STOCKS

News


'జెట్‌'లో జోక్యం చేసుకోం

Thursday 4th April 2019
Markets_main1554373143.png-24973

- డీల్స్‌కి ప్రభుత్వ తోడ్పాటేమీ ఉండదు
- బ్యాంకులు, యాజమాన్యం చూసుకోవాల్సిందే
- స్పష్టం చేసిన కేంద్ర మంత్రి సురేష్ ప్రభు

న్యూఢిల్లీ: రుణ భారం, నిధుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్‌వేస్‌ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. సంస్థను గట్టెక్కించేందుకు డీల్స్ కుదర్చడంలో కేంద్రం పాత్రేమీ ఉండదని పేర్కొన్నారు.‍ జెట్ ఎయిర్‌వేస్‌లో నేరుగా వాటాదారులైన బ్యాంకులే.. కంపెనీ వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయని, ఈ నేపథ్యంలో తమ శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని మంత్రి విలేకరులతో చెప్పారు. "ప్రభుత్వ శాఖ ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదు. రైల్వే విషయంలోనూ నేను ఇదే పాటించాను. జెట్‌కి సంబంధించినంతవరకూ అది బ్యాంకులు, మేనేజ్‌మెంట్‌కి మధ్య వ్యవహారం" అని ఆయన పేర్కొన్నారు. అయితే, భద్రతపరమైన అంశాలపై మాత్రం కచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. తన సంస్థ దివాలా తీస్తుంటే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. జెట్‌ను మాత్రం గట్టెక్కించడానికి ప్రయత్నిస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయంటూ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటరు విజయ్ మాల్యా ఆరోపించిన నేపథ్యంలో సురేష్ ప్రభు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌పై దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయిన సంగతి తెలిసిందే. 

బ్యాంకుల షరతులన్నింటికీ ఒప్పుకున్నా: గోయల్‌
జెట్‌ ఎయిర్‌వేస్‌కి తక్షణం నిధుల సహాయం అందించేందుకు బ్యాంకులు విధించిన షరతులన్నింటికీ తాను అంగీకరించినట్లు సంస్థ ప్రమోటరు, మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వెల్లడించారు. జెట్ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రుణపరిష్కార ప్రణాళిక అమలు కోసం పూర్తి సహకారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రణాళిక కింద సంస్థ యాజమాన్య అధికారాలను బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకోవడంతో పాటు రూ. 1,500 కోట్ల మేర నిధులను సమకూర్చనున్నాయి. 

ఎగురుతున్నది 28 విమానాలే..
ప్రస్తుతం జెట్ ఎయిర్‌వేస్ కేవలం 28 విమానాలే నడుపుతోందని, ఇందులో 15 విమానాలు దేశీ రూట్లలో తిరుగుతున్నాయని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. ముందుగా జెట్‌ 15 కన్నా తక్కువ సంఖ్యలో విమానాలే నడుపుతోందంటూ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పిన ఖరోలా.. ఆ తర్వాత తాజా వివరణనిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విదేశీ రూట్లకు సర్వీసులు నడిపే విషయంలో జెట్ సామర్ధ్యాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఒకప్పుడు దాదాపు 119 విమానాలతో సర్వీసులు నడిపిన జెట్ ఎయిర్‌వేస్‌ ప్రస్తుతం లీజులు కట్టలేక, ఇతర కారణాలతో పలు విమానాలను నిలిపివేసింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం లీజులు కట్టలేక నిలిపివేసిన విమానాల సంఖ్య 69 దాకా ఉంటుంది.

మార్చి జీతాలు వాయిదా ..
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగులకు మార్చి నెలకు జరపాల్సిన జీతాల చెల్లింపులను జెట్ వాయిదా వేసింది. సంక్లిష్టమైన అంశాల వల్ల రుణ పరిష్కార ప్రణాళిక ఖరారుకు మరింత సమయం పట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులకు పంపిన లేఖలో చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాహుల్ తనేజా తెలిపారు. చెల్లింపులు ఎప్పటికల్లా జరుగుతాయన్నది చెప్పకపోయినప్పటికీ, ఇందుకు సంబంధించిన వివరాలను ఏప్రిల్ 9న మరోసారి అప్‌డేట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. జెట్‌లో 16,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 

షేరు 5 శాతం డౌన్‌..
లీజుకు తీసుకున్న విమానాల అద్దెలు చెల్లించలేకపోవడంతో మరో 15 విమానాలను పక్కన పెట్టినట్లు జెట్ ఎయిర్‌వేస్ వెల్లడించడంతో బుధవారం సంస్థ షేరు 5 శాతం పైగా క్షీణించింది. బీఎస్‌ఈలో సంస్థ షేరు 5.21 శాతం నష్టంతో రూ. 251.10 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 6.37 శాతం క్షీణించి రూ. 248కి కూడా తగ్గింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలో 5.28 శాతం నష్టంతో రూ. 251 వద్ద క్లోజయ్యింది. 



You may be interested

వృద్ధి రేటు అంచనాకు ఏడీబీ కోత

Thursday 4th April 2019

- 2019-20లో భారత్‌ వృద్ధి 7.2 శాతమే - క్రితం అంచనా 7.6 శాతం - అంతర్జాతీయ మందగమనం,  దేశీయంగా ఆదాయాలు తగ్గుదల కారణం న్యూఢిల్లీ: ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) భారత్‌ వృద్ధిరేటు అంచనాలను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌ 2019 నుంచి మార్చి 2020) వృద్ధి రేటు 7.2 శాతమే ఉంటుందని అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 7.6 శాతం. ఇందుకు ప్రధాన కారణాల్లో అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన పరిస్థితులు, ఆదాయాల్లో

పీఎస్‌యూ బ్యాంకుల డౌన్‌గ్రేడ్‌?

Thursday 4th April 2019

సుప్రీం తీర్పుతో పెరిగిన అనుమానాలు దివాలా విధానాలు, మొండిపద్దుల వసూళ్లకు సంబంధించి ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాలు చెల్లవని తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పీఎస్‌యూ బ్యాంకులకు అశనిపాతం కానుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పుతో తిరిగి పాత రుణ పునర్‌వ్యవస్థీకరణ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో బ్యాంకులపై పెట్టుకున్న ఆశలు కరిగిపోతాయని, త్వరలో వీటి రేటింగ్‌ల్లో, ఎర్నింగ్స్‌లో డౌన్‌గ్రేడ్‌ ఉండొచ్చని అషికా స్టాక్‌బ్రోకింగ్‌ అనలిస్టు అశుతోష్‌ మిశ్రా

Most from this category