STOCKS

News


చర్యల కంటే పోస్ట్‌మార్టమ్‌ చేయడం తేలికే

Wednesday 26th September 2018
news_main1537939504.png-20584

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంలో తదుపరి సంక్షోభం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ఇచ్చిన రుణాల రూపంలో రానుందంటూ ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తిప్పికొట్టారు. అవసరమైన సమయంలో చర్యలు తీసుకోవడం కంటే శవ పంచనామా (పోస్ట్‌మార్టమ్‌/జరిగిన తర్వాత విశ్లేషణ) చేయటం సులువేనని వ్యాఖ్యానించారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేయడానికి పూర్వం రాజన్‌ ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్నారు. అప్పట్లో 2008 నాటి సంక్షోభంపై ముందే హెచ్చరించారు. రుణాలకు సంబంధించిన లక్ష్యాలు, రుణ మాఫీలన్నవి తదుపరి సంక్షోభానికి మూలం అవుతాయని పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన నోట్‌లో రాజన్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని విలేకరులు జైట్లీ ముందు ప్రస్తావించగా, ‘‘అవసరమైనప్పుడు చర్యలు తీసుకోవడం కంటే పోస్ట్‌మార్టమ్‌ను ఎవరైనా సులభంగా నిర్వహించగలరన్నది నా అభిప్రాయం’’ అని జైట్లీ చెప్పారు. 
రుణ లక్ష్యాలకు దూరంగా ఉండాలి...
‘‘ప్రభుత్వం తదుపరి సంక్షోభ మూలాలపై దృష్టి పెట్టాలి. చివరి సారి చోటు చేసుకున్నదాని గురించి కాదు. ముఖ్యంగా ప్రతిష్టాత్మక రుణ జారీ లక్ష్యాలను నిర్దేశించకుండా లేదా రుణ మాఫీలకు ప్రభుత్వం దూరంగా ఉండాలి. రుణ లక్ష్యాలనేవి కొన్ని సందర్భాల్లో తగినంత జాగ్రత్తలు తీసుకోకపోవడం ద్వారా సాధించొచ్చు. కానీ, భవిష్యత్తు ఎన్‌పీఏల వాతావరణానికి ఇది దారితీస్తుంది’’ అని పార్లమెంటరీ కమిటీకి రాజన్‌ తెలియజేశారు. ముద్రా రుణాలు, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను రిస్క్‌ విషయమై మరింత నిశితంగా పరిక్షించాల్సి ఉందన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి సంబంధించి సిడ్బీ నిర్వహిస్తున్న క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌తో అనిశ్చిత బాధ్యతలు పెరిగిపోతున్నందున సత్వరమే వీటిని పరీశీలించాలని సూచించారు. 

‘ఐఎల్‌ఎఫ్‌ఎస్‌’... చూస్తూనే ఉన్నాం 
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు చెల్లింపుల్లో విఫలం కావడం వల్ల ఫైనాన్షియల్‌ మార్కెట్లో లిక్విడిటీ సమస్య తలెత్తుతుందన్న ఆందోళనలు నెలకొనడంతో... ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. పరిస్థితిని ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని తెలియజేశారు. వివిధ రంగాలకు అవసరమైన మేర నిధులను అందుబాటులో ఉంచే విషయమై బ్యాంకులు విశ్వాసాన్ని వ్యక్తం చేశాయని ప్రభుత్వరంగ బ్యాంకుల సమీక్ష అనంతరం జైట్లీ చెప్పారు. ‘‘ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఈ విషయంలో ఎల్‌ఐసీ చైర్మన్‌ చెప్పిన దానికి అదనంగా నేను చెప్పేదేమీ లేదు’’ అని జైట్లీ స్పష్టం చేశారు. ఓ వాటాదారుగా ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను మునిగిపోకుండా చూస్తామని ఎల్‌ఐసీ చైర్మన్‌ వీకే శర్మ పేర్కొన్న విషయం గమనార్హం. You may be interested

వచ్చే నెల్లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ సేల్‌

Wednesday 26th September 2018

న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ అక్టోబర్‌లో 'ది బిగ్ బిలియన్ డేస్‌' (టీబీబీడీ) సేల్ ప్రారంభించనుంది. టీబీబీడీ అయిదో ఎడిషన్‌ అక్టోబర్ 10 నుంచి 14 దాకా ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, ఫర్నిచర్ మొదలైన వాటన్నింటిపై భారీ ఆఫర్లు ఉంటాయని సంస్థ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. వచ్చే నెల పండుగ సీజన్‌లో వివిధ ఈ-కామర్స్ సైట్లలో

కపూర్‌ పదవీ కాలాన్ని పొడిగించండి

Wednesday 26th September 2018

ముంబై: యస్‌ బ్యాంక్‌ ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాణా కపూర్‌ పదవీ కాలాన్ని కనీసం మరో మూడు నెలలు పొడిగించాలని ఆర్‌బీఐని కోరాలని యస్‌ బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌ నిర్ణయించింది. మంగళవారం జరిగిన కంపెనీ కీలకమైన బోర్డ్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని బ్యాంకు వెల్లడించింది. మరోవైపు కపూర్‌ వారసుడి ఎంపిక కోసం సెర్చ్‌, సెలక్షన్‌ కమిటీని కూడా డైరెక్టర్ల బోర్డ్‌ నియమించింది. దీర్ఘకాలిక వారసత్వ ప్రణాళికలో భాగంగా

Most from this category