News


డోర్ల తయారీలోకి ఎన్‌సీఎల్‌!

Wednesday 13th March 2019
news_main1552458856.png-24576

- డ్యూరాడోర్‌ బ్రాండ్‌తో వ్రియాలు
- రూ.50 కోట్లతో తయారీ యూనిట్‌
- చౌటుప్పల్‌లో నేడే ప్రారంభం
- ఈ ఏడాదే విద్యుత్‌ ప్లాంటు కూడా
- ‘సాక్షి’తో ఎన్‌సీఎల్‌ ఎండీ కె.రవి

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ ఎన్‌సీఎల్‌ గ్రూప్‌ ప్రీమియం డోర్స్‌ విభాగంలోకి ప్రవేశిస్తోంది. టర్కీకి చెందిన ఏజీటీ సాంకేతిక సహకారంతో ‘డ్యూరాడోర్’ బ్రాండ్‌ కింద కంపెనీ వీటిని లైఫ్‌టైం వారంటీతో విక్రయించనుంది. దీనికోసం హైదరాబాద్‌ సమీపంలోని చౌటుప్పల్‌ వద్ద రూ.50 కోట్లతో ప్లాంటును నిర్మించింది. బుధవారం ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. భారత్‌లో అతిపెద్ద, ప్రీమియం రెడీమేడ్‌ డోర్ల తయారీ ప్లాంటు ఇదేనని, షిఫ్టుకు 1,000 డోర్లు తయారు చేయగల సామర్థ్యం ఈ యూనిట్‌కు ఉందని ఎన్‌సీఎల్‌ చెబుతోంది. తొలుత భారత మార్కెట్‌ లక్ష్యంగా డోర్లను సరఫరా చేస్తారు. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి ఉపాధి లభించనుంది. నాగార్జున బ్రాండ్‌ కింద సిమెంట్‌, రెడీమిక్స్‌ కాంక్రీట్‌, బైసన్‌ ప్యానెల్‌ బ్రాండ్‌లో సిమెంట్‌ బోర్డులను సైతం ఎన్‌సీఎల్‌ విక్రయిస్తోంది.
ఈ ఏడాది బాగుంటుంది..
2017-18లో కంపెనీ రూ.1,097 కోట్ల టర్నోవరుపై రూ.49 కోట్ల నికరలాభం ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ - డిసెంబరు కాలంలో రూ.855 కోట్ల టర్నోవరుపై రూ.20 కోట్ల నికరలాభం సాధించింది. తొలి 9 నెలలూ సిమెంటుకు ధర లేక నిరుత్సాహపరిచినట్లు ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ కె.రవి చెప్పారు. ‘రెండు నెలలుగా సిమెంటు ధరలు పెరిగాయి. ఈ త్రైమాసికం బాగుంటుంది. సిమెంటుతోపాటు సిమెంటు బోర్డులు, రెడీ మిక్స్‌ కాంక్రీట్‌కు డిమాండ్‌ బాగుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,400 కోట్ల ఆదాయం ఆశిస్తున్నాం. ఇదే డిమాండ్‌ కొనసాగుతుందన్న అంచనాల నేపథ్యంలో 2019-20లో మెరుగైన ఫలితాలు నమోదు చేస్తామన్న ధీమా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బోర్డ్స్‌ ప్లాంటు పూర్తి స్థాయి సామర్థ్యం వినియోగించుకుంటాం’ అని ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. 
రూ.100 కోట్లతో విద్యుత్‌ ప్లాంట్‌..
సూర్యాపేట సమీపంలోని మట్టపల్లి వద్ద ఎన్‌సీఎల్‌ సిమెంటు ప్లాంటు విస్తరించింది. 17 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రైండింగ్‌ యూనిట్‌తోపాటు ఇక్కడ సిమెంటూ ఉత్పత్తవుతోంది. ప్లాంటులో జనించే వేడి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పవర్‌ ప్రాజెక్టును ఈ ఏడాది ఏర్పాటు చేస్తున్నారు. 8 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు రూ.80-100 కోట్లు వెచ్చిస్తామని రవి వెల్లడించారు. కంపెనీకి విజయవాడ సమీపంలోని కొండపల్లి వద్ద 10 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రైండింగ్‌ యూనిట్‌ ఉంది. 2018-19లో సిమెంటు విక్రయాలు 20 లక్షల టన్నులు దాటతాయని చెప్పారాయన. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి సామర్థ్యం 27 లక్షల టన్నులకు చేరుకుంటామన్నారు. ప్రస్తుతమున్న ప్లాంటులోనే విస్తరణ చేపట్టే అవకాశం ఉందన్నారు. 

 You may be interested

మిలియన్‌ మార్కు దిశగా ట్రాక్టర్ల పరిశ్రమ

Wednesday 13th March 2019

మిలియన్‌ మార్కు దిశగా ట్రాక్టర్ల పరిశ్రమ 2018–19లో 8 లక్షల యూనిట్ల అమ్మకం వచ్చే ఏడాది రెండంకెల వృద్ధి అంచనా యాంత్రికీకరణే ఇందుకు ప్రధాన కారణం హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో ట్రాక్టర్ల పరిశ్రమ మిలియన్‌ మార్కు దిశగా వెళ్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధితో సుమారు 8 లక్షల ట్రాక్టర్లు అమ్ముడవుతాయని పరిశ్రమ ధీమాగా ఉంది. 2020–21లో ఈ సంఖ్య 10 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నాయి. భారత్‌లో వ్యవసాయంలో యాంత్రికీకరణ ప్రాధాన్యత పెరుగుతుండడమే

అసమానతలను నిర్లక్ష్యం చేస్తే అనర్ధమే

Wednesday 13th March 2019

- ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు ముంబై: ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల్లో పెరిగిపోతున్న ఆర్థిక, సామాజిక అసమానతలను నిర్లక్ష్యం చేస్తే అనర్ధాలు తప్పవని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. ఎప్పటికప్పుడు మారిపోతున్న టెక్నాలజీ కూడా అసమానతలకు కారణంగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. ఓవైపు ఆటోమేషన్ మూలంగా కొన్ని ఉద్యోగాల్లో కోత పడుతుండగా, మరోవైపు ఏదైనా ఎక్కడైనా ఉత్పత్తిచేయడం సాధ్యపడుతుండటంతో అప్పటిదాకా వాటి తయారీపైనే

Most from this category