STOCKS

News


తెలంగాణలో బెనెల్లి బైక్స్‌ అసెంబ్లింగ్‌ ప్లాంట్‌

Tuesday 7th August 2018
news_main1533618452.png-18992

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
ఇటాలియన్‌ సూపర్‌ బైక్స్‌ బ్రాండ్‌ ‘బెనెల్లి’ భారత్‌లో తయారీకి ముందుకు వచ్చింది. ఇందుకు తెలంగాణ వేదిక అవుతోంది. సోమవారమిక్కడ తెలంగాణ ప్రభుత్వంతో ఈ మేరకు ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో బెనెల్లి బోర్డ్‌ డైరెక్టర్‌ జార్జ్‌ వాంగ్‌, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. బెనెల్లి భారత భాగస్వామి అయిన ఆటోమొబైల్‌ రిటైల్‌ సంస్థ మహవీర్‌ గ్రూప్‌ కంపెనీ ఆదీశ్వర్‌ ఆటో రైడ్‌ ఇండియా హైదరాబాద్‌ సమీపంలోని పోచంపల్లి వద్ద తొలుత 3 ఎకరాల్లో అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. రెండవ దశలో 20 ఎకరాల విస్తీర్ణంలో తయారీ ప్లాంటును నెలకొల్పుతారు. 
ప్రభుత్వం నుంచి సహకారం..
ప్లాంట్ల ఏర్పాటుకు బెనెల్లికి కావాల్సిన పూర్తి సహకారం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉంటుందని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. అన్ని రకాల ప్రోత్సాహకాలు ఉంటాయని స్పష్టం చేశారు. ‘అద్భుతమైన బైక్స్‌ బెనెల్లి సొంతం. ఇప్పుడు భారత్‌లో రోడ్లు మెరుగయ్యాయి. ఇటువంటి బ్రాండ్లకు ఆదరణ పెరుగుతోంది. అయితే తయారైన వాహనాల రవాణా పరంగా చూస్తే హైదరాబాద్‌ అనువుగా ఉంటుంది. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సులువుగా సరఫరా చేయవచ్చు. అలాగే ఆగ్నేయాసియా దేశాలు, బంగ్లాదేశ్‌ వంటి మార్కెట్లకూ ఎగుమతికి వీలుంది’ అని అన్నారు. ఇంజనీరింగ్‌ స్కిల్స్‌ కలిగిన అభ్యర్థులు, నాణ్యమైన విడిభాగాల తయారీ కంపెనీలు ఇక్కడ ఉన్నందునే ప్లాంటు ఏర్పాటుకు తెలంగాణను ఎంచుకున్నారని జయేశ్‌ రంజన్‌ అన్నారు.
తొలి బైక్‌ అక్టోబరులో..
అసెంబ్లింగ్‌ ప్లాంటు నుంచి బెనెల్లి తొలి బైక్‌ 2018 అక్టోబరులో రోడ్డెక్కనుందని ఆదీశ్వర్‌ ఆటో రైడ్‌ ఇండియా ఎండీ వికాస్‌ జబక్‌ వెల్లడించారు. 7,000 యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ప్లాంటు రానుందన్నారు. రెండో దశలో బైక్‌లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. మూడు దశాబ్దాల్లో మెర్సిడెస్‌ బెంజ్‌, ఇసుజు, స్కోడా, బెనెల్లి బ్రాండ్లలో 50,000లకుపైగా కస్టమర్లను సొంతం చేసుకున్నామని మహవీర్‌ గ్రూప్‌ చైర్మన్‌ యశ్వంత్‌ జబక్‌ తెలిపారు. కాగా, ఈ ఏడాదే లెంచినో, లెంచినో ట్రయల్‌, టీఆర్‌కే 502, టీఆర్‌కే 502 ఎక్స్‌, టీఎన్‌టీ 302 ఎస్‌ బైక్‌లు రోడ్డెక్కనున్నాయని బెనెల్లి చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ డాంటే బస్టోస్‌ తెలిపారు. 250 సీసీ బైక్‌లు 2019లో ప్రవేశపెడతామన్నారు. భారత్‌లో బైక్‌ల ధర రూ.2 లక్షలతో మొదలై రూ.6 లక్షల వరకు ఉంది.


 You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్ల పెంపు

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. రిజర్వ్‌ బ్యాంకు ఎంపీసీ ఇటీవలే పావు శాతం మేర కీలక రేట్లను పెంచడంతో, హెచ్‌డీఎఫ్‌సీ సైతం ఈ దిశగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 6 నెలల ఒక రోజు నుంచి 5 ఏళ్ల వరకు, పలు కాల వ్యవధుల డిపాజిట్లపై 0.6 శాతం వరకు పెంచింది. ఈ పెంచిన రేట్లు సోమవారం నుంచే అమల్లోకి

ఎస్కార్ట్స్‌ గ్రూపు చైర్మన్‌ రాజన్‌నందా కన్నుమూత

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ఎస్కార్ట్స్‌ గ్రూపు చైర్మన్‌ రాజన్‌ నందా (76) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. నందా 1965లో 23 ఏళ్ల వయసులో ఎస్కార్ట్స్‌లో చేరారు. 1994లో తన తండ్రి, గ్రూపు వ్యవస్థాపక చైర్మన్‌ హెచ్‌పీ నందా తప్పుకోవడంతో, ఆ బాధ్యతలు స్వీకరించి గ్రూపు చైర్మన్‌ అయ్యారు. పలు వాణిజ్య, పారిశ్రామిక సంఘాల్లో ఆయన సభ్యులుగా ఉన్నారు. సీఐఐ నేషణల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా, వ్యవసాయ

Most from this category