STOCKS

News


ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంక్‌ డీల్‌ సెప్టెంబర్‌ కల్లా పూర్తి !

Wednesday 11th July 2018
news_main1531328913.png-18230

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో ఈ ఏడాది సెప్టెంబరుకల్లా ఎల్‌ఐసీ మెజారిటీ వాటాను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఐఆర్‌డీఏఐ నుంచి ఎల్‌ఐసీ ఇటీవలే ఆమోదం పొందటం తెలిసిందే. ఐడీబీఐ బ్యాంక్‌ ఆస్తులు, అప్పులు, తదితర అంశాలపై ప్రస్తుతం ఎల్‌ఐసీ మదింపు నిర్వహిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఐడీబీఐ బ్యాంక్‌ మైనారిటీ వాటాదారుల కోసం ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. సెబీ టేకోవర్‌ నిబంధనల ప్రకారం, ఏదైనా కంపెనీలో  25 శాతం అంతకు మించిన ఓటింగ్‌ హక్కులున్న వాటాను కొనుగోలు చేయాలనుకుంటే, కొనుగోలు చేయాలనుకుంటున్న కంపెనీ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. కాగా ఎల్‌ఐసీ నుంచి ఓపెన్‌ ఆఫర్‌కు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన ఇంతవరకూ తమ వద్దకు రాలేదని సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి వెల్లడించారు. ఆ ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామన్నారు. ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌ వార్తల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్‌ రెండో రోజు కూడా లాభపడింది. బుధవారం బీఎస్‌ఈలో ఐడీబీఐ  షేర్‌ 7 శాతం లాభంతో రూ.57 వద్ద ముగిసింది. మొత్తం మీద ఈ షేర్‌ ఈ వారంలో 20 శాతం రేంజ్‌లో ఎగసింది. 
ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 80.96 శాతం వాటా ఉంది. ఎల్‌ఐసీ 51 శాతం వాటాను రూ.10,000- 13,000 కోట్లకు కొనుగోలు చేసే అవకాశముంది. ఎల్‌ఐసీ వాటా కొనుగోలు వల్ల ప్రభుత్వానికి నిధులేమీ రావని, ఈ మొత్తాన్ని ఐడీబీఐ బ్యాంక్‌ పునరుజ్జీవనానికి ఉపయోగిస్తారని అంచనా. బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశించాలన్న ఎల్‌ఐసీ యోచన ఐడీబీఐ బ్యాంక్‌లో మెజారిటీ వాటా కొనుగోలు ద్వారా తీరనుంది. ఐడీబీఐ బ్యాంక్‌కు చెందిన 2,000 బ్రాంచ్‌ల ద్వారా తమ పాలసీలను మరింత విస్తృతంగా విక్రయించుకునే వెసులుబాటు ఎల్‌ఐసీకి కలుగుతుంది. మరోవైపు భారీ రుణ భారంతో కుదేలైన ఐడీబీఐ బ్యాంక్‌కు ఎల్‌ఐసీ వాటా కొనుగోలు కారణంగా పుష్కలంగా మూలధన నిధులు లభిస్తాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ బ్యాంక్‌ మొండి బకాయిలు రూ.55,600 కోట్లకు, నికర నష్టాలు రూ.5,663 కోట్లకు పెరిగాయి. 
 



You may be interested

సగం సంస్థల్లో డేటా రక్షణ కరవే!

Wednesday 11th July 2018

ముంబై: దేశంలో సగం కంపెనీలు డేటా రక్షణ పరంగా సరైన చర్యలు తీసుకోలేదని ఓ సర్వేలో వెల్లడైంది. అలాగే, సున్నితమైన డేటా నిల్వ కూడా సరిగా లేదని డిజిటల్‌ సెక్యూరిటీ సంస్థ ‘జెమాల్టో’ నిర్వహించిన సర్వేలో తెలిసింది. ‘‘భారత్‌లో 48 శాతం ఐటీ నిపుణులు తాము పనిచేస్తున్న సంస్థలు డేటా రక్షణ చట్టాలకు అనుగుణంగా విధానాలను కొనసాగించడం లేదని భావిస్తున్నారు. కేవలం 48 శాతం కంపెనీలే తమ సున్నితమైన డేటా

బాండ్‌ మార్కెట్‌పై త్వరలో సెబీ చర్చా పత్రం

Wednesday 11th July 2018

ముంబై: బాండ్‌ మార్కెట్‌ అభివృద్ధి కోసం మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ త్వరలో ఒక చర్చాపత్రాన్ని విడుదల చేయనున్నది. పెద్ద కంపెనీలు తమ రుణావసరాల్లో నాలుగోవంతు భాగాన్ని బాండ్లద్వారానే సమీకరించడం తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనతో  ఈ చర్చాపత్రాన్ని సెబీ త్వరలో తేనున్నది. ఈ ఏడాది బడ్జెట్‌లో బాండ్ల మార్కెట్‌ అభివృద్ధి కోసం చర్యలు తీసుకోనున్నామని ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ చర్చాపత్రాన్ని తెస్తున్నామని, ఈ

Most from this category