STOCKS

News


మోసాలు, ఎగవేతలపై కఠిన చర్యలు తీసుకోండి

Wednesday 26th September 2018
news_main1537939204.png-20580

న్యూఢిల్లీ: మోసాలు, ఉద్దేశపూర్వక ఎగవేతలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సూచించారు. 8 శాతం స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆర్థిక రంగం వృద్ధి చెందడం వల్ల బ్యాంకుల సామర్థ్యం కూడా బలపడుతుందని మంగళవారం ఢిల్లీలో జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల వార్షిక సమీక్షలో చెప్పారాయన. పీఎస్‌యూ బ్యాంకుల చీఫ్‌లు పాల్గొన్న ఈ సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ... ‘‘ఆర్థిక రంగ జీవనాడి అయిన బ్యాంకులు... ఎదిగే ఆర్థిక వ్యవస్థ రుణ అవసరాలకు తీర్చే విధంగా వాటి సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి. అదే సమయంలో రుణాల విషయంలో తమ వైపు నుంచి లోపాలకు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మోసాలు,  ఉద్దేశపూర్వక ఎగవేతలు చోటు చేసుకుంటే కఠిన చర్య తీసుకోవడం ద్వారా బ్యాంకులపై ఉన్న విశ్వాసానికి న్యాయం చేకూర్చాలి. పరిశుద్ధమైన, వివేకంతో కూడిన రుణాలు జారీ చేసే సంస్థల్లా బ్యాంకులు పనిచేయాలి’’ అని సూచించారు. ఇటీవలే ప్రభుత్వరంగంలోని బ్యాంకు ఆఫ్‌ బరోడా, విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ఖరారు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించగా, ఇదే సమయంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. మొండి బకాయిల (ఎన్‌పీఏల) రికవరీకి  ఇటీవలి కాలంలో​ ప్రభుత్వరంగ బ్యాంకులు తమ చర్యల్ని ముమ్మరం చేశాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో (జూన్‌ క్వార్టర్‌) రూ.36,551 కోట్లను వసూలు చేశాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పోలిస్తే 49 శాతం అధికంగా వసూలు చేసుకున్నాయి. దీనిపై జైట్లీ మాట్లాడుతూ... ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి మరింత సానుకూలంగా ఉందన్నారు. ఎన్‌పీఏల పరిష్కారం, వసూళ్లు, వీటికి నిధుల కేటాయింపులు, రుణ వృద్ధి అంశాల్లో సానుకూల ఫలితాలను చూపిస్తున్నాయని చెప్పారు. అందరికీ ఆర్థిక సేవల విషయంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రాధాన్యాన్ని జైట్లీ గుర్తు చేశారు. అదే సమయంలో నాన్‌ రిటైల్‌ బ్యాంకింగ్‌ సేవల విషయంలో ఇతర రుణదాతల నుంచి మద్దతు సరిపడా లేదని పేర్కొన్నారు. 
స్థిరంగా 8 శాతం వృద్ధి  
‘‘ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ), జీఎస్టీ, డీమోనిటైజేషన్‌, డిజిటల్‌ పేమెంట్స్‌ ద్వారా ఆర్థిక రంగాన్ని వ్యవస్థీకృతం చేశాం. దీనివల్ల ఆర్థిక సామర్థ్యం, సవాళ్లను మరింతగా అంచనా వేయటం సాధ్యమైంది. వీటికితోడు అందరికీ ఆర్థిక సేవలతో సమ్మిళిత వృద్ధి, కొనుగోలు సామర్థ్యం వంటివి భారత ఆర్థిక వృద్ధిని నడిపించనున్నాయి’’ అని జైట్లీ వివరించారు. భారత్‌ 8 శాతం స్థిరమైన వృద్ధి రేటు సాధించేందుకు ఇవి తోడ్పడతాయని జైట్లీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు 8.2గా అంచనా వేసిన విషయం తెలిసిందే. ఐబీసీ యంత్రాంగం నుంచి వస్తున్న సానుకూల ఫలితాలను ప్రస్తావించిన జైట్లీ... రుణ వసూళ్ల ట్రిబ్యునల్‌ (డీఆర్‌టీ) యంత్రాంగం కేసుల పరిష్కారానికి మరింత సమయం తీసుకుంటున్నందున దీన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. డీఆర్‌టీ ద్వారా వసూళ్లను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. You may be interested

టేకోవర్‌కు సిద్ధంగా వీడియోకాన్‌

Wednesday 26th September 2018

న్యూఢిల్లీ: వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ చేతులు మారనుంది. రూ.20,000 కోట్ల రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌పై ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ కోడ్‌(ఐబీసీ) కింద దివాలా ​‍ప్రక్రియ కొనసాగుతోంది. ఈ దివాలా ప్రక్రియలో భాగంగా వీడియోకాన్‌ను టేకోవర్‌ చేయాలనుకుంటున్న సంస్థలు బిడ్‌లు సమర్పించాలని రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ అనుజ్‌ జైన్‌ తాజాగా ఒక ప్రకటన చేశారు. వచ్చే నెల 5లోపు బిడ్‌లు సమర్పించాలని జైన్‌ పేర్కొన్నారు. కన్సూమర్‌ డ్యూరబుల్స్‌  వ్యాపారంలో వీడియోకాన్‌

రిజర్వ్ బ్యాంక్‌ సీఆర్‌ఆర్ తగ్గించాలి

Wednesday 26th September 2018

న్యూఢిల్లీ: వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉండేలా చూసేందుకు రిజర్వ్ బ్యాంక్.. ప్రభుత్వ బాండ్ల కొనుగోలుతో పాటు నగదు నిల్వల నిష్పత్తిని  (సీఆర్‌ఆర్‌) కూడా తగ్గించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. "లిక్విడిటీ నిర్వహణకు రిజర్వ్ బ్యాంక్ ఓఎంఓ (ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్) వంటి సాధనాలుంటాయి. అలాగే, సీఆర్‌ఆర్‌ను తగ్గించడం ద్వారా కూడా మార్కెట్లో తక్షణం తగినంత లిక్విడిటీ ఉండేలా చూడొచ్చు" అని కేంద్ర ప్రభుత్వ అధికారి

Most from this category