STOCKS

News


చిన్న సంస్థలూ పోటీ పడగలగుతాయ్‌

Friday 28th December 2018
Markets_main1545972074.png-23279

 అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి
- పెద్ద కంపెనీల ఆగడాలు తగ్గుతాయి
- ఈ-కామర్స్ కొత్త నిబంధనలపై పరిశ్రమ వర్గాల వ్యాఖ్య

న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులున్న ఈ-కామర్స్ కంపెనీల నిబంధనలను కేంద్రం కఠినతరం చేయడం.. చిన్న సంస్థలకు ప్రయోజనకరంగా ఉండగలదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటిదాకా నిబంధనలను బాహాటంగా ఉల్లంఘిస్తున్న పెద్ద కంపెనీలకు అడ్డదారులన్నీ మూసుకుపోతాయని షాప్‌క్లూస్‌, స్నాప్‌డీల్ వంటి సంస్థలు వ్యాఖ్యానించాయి. "బడా విదేశీ కంపెనీలు ముందు నుంచీ ఈ పాలసీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్న సంగతిని ప్రభుత్వం గుర్తించిందనేది తాజా నిబంధనల ద్వారా వెల్లడైంది" అని షాప్‌క్లూస్ సీఈవో సంజయ్ సేథి చెప్పారు. విక్రేతలందరూ ఈ-కామర్స్ ప్రయోజనాలు పొందేందుకు తాజా మార్పులు దోహదపడగలవని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ పేర్కొన్నారు. "పెద్ద సంస్థలతో సమానంగా చిన్న సంస్థలు కూడా అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తాజా నిబంధనలు ఉపయోగపడతాయి. లఘు వ్యాపార సంస్థలు కూడా ఈ-కామర్స్ ప్రయోజనాలు అందుకోవచ్చు" అని ఇన్‌స్టామోజో సీఈవో సంపద్‌ స్వైన్ తెలిపారు. ఇకపై ఈ-కామర్స్ సంస్థలు భారత్‌లో తమ వ్యాపార వ్యూహాలను సవరించుకోవాల్సి వస్తుందని ఈవై ఇండియా నేషనల్ లీడర్ (పాలసీ అడ్వైజరీ అండ్ స్పెషాలిటీ సర్వీసెస్) రాజీవ్ చుగ్ అభిప్రాయపడ్డారు.
చర్చించి ఉండాల్సింది: ఫ్లిప్‌కార్ట్‌
మరోవైపు, పరిశ్రమ వృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపే నిబంధనలను రూపొందించేటప్పుడు.. ప్రభుత్వం సంబంధిత వర్గాలతో సమాలోచనలు జరపడం ముఖ్యమని ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ-కామర్స్ వ్యవస్థతో చిన్న సంస్థలకు తోడ్పాటు లభిస్తుండటంతో పాటు వేల కొద్దీ ఉద్యోగాల కల్పన జరుగుతోందని తెలిపింది. ఇది ఆరంభం మాత్రమేనని, దేశ ఎకానమీకి ఈ పరిశ్రమ వృద్ధి చోదకంగా మారగలదని పేర్కొంది. ఇక, నిబంధనల సర్క్యులర్‌ను అధ్యయనం చేస్తున్నట్లు మరో ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ తెలిపింది.
నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలి ..
ఈ-కామర్స్ సైట్లలో అమ్మకాలకు సంబంధించిన కొత్త నిబంధనలన్నీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ ప్రభుత్వాన్ని కోరింది. "మేం లేవనెత్తిన ప్రధాన అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై క్యాష్‌బ్యాక్‌ అమ్మకాలు, డిస్కౌంట్లు, ఎక్స్‌క్లూజివ్ విక్రయాల్లాంటివి ఉండబోవు. ప్రభుత్వ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. అలాగే వీటిని కఠినంగా అమలు కూడా చేస్తుందని ఆశిస్తున్నాం" అని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు.
వాంఛనీయ నిబంధనలే: నాస్కామ్‌ మాజీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌
మరోవైపు నిబంధనలు కఠినతరం చేసినంత మాత్రాన ఆన్‌లైన్‌ సంస్థలకు ప్రోత్సాహం లభించకుండా పోదని, ఈ-మార్కెట్‌ల పురోగతిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడబోదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. వెండార్లు వివక్ష ఎదుర్కోకుండా అందరికీ సమాన అవకాశాలు దక్కగలవని ఆయన చెప్పారు. "ఈ-కామర్స్ సైట్స్‌ ఒకరకంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లాంటివే. ఇవి ఎవరిపట్లా వివక్షగానీ పక్షపాతంతో గానీ వ్యవహరించకూడదు. ఆ కోణంలో చూస్తే.. తాజా కఠిన నిబంధనలు సముచితమైనవేనని భావించవచ్చు. ఇలాంటి నిబంధనలు వాంఛనీయం కూడా" అని చంద్రశేఖర్ చెప్పారు.
దిగ్గజాలకు సమస్యలు..
కొత్త నిబంధనలతో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలపైనే ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీటి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం ప్రకటించిన నిబంధనల ప్రకారం.. తమకు వాటాలు ఉన్న ఇతర సంస్థల ఉత్పత్తులను ఈ-కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫాంపై విక్రయించడానికి లేదు. అలాగే, ఎక్స్‌క్లూజివ్‌ అమ్మకాల కోసం ఏ సంస్థతోనూ ఒప్పందాలు కుదుర్చుకోరాదు. పోటీని దెబ్బతీసేలా భారీ డిస్కౌంట్లు ప్రకటించడానికి లేదు. దాదాపు 16 బిలియన్ డాలర్లు వెచ్చించి ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాలు కొనుగోలు చేసిన అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌ లాంటి వాటికి ఈ నిబంధనలు సమస్యాత్మకంగా మారనున్నాయి. అవి సొంత ప్రైవేట్ బ్రాండ్స్‌ను విక్రయించుకోవడానికి ఉండదు. అలాగే, ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలపై ఆంక్షల ప్రభావం అసూస్‌, వన్‌ప్లస్, బీపీఎల్‌ వంటి బ్రాండ్స్‌పై పడనుంది.You may be interested

త్వరలో కొత్త పసిడి విధానం

Friday 28th December 2018

కేంద్ర వాణిజ్య మంత్రి ప్రభు వెల్లడి న్యూఢిల్లీ: పసిడిపై కేంద్రం ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తోంది. త్వరలో బంగారంపై కొత్త విధానం ప్రకటించే అవకాశం ఉందని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు గురువారమిక్కడ తెలియజేశారు. పసిడి పరిశ్రమ వృద్ధి, ఆభరణాల ఎగుమతుల వృద్ధి ప్రధాన లక్ష్యాలతో తాజా విధాన రూపకల్పన ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మొత్తం భారత ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాల వాటా 15 శాతంగా ఉంది. విధాన రూపకల్పనలో

సవాళ్లున్నాయి... అధిగమిద్దాం!

Friday 28th December 2018

 టాటా గ్రూపు ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ లేఖ - 7 లక్షల మంది ఉద్యోగులకు న్యూఇయర్‌ సందేశం - గ్రూపు పునర్‌వ్యవస్థీకరణ, సరళీకరణ ప్రస్తావన - 2018లో బ్యాలన్స్‌ షీట్లను బలోపేతం చేసినట్లు వెల్లడి న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల ముందు రాజకీయ అనిశ్చితి సహా, 2019లో ఎన్నో స్థూల ఆర్థిక సవాళ్లు ఎదురు కానున్నాయని టాటా సన్స్‌ (టాటా గ్రూపు మాతృ కంపెనీ) చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ చెప్పారు. సమస్యలను అధిగమించడంపై దృష్టి సారించాలని టాటా గ్రూపు ఉద్యోగులకు

Most from this category