STOCKS

News


డీజిల్ కార్లకు ఇక చెల్లు చీటీ?

Tuesday 19th February 2019
Markets_main1550561676.png-24258

  • నిలిపివేతపై చర్చల్లో మారుతీ సుజుకీ
  • సీఎన్‌జీ కార్లపై దృష్టి పెట్టాలన్న యోచన
  • పెట్రోల్ వెర్షన్లపై మహీంద్రా కసరత్తు
  • కఠినతర కాలుష్య ప్రమాణాలే కారణం

న్యూఢిల్లీ: పెట్రోల్‌తో పోలిస్తే కాస్త ఎక్కువ మోతాదులో కాలుష్యకారక వాయువులు విడుదల చేసే డీజిల్‌ ఇంధన వినియోగంపై నియంత్రణలు పెరుగుతున్న నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు వ్యూహాలు మార్చుకుంటున్నాయి. పరిస్థితి బట్టి డీజిల్ కార్ల ఉత్పత్తిని కూడా నిలిపివేసే అంశాలనూ పరిశీలిస్తున్నాయి. దేశీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇదే అంశంపై మాతృ సంస్థ సుజుకీతో చర్చలు జరుపుతోంది. సుజుకీ భారత్‌లో డీజిల్ కార్లను పూర్తిగా నిలిపివేయాలని యోచిస్తున్నట్లు, ప్రత్యామ్నాయంగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ)తో నడిచి వాహనాల తయారీపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, అమ్మకాలు దెబ్బతింటాయన్న కారణంతో దీన్ని మారుతీ వ్యతిరేకిస్తున్నట్లు వివరించాయి. మొత్తం మీద ఈ అంశంపై రెండు వర్గాలు ఇంకా ఒక అంగీకారానికి రావాల్సి ఉందని పేర్కొన్నాయి. డీజిల్ వాహనాల విషయంలో మారుతీ సుజుకీ ప్రయత్నాలకు ఊతమిచ్చేలా పలు వార్తలు వస్తున్నాయి. 2022 నాటికి 2,00,000 సీఎన్‌జీ ప్యాసింజర్ వాహనాలను విక్రయించాలన్న తమ లక్ష్యానికి తగ్గట్లుగా సీఎన్‌జీ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకునే దిశగా లైసెన్సులు తీసుకోవాలంటూ డీలర్లకు మారుతీ సుజుకీ ఇటీవలే సూచించినట్లు సమాచారం. అటు బీఎస్‌-VI కాలుష్య ప్రమాణాలు అమల్లోకి వచ్చాక.. 2020 మార్చి 31 తర్వాత 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ల ఉత్పత్తి, సరఫరా చేయలేమంటూ మారుతీ సుజుకీకి ఫియట్ ఇండియా తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఇంజిన్లు ప్రస్తుతం అమల్లో ఉన్న బీఎస్‌-IV ప్రమాణాలకు మాత్రమే అనుగుణంగా ఉంటాయి. వీటినే స్విఫ్ట్‌, ఎర్టిగా, బాలెనో, ఎస్‌-క్రాస్, సియాజ్ వంటి కార్లలో మారుతీ ఉపయోగిస్తోంది. 


సొంతంగా మారుతీ ప్రయత్నాలు..
ఈ నేపథ్యంలో సొంతంగా 1.5 లీటర్ బీఎస్‌-VI ప్రమాణాల డీజిల్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టడంపై మారుతీ సన్నాహాలు చేస్తోంది. అయితే, పలు సాంకేతిక సమస్యలు ఈ ప్రాజెక్టుకు అవరోధాలుగా మారుతున్నట్లు సమాచారం. ఒకవేళ అన్నింటినీ అధిగమించి దీన్ని అందుబాటులోకి తెచ్చినా 2020 మార్చి నాటికి తమ డీజిల్ వాహనాలన్నింటిలోనూ మారుతీ ఈ ఇంజిన్‌ను ఎంత వరకూ ఉపయోగించగలదన్నది కూడా ప్రశ్నార్థంగా మారింది. 


వాణిజ్య వాహనాలపై ఎం౾అండ్‌ఎం మల్లగుల్లాలు..
ప్రధానంగా డీజిల్ వాహనాలపై ఎక్కువగా ఆధారపడుతున్న ఎంఅండ్‌ఎం కూడా రూటు మార్చుకోవాలని భావిస్తోంది. డీజిల్ వాహనాలను ఎకాయెకిన నిలిపివేయకుండా.. బొలెరో మినహా మిగతా వాహన శ్రేణిలో పెట్రోల్ ఆప్షన్ కూడా అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. దీంతో పాటు చిన్న, వన్ సిలిండర్ ఇంజిన్లపై నడిచే తేలికపాటి వాణిజ్య వాహనాల తయారీ నిలిపివేసే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. డీజిల్‌తో ఆదా అయ్యే ఇంధన ప్రయోజనాలు, బీఎస్‌-VI ఇంజిన్ అభివృద్ధి వ్యయాలతో పోలిస్తే తేలికపాటి వాణిజ్య వాహనాల్లో పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించడం అంత లాభసాటి వ్యవహారం కాదని ఎంఅండ్‌ఎం వర్గాలు తెలిపాయి. బీఎస్‌-VI ప్రమాణాలు అమల్లోకి వచ్చాకా చిన్న ఎస్‌యూవీలు, చిన్న కార్ల కొనుగోలుదారులు పెట్రోల్ వైపు మళ్లినా.. పెద్ద ఎస్‌యూవీల్లో మాత్రం డీజిల్ వెర్షన్‌కే ప్రాధాన్యం ఉండొచ్చని సంస్థ ఎండీ పవన్ గోయెంకా పేర్కొన్నారు. ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో 20-30 శాతం వాటా డీజిల్‌ ఇంజిన్లది ఉంటుండగా, ఎస్‌యూవీల విషయంలో ఇది ఏకంగా 82 శాతంగా ఉంటోంది. మారే ప్రమాణాలకు అనుగుణంగా ముందు చూపుతో అన్ని మోడల్స్‌నూ డీజిల్, పెట్రోల్‌ వేరియంట్లలో అందించేలా కసరత్తు చేస్తున్నట్లు గోయెంకా చెప్పారు.


ప్రమాణాలు.. ధరల వ్యత్యాసం కారణాలు..
గతంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, మైలేజీ మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో కొనుగోలుదారులు డీజిల్ వాహనాలవైపు కొంత ఎక్కువగా మొగ్గు చూపేవారు. ఇటీవలి కాలంలో చూస్తే 2018 జనవరిలో డీజిల్ కన్నా పెట్రోల్ ధర 17 శాతం ఎక్కువగా ఉండేది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఇది 7 శాతానికి తగ్గింది. ఇలా రెండింటి ధరల మధ్య వ్యత్యాసం తగ్గుతుండటం వల్ల డీజిల్‌తో పోలిస్తే కొంత స్వచ్ఛమైన పెట్రోల్‌ ఇంధన కార్లవైపు కొనుగోలుదారులు మళ్లుతున్నారు అని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఇది కాకుండా.. 2020 ఏప్రిల్ 1 నుంచి కఠినతరమైన భారత్ స్టేజ్‌ - VI నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కార్పొరేట్ సగటు ఇంధన సామర్ధ్యం (సీఏఎఫ్‌ఈ) ప్రమాణాల ప్రకారం వాహనాలు ఒకవైపు అధిక మైలేజీనిస్తూనే మరోవైపు కాలుష్యకారక ఉద్గారాలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. డీజిల్ వాహనాలు ఈ ప్రమాణాలను అందుకునే పరిస్థితులు లేవు. అటు పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ (ఈఎస్‌జీ) ఫండ్స్‌ పెరుగుతుండటం కూడా డీజిల్‌కు ప్రతికూలంగా మారింది. ఒకవైపు మెరుగైన రాబడులిస్తూనే.. మరోవైపు  సామాజికంగా, పర్యావరణంపరంగా సానుకూల విధానాలు పాటించే కంపెనీల్లోనే పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఫండ్స్ ప్రాధాన్యమిస్తాయి. పర్యావరణానికి ప్రతికూల ఉత్పత్తులను తయారు చేసే కంపెనీల్లో పెట్టుబడులకు ఇవి దూరంగా ఉంటాయి. ఇటీవలే 1 బిలియన్ డాలర్లతో ఈఎస్‌జీ ఫండ్‌ ప్రారంభించిన అవెండస్ క్యాపిటల్ పబ్లిక్ మార్కెట్స్ ఆల్టర్నేట్ స్ట్రాటెజీస్ సంస్థ వ్యూహమే ఇందుకు నిదర్శనం. భారీ రాబడులిచ్చే ఆటోమొబైల్ కంపెనీ అయినా.. డీజిల్‌ వాహనాలపై ఎక్కువగా ఆధారపడేదైతే దానికి రిస్కులు ఎక్కువగానే ఉంటాయని, అందుకే అలాంటి వాటిని తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోబోమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా, తమ నుంచి పెట్టుబడులు ఆశించే సంస్థలు పర్యావరణహితమైన ఉత్పత్తులపైనే దృష్టి పెట్టేలా ఈఎస్‌జీ ఫండ్స్‌ నిర్దేశిస్తుండటం కూడా ఆటోమొబైల్ సంస్థలు వ్యూహాలపై ప్రభావం చూపుతున్నాయి.You may be interested

బీఎస్‌ఎన్‌ఎల్‌పై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు

Tuesday 19th February 2019

నిర్ణయాల్లో జాప్యంతో ప్రైవేటు కంపెనీలకు లబ్ధి ఉద్యోగుల సంఘం ఆరోపణ న్యూఢిల్లీ: తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి మూడు రోజుల సమ్మెకు దిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. సంస్థ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా ప్రయత్నించటం లేదని, తద్వారా ప్రైవేటు టెలికం కంపెనీలకు ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తోందని ఉద్యోగుల సంఘం ఆరోపించింది. 4జీ సేవలకు గాను బీఎస్‌ఎన్‌ఎల్‌కు స్పెక్ట్రమ్‌ కేటాయింపు, భూ నిర్వహణ

వేదాంతాకు సుప్రీంలో చుక్కెదురు!

Tuesday 19th February 2019

వేదాంతాకు సుప్రీంలో చుక్కెదురు! ట్యుటికొరిన్‌ ప్లాంటు పునఃప్రారంభానికి నో జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు కొట్టివేత హైకోర్టుకు వెళ్లవచ్చని వేదాంతాకు సూచన న్యూఢిల్లీ: తమిళనాడులోని ట్యుటికోరిన్‌లో స్టెరిలైట్‌ కర్మాగారాన్ని పునఃప్రారంభానికి అత్యున్నత న్యాయస్థానం రెడ్‌ సిగ్నల్‌ వేసింది. ఈ మేరకు నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎస్‌జీటీ) ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. దీనీతో ఈ ప్లాంట్‌ పునఃప్రారంభానికి వేదాంతా చేస్తున్న తక్షణ ప్రణాళికలకు విఘాతం ఏర్పడినట్లయ్యింది. అయితే ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లవచ్చని సుప్రీంకోర్టు సూచించడం వేదాంతాకు

Most from this category