STOCKS

News


ఐటీసీని మలిచిన శిల్పి

Monday 13th May 2019
news_main1557729246.png-25701

  • ఇంటింటికీ ఐటీసీని చేర్చిన వైసీ దేవేశ్వర్‌
  • ఆయన సారథ్యంలో బహుముఖ కంపెనీగా పటిష్టం
  • దేశవ్యాప్తంగా 60 లక్షల మందికి ఉపాధి
  • తొలుత చేరిన కంపెనీకే నాయకుడయ్యారు
  • 23 ఏళ్ల పాటు చైర్మన్‌గా ఐటీసీ భారీ విస్తరణ
  • 72వ ఏట కేన్సర్‌తో దేశాన్ని వీడి దిగంతాలకు

సాధారణ ఉద్యోగిగా చేరిన ఓ వ్యక్తి తనకు ఉపాధినిచ్చిన కంపెనీకి కొత్త జీవాన్నిచ్చారు. చిన్న చెట్టును మర్రిమానును చేశారు. కేవలం సిగరెట్లను అమ్ముకునే ఓ కంపెనీని, ఆహార ఉత్పత్తులు, స్టేషనరీ, అగ్రి, తదితర ఉత్పత్తులతో ప్రతీ భారతీయ ఇంటికీ చేరువ చేశారు. భారత కార్పొరేట్‌ సామ్రాజ్యంలో ఓ చెక్కు చెదరని, బలమైన కంపెనీగా ఐటీసీని మలిచిన శిల్పి యోగేష్‌ చందర్‌ దేవేశ్వర్‌ (వైసీ దేవేశ్వర్‌). కేవలం వ్యాపార కోణంతో కాకుండా సామాజిక కోణాన్ని జోడించి, దేశానికి అవసరమైన సంస్థగా ఐటీసీని దేవేశ్వర్‌ నిలిపారనడం సరైనది. దేశంలో 60 లక్షల మందికి ఉపాధి కూడా చూపించారు. తాను పెంచి పెద్ద చేసిన కంపెనీని, కోట్లాది వినియోగదారుల్ని 72వ ఏట విడిచి మే 11న దిగంతాలకు వెళ్లిన గొప్ప దార్శనికుడు, పద్మభూషణ్‌ దేవేశ్వర్‌ గురించి.....

శాఖోపశాఖలుగా...
కాలేజీ నుంచి బయటకు వచ్చి ఉద్యోగిగా చేరిన కంపెనీకే అధినేతగా ఎదగడమే కాకుండా, సుదీర్ఘ కాలం పాటు అంటే 23 ఏళ్లు ఐటీసీసికి చైర్మన్‌గా పనిచేయడం దేవేశ్వర్‌కే సాధ్యమైంది. చిన్న వయసులోనే చైర్మన్‌ అయిన వ్యక్తిగానూ, ఓ కార్పొరేట్‌ సంస్థకు సుదీర్ఘకాలం పాటు అధినేతగా పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్నారు. 1968లో దేవేశ్వర్‌ ఐటీసీ ఉద్యోగిగా తన ప్రయాణం ఆరంభించారు. 1984లో కంపెనీ బోర్డులో చేరారు. 1996లో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బాధ్యతలు చేపట్టారు. ఐఐటీ ఢిల్లీ, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థి ఆయన. దేవేశ్వర్‌ కంపెనీ సారధ్య బాధ్యతలు చేపట్టే నాటికే కోల్‌కతా కేంద్రంగా నడిచే ఐటీసీ కంపెనీ నాన్‌ టుబాకో వ్యాపారాల్లోకీ ప్రవేశించింది. కానీ, వాటి పరిధి చాలా తక్కువ. రాజకీయ వర్గాలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు పొగాకును ఆరోగ్యాన్ని కబళించే ఉత్పత్తిగా చూసే పరిస్థితులను దేవేశ్వర్‌ పరిగణనలోకి తీసుకున్నారు. ఐటీసీని ఇతర వ్యాపారాల్లో బలమైన కంపెనీగా నిలిపే ప్రణాళికలను అమల్లో పెట్టారు. ఫలితమే ఎఫ్‌ఎంసీజీ, హోటల్స్‌, పేపర్‌ బోర్డు పరిశ్రమల్లోనూ ఐటీసీ బ్రాండ్‌ అగ్రగామిగా ఎదిగింది. పాలు, పాల ఉత్పత్తులు, పండ్ల రసాలు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌, అగర్‌బత్తీలు, సబ్బులు, స్టేషనరీ, వస్త్రాలు, ప్యాకేజింగ్‌, లగ్జరీ, హోటళ్లు, అగ్రి ఇలా ఎన్నో వ్యాపార విభాగాలు ఐటీసీ కింద ఉన్నాయి. ఎన్ని వ్యాపారాల్లోకి ప్రవేశించినా వాటన్నింటినీ ఐటీసీ కొమ్మలుగా, ఒకే కంపెనీగా దేవేశ్వర్‌ కొనసాగించారు. ఇప్పుడు ఐటీసీకి సిగరెట్లు ఒక్కటే ప్రధాన వ్యాపారం కాదన్నట్టుగా మార్చారు. 2018 మార్చి నాటికి ఐటీసీ స్థూల ఆదాయం రూ.67,081 కోట్లు కాగా, నికర లాభం రూ.11,223 కోట్లు. 2018-19 ఆర్థిక సంవత్సరం ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి వచ్చింది.
       
గ్రామీణ రైతులతో అనుసంధానం
ఈచౌపల్‌ ఐటీసీ ప్రారంభించిన ఓ వినూత్న విధానం. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను ఇంటర్నెట్‌కు అనుసంధానించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. తద్వారా రైతుల నుంచి నేరుగా ఉత్పత్తుల సమీకరణకు ద్వారాలు తెరిచారు. ప్రారంభంలో ఫలితాలు ఆశాజనకంగా లేకపోయినప్పటికీ దీర్ఘకాల దృష్టితో దాన్ని కొనసాగించింది ఐటీసీ. దేవేశ్వర్‌ క్లిష్ట సందర్భాల్లోనూ దృఢంగానే వ్యవహరించారు. కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా ఉన్న బ్రిటిష్‌ అమెరికన్‌ టుబాకో (బీఏటీ) ఐటీసీని పూర్తిగా సొంతం చేసుకునే వ్యూహాలు పన్నగా, దాన్ని నిరోధించడంలో సక్సెస్‌ అయ్యారు. ప్రస్తుతం ఐటీసీలో అత్యధిక వాటా దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌, భారత ప్రభుత్వం వద్ద వుంది.

మధ్యలో ఎయిర్‌ ఇండియా బాధ్యతలు
భారత ప్రభుత్వం కోరిక మేరకు 1991-94 మధ్య కాలంలో ఐటీసీ నుంచి విరామం తీసుకుని ఎయిర్‌ ఇండియా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాధ్యతలను దేవేశ్వర్‌ చూశారు. ఆ సమయంలోనే బీఏటీ ఐటీసీని తన సొంతం చేసుకోవాలన్న ప్రయత్నాలను మొదలు పెట్టడం గమనార్హం. ఐటీసీకి తిరిగొచ్చిన తర్వాత వైస్‌ చైర్మన్‌గా బాధ్యతల్లోకి చేరిపోయారు. ఎయిర్‌ ఇండియాలో పనిచేసిన కాలం ఆయనకు గొప్ప అనుభవాన్నిచ్చింది. ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి, వాటితో ఎలా నడచుకుకోవాలన్నది తెలుసుకోగలిగారు. 

ఉద్యోగులకు మార్గదర్శకుడు
బహుముఖ వ్యాపారాలతో కూడిన ఐటీసీ అన్ని విభాగాల్లో రాణించడానికి కారణం... ఆయా విభాగాల్లోని యువ ఉద్యోగులపై నమ్మకం ఉంచడం. వారికి మార్గదర్శకులుగా వ్యవహరించడమే. అందుకే కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు వీడినప్పటికీ... 2022 వరకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఐటీసీ బోర్డు ఆయన్ను నియమించుకుంది. ప్రస్తుతం ఐటీసీ ఎండీ బాధ్యతలను సంజయ్‌పురి నిర్వహిస్తున్నారు. దేవేశ్వర్‌కు కేన్సర్‌ ఉన్నట్టు కొన్ని సంవత్సరాల క్రితమే నిర్ధారణ అయింది. చికిత్స కోసం ఏడాది క్రితం ఢిల్లీకి ఆయన మకాం మార్చారు. అయినప్పటికీ ఐటీసీ సినియర్‌ మేనేజ్‌మెంట్‌కు అందుబాటులోనే ఉన్నారు.
 
ఇంటింటికీ ఐటీసీ బ్రాండ్లు
ఇతర వ్యాపారాల్లోకి బహుముఖంగా ఐటీసీ చొచ్చుకుపోయినా గానీ, తొలుత ఆరంభించిన సిగరెట్ల వ్యాపారాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. దేశ సిగరెట్ల మార్కెట్‌లో 80 శాతానికి పైగా వాటా ఐటీసీ చేతుల్లోనే ఉంది. ఆశీర్వాద్‌, సన్‌ఫీస్ట్‌, క్లాస్‌మేట్‌, బింగో, బీ నేచురల్‌, ఫియామో ఇలా 50 టాప్‌ బ్రాండ్లను ఐటీసీ సృష్టించింది. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ విభాగంలో ఐటీసీ టాప్‌ కంపెనీల్లో ఒకటిగా అంతరించడం వెనుక దేవేశ్వర్‌, ఆయన బృందం కృషి ఎంతో ఉంది. ఐటీసీని భారత బహుళజాతి సంస్థగా మార్చిన దేవేశ్వర్‌, 2030 నాటికి ఒక్క ఎఫ్‌ఎంసీజీ వ్యాపారం నుంచే రూ.లక్ష కోట్ల ఆదాయం గడించాలన్నది ఆశయం. దేవేశ్వర్‌ కలలను సాకారం చేసే దిశగా ఐటీసీ కొనసాగుతోందని కంపెనీ ఎండీ పురి ప్రకటించడం గమనార్హం.
 
కొన్ని మైలురాళ్లు

  • 1968లో ఐటీసీలో ఉద్యోగం. 1996లో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బాధ్యతలు. 
  • 2017లో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బాధ్యతలకు ముగింపు. ఆ తర్వాత గౌరవ చైర్మన్‌ బాధ్యతల్లోకి. 
  • ఆర్‌బీఐ సెంట్రల్‌బోర్డు డైరెక్టర్‌, నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సభ్యునిగానూ సేవలు అందించారు. 
  • 2011లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో ఆయన్ను గౌరవించింది. 
  • ప్రపంచంలోనే ఏడో అత్యుత్తమ పనితీరు చూపిన సీఈవోగా 2012లో హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ గుర్తించింది. 
  • దేవేశ్వర్‌కు భార్య భారతి, కుమారుడు గౌరవ్‌, కుమార్తె గరిమ ఉన్నారు. 


‘‘దేశ పారిశ్రామిక రంగానికి వైసీ దేవేశ్వర్‌ ఎన్నో సేవలు అందించారు. ఆయన కృషి వల్లే ఐటీసీ వృత్తి నైపుణ్యం కలిగిన కంపెనీగా అంతర్జాతీయంగా విస్తరించింది’’
- ప్రధాని నరేంద్ర మోదీ

స్థిరమైన, సమగ్రమైన వృద్ధి కోసం, పెద్ద ఎత్తున సామాజిక విలువలతో కూడిన వ్యాపారంగా మార్చడంలో దేవేశ్వర్‌ ఓ ఛాంపియన్‌. దేశభక్తి స్ఫూర్తితో దేశమే ముందు (ఇండియా ఫస్ట్‌) పిలుపుతో దేశ ప్రయోజనాల కోసం పాటు పడే భారతీయ సంస్థగా తీర్చిదిద్దారు. దేవేశ్వర్‌ నాయకత్వంలో ఐటీసీ విలువైన, విశ్వసనీయ బహుముఖ వ్యాపార అగ్రగామి సంస్థగా అవతరించింది’’
- ఐటీసీ ఎండీ సంజయ్‌ పురి

 



You may be interested

స్పైస్‌జెట్ దివాలా పిటీషన్‌ తిరస్కృతి

Monday 13th May 2019

న్యూఢిల్లీ: నిర్వహణపరమైన రుణాలు బాకీ పడిన చౌక విమానయాన చార్జీల సంస్థ స్పైస్‌జెట్‌పై దివాలా ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ రామ్‌కో సిస్టమ్ దాఖలు చేసిన పిటీషన్‌ను నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) తిరస్కరించింది.  ఇలాంటి కేసుల్లో రుణాలు, డిఫాల్ట్‌కి సంబంధించిన కచ్చితమైన వివరాలు అవసరమవుతాయని, ఈ కేసులో అలాంటి ఆధారాలు కనిపించడం లేదని పేర్కొంది. రామ్‌కో సిస్టమ్ ఇన్వాయిస్‌లకు సంబంధించి జారీ అయిన డిమాండ్ నోటీసులను

మూడేళ్ల కోసం ఏ డెట్‌ ఫండ్‌ బెటరు?

Monday 13th May 2019

ప్ర:  దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేసే ఉద్దేశంతో కొన్ని ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)లను ప్రారంభించాను. నా పోర్ట్‌ఫోలియోలో డెట్‌ సాధనాలేవీ లేవు. డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ నిమిత్తం అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌లో  ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ? -శేఖర్‌, విజయవాడ జ: ఇది ఒక విధంగా మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు. పైగా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే ఇలా చేయకుండా పూర్తి స్థిరాదాయ

Most from this category