STOCKS

News


జెట్‌ ఎయిర్‌వేస్‌ నష్టాలు 1,323 కోట్లు

Tuesday 28th August 2018
news_main1535434157.png-19716

ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీకి  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,323 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఇంధన వ్యయాలు బాగా పెరిగిపోవడం, రూపాయి పతనం కారణంగా ఇతర ఖర్చులు కూడా అధికం కావడం వల్ల ఈ స్థాయిలో ఈ కంపెనీకి నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.54 కోట్ల నికర లాభం వచ్చిందని జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది.  ఈ కంపెనీకి వరుసగా రెండు క్వార్టర్లలోనూ నష్టాలు వచ్చాయి. మార్చి క్వార్టర్‌లో నష్టాలు రూ.1,036 కోట్లుగా ఉన్నాయి. గత క్యూ1లో 5,953 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.6,066 కోట్లకు పెరిగిందని జెట్‌ ఎయిర్‌వేస్‌ చైర్మన్‌ నరేశ్‌ గోయల్‌ చెప్పారు. ఇంధన వ్యయాలు రూ.1,524 కోట్ల నుంచి 53 శాతం పెరిగి రూ.2,332 కోట్లకు చేరాయని తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారమైతే, ఈ ఆర్థిక ఫలితాలు ఈ నెల 9నే వెల్లడి కావలసి ఉంది. వివిధ కారణాల వల్ల వాయిదా పడి ఎట్టకేలకు సోమవారం వెలువడ్డాయి. నగదు కొరత ​తీవ్రం కావడంతో రెండేళ్లలో రూ.2,000 కోట్ల మేర వ్యయ నియంత్రణకు చర్యలు చేపట్టామని తెలిపారు. అంతే కాకుండా లాయల్టీ ప్రోగ్రామ్‌, జెట్‌ ప్రివిలేజ్‌లో వాటాను కూడా విక్రయించనున్నామని పేర్కొన్నారు.  ఈ రెండు ప్రతిపాదనలకు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని జెట్‌ ఎయిర్‌వేస్‌ చైర్మన్‌ నరేశ్‌ గోయల్‌ చెప్పారు. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు 2.1 శాతం నష్టంతో రూ.282 వద్ద ముగిసింది. 



You may be interested

ఎన్‌పీఏల పాపం యూపీఏదే..

Tuesday 28th August 2018

ముంబై: మొండిబాకీలు (ఎన్‌పీఏ) భారీగా పేరుకుపోవడానికి గత యూపీఏ ప్రభుత్వ హయాంలో విచక్షణారహితంగా రుణాలివ్వడమే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. 2008 నాటి అంతర్జాతీయ సంక్షోభానికి ముందు, ఆ తర్వాత అడ్డగోలుగా రుణాలివ్వడం జరిగిందని, వాటి ఆధారంగా యూపీఏ ప్రభుత్వం అధిక స్థాయిలో జీడీపీ వృద్ధిని చూపించుకుందని ఆయన విమర్శించారు. "ప్రతీ సంవత్సరం 28 లేదా 31 శాతం మేర రుణ వృద్ధిని ఆధారంగా చూపించి

రుణాలు ఎగ్గొట్టిన విద్యుత్‌ కంపెనీలకు చుక్కెదురు!

Tuesday 28th August 2018

న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలను ఎగవేసిన విద్యుత్‌ కంపెనీలపై దివాలా చర్యలు చేపట్టేందుకు బ్యాంకులకు మార్గం సుగమం అయింది. మొండి బకాయిలుగా (ఎన్‌పీఏ) మారి 180 రోజుల్లోపు పరిష్కారం లభించని ఖాతాలను బ్యాంకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించాలని ఆర్‌బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 12న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. మార్చి 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రాగా, దీనికి వ్యతిరేకంగా విద్యుత్‌ కంపెనీలు

Most from this category