STOCKS

News


జెట్‌ విమానం జప్తు..

Thursday 11th April 2019
news_main1554960233.png-25062

బాకీలు చెల్లించకపోవడంతో ఆమ్‌స్టర్‌డామ్‌లో నిలిపివేత
బిడ్స్‌ దాఖలుకు గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. బాకీలు చెల్లించడంలో విఫలమైనందుకు గాను జెట్ ఎయిర్‌వేస్‌కి చెందిన విమానాన్ని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఒక యూరోపియన్ కార్గో సంస్థ స్వాధీనం చేసుకుంది. "బాకీలు చెల్లించకపోవడంతో జెట్ ఎయిర్‌వేస్‌కి చెందిన బోయింగ్‌ 777-300 ఈఆర్‌ (వీటీ జేఈడబ్ల్యూ)ను ఆమ్‌స్టర్‌డామ్‌ విమానాశ్రయంలో కార్గో ఏజెంటు జప్తు చేశారు" అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి ముంబైకి నడపాల్సిన విమానం సర్వీసు నిర్వహణపరమైన కారణాల వల్ల రద్దు చేసినట్లు అటు జెట్ ఎయిర్‌వేస్ కూడా పేర్కొనడం గమనార్హం. రుణాలను చెల్లించడంలో విఫలమవుతున్న జెట్ విమానాన్ని లెస్సర్లు జప్తు చేసుకోవడం ఇదే ప్రథమం. మరోవైపు, జెట్ ఎయిర్‌వేస్‌లో వాటాల విక్రయానికి సంబంధించి నిర్దేశిత ఏప్రిల్ 10వ తారీఖు గడువులోగా బిడ్స్ రాకపోవడంతో డెడ్‌లైన్‌ను పొడిగించాలని బ్యాంకులు నిర్ణయించాయి. ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) దాఖలుకు డెడ్‌లైన్‌ను ఏప్రిల్ 12 దాకా పొడిగించాయి. తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్‌వేస్ ప్రస్తుతం మూడో వంతు విమానాలను మాత్రమే నడుపుతున్న సంగతి తెలిసిందే. గతంలో 119 విమానాలు ఉండగా.. ప్రస్తుతం సుమారు 26 మాత్రమే నడుపుతోంది. సంస్థ యాజమాన్యాధికారాలను తమ చేతుల్లోకి తీసుకున్న బ్యాంకులు.. వాటాలను విక్రయించే పనిలో ఉన్నాయి. ప్రమోటరు నరేష్ గోయల్‌ జెట్ బోర్డు నుంచి తప్పుకున్నారు. తమ  జీతాలు కూడా చెల్లించకపోవడంతో పైలట్లు సైతం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటూ మేనేజ్‌మెంట్‌కు నోటీసులిచ్చారు.

ఐవోసీ ఇంధన సరఫరా బంద్‌...
బాకీలు చెల్లించనందుకు గాను జెట్‌ ఎయిర్‌వేస్‌కు బుధవారం ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్‌ (ఐవోసీ) మరోసారి ఇంధన సరఫరాను నిలిపివేసింది. గడిచిన ఎనిమిది రోజుల వ్యవధిలో ఇలా ఇంధనాన్ని నిలిపివేయడం ఇది మూడోసారి. "ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లలో జెట్ ఎయిర్‌వేస్‌కు ఇండియన్ ఆయిల్ ఇంధన సరఫరా నిలిపివేసింది" అని సంబంధిత వర్గాలు తెలిపాయి. 



You may be interested

అనుమతుల్లేకుండా కార్యకలాపాలెలా సాగిస్తోంది

Thursday 11th April 2019

- 'గూగుల్‌ పే' పై వివరణనివ్వాలంటూ ఆర్‌బీఐకి కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: నియంత్రణ సంస్థ అనుమతుల్లేకుండా మొబైల్ పేమెంట్ యాప్ 'గూగుల్‌ పే' (జీపే) ఆర్థిక లావాదేవీల నిర్వహణ ఎలా సాగిస్తోందన్నదానిపై వివరణనివ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్‌ను, గూగుల్‌ ఇండియా సంస్థను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదావేసింది. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ చట్టానికి విరుద్ధంగా గూగుల్ పే సంస్థ పేమెంట్స్ సిస్టమ్ ప్రొవైడర్‌గా కార్యకలాపాలు సాగిస్తోందంటూ

రియల్టీలోకి ముకేష్ అంబానీ!!

Thursday 11th April 2019

- ముంబై దగ్గర్లో మెగాసిటీ - ఐదు లక్షల మందికి నివాసం - పదేళ్లలో 75 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు న్యూఢిల్లీ: చౌక చార్జీల జియోతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన వ్యాపార దిగ్గజం ముకేష్‌ అంబానీ తాజాగా రియల్‌ ఎస్టేట్‌ రంగంపై దృష్టి పెడుతున్నారు. రియల్టీలో కూడా సంచలనం సృష్టించేలా సింగపూర్‌ తరహాలో భారీ మెగా సిటీకి రూపకల్పన చేస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి దగ్గర్లో దీన్ని తలపెట్టినట్లు సమాచారం. ఈ

Most from this category