STOCKS

News


40వేల కోట్ల పెట్టుబడులు!!

Tuesday 8th January 2019
news_main1546943378.png-23470

- ఓఏఎల్‌పీ రెండో రౌండు వేలంపై అంచనా
- 14 బ్లాక్‌ల వేలం ప్రక్రియ ప్రారంభం
- మార్చి 12లోగా బిడ్ల దాఖలు


న్యూఢిల్లీ: ఓపెన్ ఏకరేజ్‌ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద తలపెట్టిన రెండో విడత చమురు, గ్యాస్ బ్లాక్‌ల వేలం ద్వారా రూ. 40,000 కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా వేస్తున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. గతేడాది నిర్వహించిన తొలి విడతలో 55 బ్లాక్‌లు వేలం వేయగా రూ. 60,000 కోట్ల మేర పెట్టుబడులకు కమిట్‌మెంట్ లభించినట్లు ఆయన తెలియజేశారు. రెండో విడతలో 14 బ్లాక్‌లు ఉన్నట్లు సోమవారం వేలం ప్రక్రియ ప్రారంభించిన సందర్భంగా మంత్రి చెప్పారు. మూడో విడత కింద 12 చమురు, గ్యాస్ బ్లాక్‌లు, అయిదు కోల్ బెడ్ మీథేన్ బ్లాక్‌ల వేలం వేయనున్నామని, ఈ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభం కాగలదని ఆయన చెప్పారు.  ఓఏఎల్‌పీ-2 కింద వేలం వేసే 14 బ్లాక్‌ల విస్తీర్ణం 29,333 చ.కి.మీ. ఉంటుందని, బిడ్‌ల దాఖలుకు మార్చి 12 తుది గడువుగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. 
12,600 మిలియన్ టన్నుల నిక్షేపాలు..
కేజీ బేసిన్‌లో ఒక డీప్‌ వాటర్ బ్లాక్‌తో పాటు అండమాన్‌, కచ్ బేసిన్‌లో చెరి రెండు, మహానది బేసిన్‌లో ఒక బ్లాక్ వేలం వేస్తున్న వాటిలో ఉన్నాయి. ఈ 14 బ్లాక్‌లలో దాదాపు 12,609 మిలియన్ టన్నుల చమురు, తత్సమాన గ్యాస్ నిక్షేపాలు ఉండొచ్చని అంచనా. ఓఏఎల్‌పీ -1 లో మొత్తం 55 బ్లాకులు వేలం వేయగా వేదాంత సంస్థ 41 బ్లాకులు దక్కించుకుంది. మిగతావాటిలో ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ ఇండియా తొమ్మిది, ఓఎన్‌జీసీ కేవలం రెండు మాత్రమే దక్కించుకున్నాయి. ఈ 55 బ్లాక్‌ల విస్తీర్ణం 59,282 చ.కి.మీ. ఉంటుంది. ప్రస్తుతం ఉత్పత్తి, అన్వేషణ లైసెన్సు పరిధిలో లేని చిన్న స్థాయి చమురు, గ్యాస్ బ్లాక్‌లను తీసుకునేందుకు కంపెనీలు ఓఏఎల్‌పీ కింద తమ ఆసక్తిని (ఈవోఐ) వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన ఈవోఐల ఆధారంగా కేంద్రం ఏటా రెండు విడతలుగా వేలం నిర్వహిస్తుంది. ఉత్పత్తయ్యే చమురు, గ్యాస్‌లో ప్రభుత్వానికి అత్యధిక వాటా ఇచ్చే సంస్థకు బ్లాక్‌లు దక్కుతాయి. 
విదేశీ భాగస్వాములకు ఓకే..
సంక్లిష్టమైన క్షేత్రాల్లో ఇంధనాల ఉత్పత్తి పెంచుకునేందుకు ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా సంస్థలు ప్రైవేట్, విదేశీ సంస్థలను భాగస్వాములుగా చేసుకునేందుకు అనుమతించనున్నట్లు ప్రధాన్ వివరించారు. ఇలాంటి క్షేత్రాల్లో ఉత్పత్తి కూడా లాభసాటిగా ఉండేలా ఆయా సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఏయే క్షేత్రాలను సొంతంగా అట్టే పెట్టుకోవాలి, వేటిలో విదేశీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలన్న విషయంలో ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఆయన వివరించారు. 2017లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) చేసిన ప్రతిపాదనకు ఇది పూర్తి విరుద్ధమైనది కావడం గమనార్హం. అప్పట్లో ఓఎన్‌జీసీ, ఆయిల్‌కి చెందిన 15 క్షేత్రాల్లో 60 శాతం వాటాలు విదేశీ, ప్రైవేట్ సంస్థలకు ఇవ్వొచ్చంటూ డీజీహెచ్ ప్రతిపాదించింది. అయితే, రెండు సంస్థలూ గట్టిగా వ్యతిరేకించడంతో ఇది ముందుకు సాగలేదు.You may be interested

ప్రత్యక్ష పన్ను వసూళ్ల వృద్ధి రేటు 14 శాతం

Tuesday 8th January 2019

- ఏప్రిల్-డిసెంబర్‌ మధ్య రూ.8.74 లక్షల కోట్లు న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2018 ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య (2017 ఇదే కాలంతో పోల్చి) స్థూలంగా 14.1 శాతం పెరిగాయి. విలువలో ఇది రూ.8.74 లక్షల కోట్లు. ఆర్థికశాఖ సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... - 2018 ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య రిఫండ్స్‌ విలువ రూ.1.30 లక్షల కోట్లు. 2017 ఇదే కాలంతో పోల్చిచూస్తే, ఇది 17 శాతం అధికం. రిఫండ్స్‌

లాభాల ముగింపు

Tuesday 8th January 2019

సెన్సెక్స్‌ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు అప్‌ రోజంతా ఒడుదుడుకులమయంగా సాగిన మంగళవారంనాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ సూచీలు ఎట్టకేలకు లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్‌ 130 పాయింట్ల లాభంతో 35,980 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల పెరుగుదలతో 10,802 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.  ఉదయం మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైనా ఆసియా, యూరప్‌ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్న నేపథ్యంలో కొన్ని హెవీవెయిట్‌ షేర్ల తగ్గుదల కారణంగా ఒక దశలో నిఫ్టీ 10,750 పాయింట్ల

Most from this category