STOCKS

News


సమ్మెతో స్తంభించిన బ్యాంకింగ్‌

Thursday 27th December 2018
news_main1545882951.png-23248

- డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్‌పై ప్రభావం
- 3 రాష్ట్రాల్లో నిల్చిపోయిన రూ.2 లక్షల కోట్ల చెక్కుల లావాదేవీలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఒక్క రోజు సమ్మెతో బుధవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్ బ్యాంకులతో పాటు కొన్ని విదేశీ బ్యాంకులకు చెందిన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. అయితే, కొత్త తరం ప్రైవేట్ రంగ బ్యాంకు ఉద్యోగులు మాత్రం దీనికి దూరంగా ఉన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ విలీనాన్ని వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‍బీయూ) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మెతో బ్యాంకు శాఖల్లో డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌, చెక్కుల క్లియరెన్సులు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల జారీ వంటి బ్యాంకింగ్ సేవలపై ప్రతికూల ప్రభావం పడినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌లో ఏకంగా రూ.2 లక్షల కోట్ల విలువ చేసే చెక్కుల లావాదేవీలు నిల్చిపోయినట్లు వివరించాయి. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 7,000 శాఖల్లో సర్వీసులు స్తంభించాయని యూఎఫ్‌బీయూ మధ్యప్రదేశ్ యూనిట్ కో-ఆర్డినేటర్ ఎంకే శుక్లా తెలిపారు. తమ డిమాండ్లు న్యాయమైనవేనని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం సమ్మె సందర్భంగా చెప్పారు.
వారం రోజుల వ్యవధిలో రెండోసారి..
మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ, వేతనాల పెంపు కోరుతూ బ్యాంకు ఉద్యోగులు గత వారం రోజుల్లో సమ్మెకు దిగడం ఇది రెండోసారి. గత శుక్రవారం (డిసెంబర్ 21న) ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 3.20 లక్షల మంది అధికారులు ఒక్క రోజు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, చాలా మటుకు బ్యాంకింగ్ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగినట్లు సీనియర్ బ్యాంకర్లు తెలిపారు. "కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా అన్ని చెక్ క్లియరింగ్ సెంటర్స్‌లో బాధ్యతలను సీనియర్ అధికారులకు అప్పగించడం జరిగింది. ట్రెజరీ వంటి మిగతా కార్యకలాపాలు కూడా యధావిధిగానే కొనసాగాయి" అని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
బీవోబీలో విజయా, దేనా బ్యాంకులను విలీనం చేయనున్నట్లు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం ప్రకటించింది. ఈ మూడింటి కలయికతో ఏర్పడే విలీన బ్యాంకు రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐల తర్వాత మూడో అతి పెద్ద బ్యాంకుగా ఏర్పడనుంది. కానీ దీనివల్ల ఇటు ఆ బ్యాంకులకు గానీ ఖాతాదారులకు గానీ ఒనగూరే ప్రయోజనాలేమీ లేవని బ్యాంకు ఉద్యోగ యూనియన్లు చెబుతున్నాయి. విలీనం వల్ల పలు శాఖలు మూతబడతాయని, కస్టమర్లకు సమస్యలు పెరుగుతాయని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూఎఫ్‌బీయూ బుధవారం సమ్మె చేపట్టింది. ఉ‍ద్యోగులు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. కేంద్ర ఆర్థిక శాఖ గతవారం విలీన ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదముద్ర కూడా వేసింది.
ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ), ఏఐబీఈఏ, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్‌సీబీఈ), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (ఎన్‌వోబీడబ్ల్యూ) తదితర 9 యూనియన్లు యూఎఫ్‌బీయూలో భాగంగా ఉన్నాయి. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన సుమారు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.You may be interested

ఐటీలో 5లక్షల కొలువులు

Thursday 27th December 2018

 2019పై ఇన్ఫీ మాజీ సీఎఫ్‌వో పాయ్ అంచనాలు - ఎంట్రీ లెవెల్ ప్యాకేజీలు పెరుగుతున్నాయని వెల్లడి హైదరాబాద్‌: దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సర్వీసుల రంగం, స్టార్టప్‌లు వచ్చే ఏడాది భారీ స్థాయిలో నియామకాలు చేపట్టనున్నాయి. 2019లో దాదాపు 5 లక్షల మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్‌ టి.వి.మోహన్‌దాస్ పాయ్‌ తెలియజేశారు. ఫ్రెషర్లకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారాయన.

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Thursday 27th December 2018

సెన్సెక్స్‌ 36,000పైన, నిఫ్టీ 10,800 పైన అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో గురువారం భారత్‌ మార్కెట్‌ గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 350 పాయింట్ల పెరుగుదలతో 36,041 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ88 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 10,818 పాయింట్ల వద్ద మొదలయ్యింది. గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 5 శాతం ర్యాలీ జరిపిన ప్రభావంతో ఆసియా సూచీలు సైతం పాజిటివ్‌గా ట్రేడవుతున్న ప్రభావం ఇక్కడి మార్కెట్‌పై పడింది. మెటల్‌ షేర్లు

Most from this category