STOCKS

News


అతివిశ్వాసమే మొండిబాకీలకు కారణం

Wednesday 12th September 2018
news_main1536730080.png-20190

న్యూఢిల్లీ: బ్యాంకర్లు అతినమ్మకంతో వ్యవహరించడం, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మందగించడంతో పాటు ఆర్థిక వృద్ధి ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావడమే మొండిబాకీలు (ఎన్‌పీఏ) పేరుకుపోవడానికి ప్రధాన కారణాలని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. మురళీ మనోహర్‌ జోషి సారథ్యంలోని పార్లమెంటరీ కమిటీకి పంపిన నోట్‌లో ఈ మేరకు వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులు మొదలైన వాటిపై అనుమానాలు రేకెత్తడం, విచారణనెదుర్కొనాల్సి రావొచ్చన్న భయాల కారణంగా.. అప్పట్లో యూపీఏ, ఆ తర్వాత ఎన్‌డీఏ ప్రభుత్వాల్లో నిర్ణయాల ప్రక్రియ మందగించిందని రాజన్‌ పేర్కొన్నారు. ఫలితంగా ప్రాజెక్టులు నిల్చిపోయి వాటి వ్యయాలు పెరిగిపోవడం, రుణాలపై వడ్డీలు చెల్లించలేని పరిస్థితి తలెత్తిందన్నారు. దేశంలో విద్యుత్‌ కొరత నెలకొన్నప్పటికీ పలు విద్యుత్‌ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండటం.. ప్రభుత్వ నిర్ణయాల ప్రక్రియ ఇప్పటికీ వేగం అందుకోలేదనడానికి నిదర్శనమని రాజన్‌ పేర్కొన్నారు. రాజన్ 2016 సెప్టెంబర్‌ దాకా మూడేళ్లపాటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా సేవలందించారు. మొండిబాకీల సమస్యను ముందుగా గుర్తించి, పరిష్కార ప్రయత్నాలు చేశారంటూ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆయన్ను ప్రశంసించిన నేపథ్యంలో ఎన్‌పీఏల అంశాన్ని సంక్షిప్తంగా వివరించాలంటూ రాజన్‌ను పార్లమెంటరీ కమిటీ కోరింది. దీని ప్రకారమే ఆయన తాజా నోట్ రూపొందించారు. 
2006–08లో బీజం..
చాలా మటుకు మొండిబాకీలకు 2006–08 మధ్య కాలంలో బీజం పడిందని ఆయన చెప్పారు. అప్పట్లో విద్యుత్‌ ప్లాంట్ల వంటి ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు సకాలంలో, నిర్దేశిత బడ్జెట్‌లో పూర్తయిపోవడం.. ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉండటం తదితర సానుకూల ధోరణులతో  బ్యాంకులు అత్యంత ఆశావాదంతో వ్యవహరించి రుణాలిచ్చేశాయని ఆయన పేర్కొన్నారు. "బ్యాంకులు ఇలాంటి సందర్భాల్లోనే తప్పులు చేస్తుంటాయి. గత కాలపు వృద్ధిని, పనితీరును భవిష్యత్‌కు కూడా అన్వయించుకుని .. ప్రమోటర్ల వాటా తక్కువ ఉన్న ప్రాజెక్టులకు కూడా భారీగా రుణాలిచ్చేందుకు సిద్ధమవుతుంటాయి. సొంతంగా తాము ప్రాజెక్టులను మదింపు చేయకుండా.. ప్రమోటరుకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ నివేదిక ఆధారంగా కూడా కొన్ని సార్లు బ్యాంకులు రుణాలిచ్చాయి. మీకు ఎంత కావాలో చెప్పండి రుణమిస్తాం అంటూ బ్యాంకులు తన వెంట పడుతున్నాయంటూ ఒక ప్రమోటరు స్వయంగా నాతో చెప్పడం దీనికి ఉదాహరణ" అని రాజన్‌ పేర్కొన్నారు. అయితే, చారిత్రకంగా చూస్తే ఆ స్థాయి వృద్ధి దశలో ఉన్న చాలా మటుకు దేశాల్లో ఇలాంటి అసంబద్ధ ధోరణులు సర్వసాధారణమేనని ఆయన వివరించారు. ఎన్‌పీఏ సమస్యకు కొంత అవినీతి కూడా కారణమై ఉండొచ్చని రాజన్‌ చెప్పారు. అయితే అతివిశ్వాసం, చేతగానితనం, అవినీతి అన్నింటినీ వేర్వేరుగా చూసి.. ప్రత్యేకంగా ఇదే కారణమని చెప్పలేమని పేర్కొన్నారు. "ఈ బాకీల్లో కొన్నింటికి సంబంధించి బ్యాంకర్లు అతివిశ్వాసంతో వ్యవహరించారని, స్వతంత్రంగా మదింపు చేయలేదన్నది సుస్పష్టం. ఇందుకోసం ఎస్‌బీఐ క్యాప్స్, ఐడీబీఐ బ్యాంక్‌ వంటి వాటిపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. ఇలా కీలకమైన విశ్లేషణలను అవుట్‌సోర్సింగ్‌ చేయడమనేది వ్యవస్థాగతమైన బలహీనతే. దీనివల్ల వర్గాలు ప్రభావితం చేసే అవకాశాలు పెరుగుతాయి" అని ఆయన పేర్కొన్నారు.
మళ్లీ ఇలాంటివి తలెత్తకూడదంటే..
ఎన్‌పీఏల సమస్య మళ్లీ తలెత్తకూడదంటే.. తీసుకోతగిన చర్యలు కొన్నింటిని రాజన్‌ సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) గవర్నెన్స్‌ను, ప్రాజెక్టుల మదింపు ప్రక్రియను మెరుగుపర్చాలని, ఎప్పటికప్పుడు ఆయా రుణాలను పర్యవేక్షిస్తుండాలని పేర్కొన్నారు. అలాగే పీఎస్‌బీలను ప్రభుత్వానికి దూరంగా ఉంచడం, రికవరీ ప్రక్రియను పటిష్టపర్చడం తదితర చర్యలు తీసుకోవాలని తెలిపారు. 
పీఎంవోకు ఫ్రాడ్‌ కేసుల లిస్టు..
ఎన్‌పీఏలతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో మోసాల పరిమాణం భారీగా పెరుగుతోందని రాజన్ పేర్కొన్నారు. ఫ్రాడ్‌ కేసుల విషయంలో బ్యాంకులు, దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం కోసం తన హయాంలో ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ కూడా ఏర్పాటు చేయడంతో పాటు కనీసం ఒకరిద్దరిపైనైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో హై ప్రొఫైల్ కేసుల జాబితాను ప్రధాని కార్యాలయానికి (పీఎంవో)కి కూడా పంపినట్లు ఆయన వివరించారు. ఈ విషయంలో ఏదైనా పురోగతి ఉందా లేదా అన్నది తనకు తెలియదని, దీనిపై సత్వరం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాజన్ చెప్పారు. పీఎస్‌బీల్లో ఆర్‌బీఐ నామినీ ఉన్నంత మాత్రాన అవి పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ అజమాయిషీలోనే ఉందనుకోవడం అపోహేనని ఆయన పేర్కొన్నారు. కేవలం నిబంధనలకు అనుగుణంగా ఆయా బ్యాంకులు ప్రక్రియలు పాటిస్తున్నాయా లేదా అన్నది మాత్రమే నామినీలు చూస్తారే తప్ప.. వాణిజ్య రుణాల వ్యవహారాల్లో వారికి పెద్దగా అనుభవమేమీ ఉండదని రాజన్ తెలిపారు. You may be interested

పరిమితి పెంపుతో వేగంగా రుణాల రికవరీ

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: డెట్ రికవరీ ట్రిబ్యునల్స్‌కు (డీఆర్‌టీ) నివేదించదగ్గ మొండిబాకీల కేసుల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచడంపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణనిచ్చింది. మొండిబాకీలను (ఎన్‌పీఏ) వేగంగా రికవర్ చేసుకోవడానికి ఇది తోడ్పడగలదని పేర్కొంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాల రికవరీ చట్టం 1993ని సవరిస్తూ.. గత వారంలో ఈ పరిమితిని పెంచిన సంగతి తెలిసిందే. డిఫాల్ట్ అయిన రుణగ్రహీతల నుంచి సొమ్మును రాబట్టే క్రమంలో

హీరోమోటో కార్ప్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లీ

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజ సంస్థ హీరోమోటో కార్ప్ ప్రచారకర్తగా భారత క్రికెట్‌ కెప్టెన్ విరాట్ కోహ్లీ నియమితులయ్యారు. ఎక్స్‌ట్రీమ్‌ 200ఆర్‌ ప్రీమియం మోటార్‌సైకిల్‌కు ప్రచారం చేయటంతో కోహ్లీ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తారని హీరో సీఈఓ పవన్ ముంజాల్ ప్రకటించారు. ‘విరాట్ కోహ్లీ ఈ తరం యువతకు ప్రతీక. భయం లేకుండా, లక్ష్యానికి చిహ్నంగా నిలుస్తున్న ఈయన హీరో సంస్థ ఆశయానికి సరిగ్గా సరిపోతారు.’ అన్నారాయన. కోహ్లీ మాట్లాడుతూ.. ‘యువత హీరో

Most from this category