News


సవాళ్లున్నాయి... అధిగమిద్దాం!

Friday 28th December 2018
Markets_main1545971899.png-23278

 టాటా గ్రూపు ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ లేఖ
- 7 లక్షల మంది ఉద్యోగులకు న్యూఇయర్‌ సందేశం
- గ్రూపు పునర్‌వ్యవస్థీకరణ, సరళీకరణ ప్రస్తావన
- 2018లో బ్యాలన్స్‌ షీట్లను బలోపేతం చేసినట్లు వెల్లడి

న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల ముందు రాజకీయ అనిశ్చితి సహా, 2019లో ఎన్నో స్థూల ఆర్థిక సవాళ్లు ఎదురు కానున్నాయని టాటా సన్స్‌ (టాటా గ్రూపు మాతృ కంపెనీ) చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ చెప్పారు. సమస్యలను అధిగమించడంపై దృష్టి సారించాలని టాటా గ్రూపు ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా గ్రూపు పరిధిలోని ఏడు లక్షల మంది ఉద్యోగులకు ఆయన లేఖ ద్వారా సందేశమిచ్చారు. డిజిటల్‌పై లోతైన పరిజ్ఞానం, సమష్టితత్వం, నిర్వహణపరమైన కార్యాచరణ, అంతర్జాతీయ మార్పులను సమర్థంగా పరిష్కరించే క్రియాశీలతలపై దృష్టి సారించాలని మార్గదర్శనం చేశారు. 2018లో టాటా గ్రూపు మిశ్రమ పనితీరు కనబరిచినట్టు చెప్పారు. ఇక ముందు చేయాల్సింది ఎంతో ఉందంటూ... 100 బిలియన్‌ డాలర్లకు పైగా విలువైన గ్రూపు నిర్మాణాన్ని మరింత సరళీకరించడాన్ని ఒకానొక కార్యక్రమంగా ప్రస్తావించారు. ‘‘2019 ఎన్నో స్థూల ఆర్థిక సవాళ్లను తీసుకురానుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక చక్రం పరిపక్వతకు చేరింది. అభివృద్ధి చెందిన దేశాల కదలికలపైనే ప్రపంచ ఆర్థిక వృద్ధి ఆధారపడటం పెరుగుతోంది. చైనా వృద్ధి మందగిస్తున్న తరుణంలో లిక్విడిటీ సంక్షోభ ధోరణులు, వాణిజ్యానికి సంబంధించిన షాక్‌లు ఇవన్నీ మన దేశానికున్న సమస్యలను తెలియజేస్తున్నాయి. ద్రవ్య పరమైన కఠినతర పరిస్థితులు 2019లోనూ అంతర్జాతీయంగా  కొనసాగుతాయి’’అని చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సవాళ్లను అధగమించడంపై దృష్టి సారించాలని కోరారు. ‘‘మన పరుగును కొనసాగించడమే మన ఉద్యోగం. మరొకరి పరుగుపైకి మనసు మళ్లకూడదు’’ అని సూచించారు.
కీలక ముందడుగు
టాటా గ్రూపు ఈ ఏడాది కీలకమైన ముందడుగు వేసిందని చంద్రేఖరన్‌ చెప్పారు. బ్యాలన్స్‌ షీట్ల బలోపేతం, నగదును సృష్టించే కంపెనీలను నిర్మించుకోవడం చేసినట్టు తెలిపారు. ‘‘టాటా కంపెనీల పునర్‌వ్యవస్థీకరణ, రుణాల తగ్గింపు, గ్రూపు పరిధిలో ఒక కంపెనీలో మరో కంపెనీ వాటాలను స్థిరీకరించడం, కీలకమైన ఆస్తుల కొనుగోలు, భవిష్యత్తు వృద్ధికి గాను రూ.70,000 కోట్లను వెచ్చించేందుకు కట్టుబడి ఉన్నాం. అదే సమయంలో మా ఉమ్మడి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2018లో రూ.10 లక్షల కోట్లు దాటింది’’అని చంద్రశేఖరన్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 7,02,000 మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే ఒకానొక అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థగా టాటా గ్రూపు ఉన్నట్టు చెప్పారు. మహిళలకు సంబంధించిన పనివాతావరణంపై స్పందిస్తూ... పని ప్రదేశాల్లో వేధింపుల విషయంలో ఉపేక్షించేది లేదన్నారు. భద్రత, గౌరవనీయంగా పనిచేసే వాతావరణం అన్నది మొదటి నుంచి తమకు అత్యంత ప్రాధాన్యమైనవిగా పేర్కొన్నారు. టాటా గ్రూపు పరిధిలో మొత్తం ఉద్యోగుల్లో 1,86,000 మంది మహిళలు పనిచేస్తుండడం గమనార్హం.You may be interested

చిన్న సంస్థలూ పోటీ పడగలగుతాయ్‌

Friday 28th December 2018

 అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి - పెద్ద కంపెనీల ఆగడాలు తగ్గుతాయి - ఈ-కామర్స్ కొత్త నిబంధనలపై పరిశ్రమ వర్గాల వ్యాఖ్య న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులున్న ఈ-కామర్స్ కంపెనీల నిబంధనలను కేంద్రం కఠినతరం చేయడం.. చిన్న సంస్థలకు ప్రయోజనకరంగా ఉండగలదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటిదాకా నిబంధనలను బాహాటంగా ఉల్లంఘిస్తున్న పెద్ద కంపెనీలకు అడ్డదారులన్నీ మూసుకుపోతాయని షాప్‌క్లూస్‌, స్నాప్‌డీల్ వంటి సంస్థలు వ్యాఖ్యానించాయి. "బడా విదేశీ కంపెనీలు ముందు నుంచీ ఈ పాలసీ స్ఫూర్తికి విరుద్ధంగా

జనవరి నుంచి ఏపీ ఆర్‌వోసీ

Friday 28th December 2018

- విజయవాడలో తాత్కాలిక కార్యాలయం - తొలి ఆర్‌వోసీగా డెన్నింగ్‌ కె బాబు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌ రిజిష్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ) ప్రారంభం కానుంది. ఏపీ తొలి ఆర్‌వోసీగా డెన్నింగ్‌ కె బాబు, అసిస్టెంట్‌ ఆర్‌వోసీగా ఎల్‌.సాయి శంకర్‌లను నియమిస్తూ కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) జీవోను విడుదల చేసింది. అమరావతిలో సొంత భవనం నిర్మించే వరకూ విజయవాడలోని సూర్యారావుపేటలో

Most from this category