయం తీసుకుంటామని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. తమకు రావాల్సిన రూ. 550 కోట్ల బాకీల కోసం స్విస్‌ టెలికం సంస్థ ఎరిక్సన్‌ గతంలో ఈ పిటీషన్ వేసింది. అయితే, ఆ తర్వాత బాకీలు

రూ.22,000 కోట్లకు డయాగ్నోస్టిక్‌ సేవల మార్కెట్‌

Tuesday 9th April 2019

వ్యవస్థీకృత రంగంలోనే అధిక వృద్ధి రేటు పెద్ద ల్యాబొరేటరీల్లో ఆధునిక టెక్నాలజీ విదేశీ ఆసుపత్రులకు భారత్‌ నుంచి సేవలు మారుతున్న జీవనశైలితో కొత్తకొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మనిషినిబట్టి చికిత్స మారుతోంది. దీంతో వైద్య సేవల రంగంలో ఇప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలదే కీలకపాత్ర అయింది. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు (డయాగ్నోస్టిక్‌ సెంటర్లు) ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఆసుపత్రుల అవసరాలకు తగ్గట్టుగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఇవి నూతన టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నాయి.

Most from this category