STOCKS

News


అంచనాలు మించిన ఇన్ఫీ

Saturday 13th April 2019
news_main1555133147.png-25102

- క్యూ4లో లాభం రూ.4,078 కోట్లు; 10.5 శాతం అప్‌
- ఆదాయం 19.1 శాతం వృద్ధి; రూ.21,539 కోట్లు
- షేరుకు రూ.10.5 తుది డివిడెండ్‌...
- 2019-20 ఆదాయ వృద్ధి అంచనా 7.5-9.5 శాతం

బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌... మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (2018-19, క్యూ4) కంపెనీ రూ.4,078 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.3,690 కోట్లతో పోలిస్తే 10.5 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం కూడా 19.1 శాతం వృద్ధి చెంది రూ.18,083 కోట్ల నుంచి రూ.21,539 కోట్లకు ఎగబాకింది. మార్కెట్‌ విశ్లేషకులు క్యూ4లో కంపెనీ రూ.3,910 కోట్ల లాభాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. కాగా, డాలర్ల రూపంలో చూస్తే కంపెనీ నికర లాభం క్యూ4లో 1.7 శాతం వృద్ధి చెంది 571 మిలియన్‌ డాలర్ల నుంచి 581 మిలియన్‌ డాలర్లకు చేరింది. ఆదాయం 2.8 బిలియన్‌ డాలర్ల నుంచి 3.06 బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. 9.1 శాతం వృద్ధి నమోదైంది.
సీక్వెన్షియల్‌గానూ జోరు...
గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇన్ఫీ లాభం రూ.3,610 కోట్లుగా నమోదైంది. దీంతో పోలిస్తే సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన క్యూ4లో లాభం 12.88 శాతం వృద్ధి చెందింది. ఆదాయం మాత్రం సీక్వెన్షియల్‌గా 0.6 శాతం పెరిగింది.
పూర్తి ఏడాదికి చూస్తే...
2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌ రూ.15,410 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2017-18)లో నికర లాభం రూ.16,029 కోట్లతో పోలిస్తే 3.9 శాతం తగ్గింది. మొత్తం ఆదాయం మాత్రం 17.2 శాతం వృద్ధితో రూ.70,522 కోట్ల నుంచి రూ.82,675 కోట్లకు వృద్ధి చెందింది. డాలర్ల రూపంలో చూస్తే పూర్తి ఏడాది లాభం 11.5 శాతం తగ్గుదలతో 2.2 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. డాలర్‌ ఆదాయం 7.9 శాతం వృద్ధితో 11.7 బిలియన్‌ డాలర్లకు చేరింది.
గైడెన్స్‌ ఇలా...
ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం(స్థిర కరెన్సీ ప్రాతిపదికన) 7.5-9.5 శాతం మేర వృద్ధి చెందొచ్చని కంపెనీ అంచనా(గైడెన్స్‌) వేసింది. కాగా, విశ్లేషకులు అంచనా వేసిన 8-10 శాతం కంటే కంపెనీ పేర్కొన్న గైడెన్స్‌ తక్కువగా ఉండటం గమనార్హం.  ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగించొచ్చన్న ఆందోళనలే దీనికి కారణమని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, 2018-19లో ఆదాయ వృద్ధి 6-8 శాతంగా ఉండొచ్చని ఏడాది ఆరంభంలో కంపెనీ అంచనా వేసింది. దీన్ని ఆ తర్వాత అక్టోబర్‌లో 8.5-9 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
- 2018-19 చివరి క్వార్టర్‌(జనవరి-మార్చి)లో కంపెనీ డిజిటల్‌ ఆదాయాలు 41.1 శాతం వృద్ధితో 1,035 మిలియన్‌ డాలర్లకు ఎగబాకాయి. కంపెనీ మొత్తం ఆదాయాల్లో ఈ విభాగం వాటా 33.8 శాతం కావడం గమనార్హం.
- మార్చి చివరినాటికి కంపెనీ యాక్టివ్‌ క్లయింట్ల సంఖ్య 1,279కి చేరింది. డిసెంబర్‌ చివరికి ఈ సంఖ్య 1,251. కాగా, క్యూ4లో 100 మిలియన్‌ డాలర్లకు పైబడిన 2 కాంట్రాక్టులను కంపెనీ చేజిక్కించుకుంది. 50 మిలియన్‌ డాలర్లకు పైబడిన ఒక కాంట్రాక్టు, 10 మిలియన్‌ డాలర్ల విభాగంలో 8 కాంట్రాక్టులను దక్కించుకుంది. మొత్తం కొత్త కాంట్రాక్టుల విలువ(టీసీవీ) 1.57 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.
- ఉత్తర అమెరికా వ్యాపారంలో 3.8 తం వృద్ధి నమోదైంది. యూరప్‌ ఆదాయాలు 1.7 శాతం పెరిగాయి. భారత్‌లో వ్యాపారం 7.9 శాతం ఎగబాకింది.
- ఇక 2019-20లో నిర్వహణ మార్జిన్‌ 21-23 శాతం మేర ఉండొచ్చని ఇన్ఫీ అం‍చనా వేసింది. 2018-19లో ఇది 22.8 శాతంగా ఉంది.
- కొత్త చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ)గా నిరంజన్‌ రాయ్‌ను నియమించినట్లు కంపెనీ ప్రకటించింది. ఆయన నియామకం ఈ ఏడాది మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.
- జనవరి-మార్చి క్వార్టర్‌లో ఇన్ఫీలో నికరంగా 2,622 మంది ఉద్యోగులు చేరారు. దీంతో మార్చి చివరినాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 2.28 లక్షలకు చేరింది. వార్షిక ప్రాతిపదికన ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్‌) 20.4 శాతంగా నమోదైంది.
- క్యూ4లో ఇన్ఫీ ఒక్కో షేరుకు రూ.10.5 చొప్పన తుది డివిడెండ్‌ను ప్రకటించింది. అంతక్రితం ఇచ్చిన రూ.7 మధ్యంతర డివిడెండ్‌తో కలిపితే 2018-19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ మొత్తం డివిడెండ్‌ రూ.17.5కు చేరుతుంది.
- గురువారం ఇన్ఫీ షేరు ధర స్వల్పంగా పెరిగి రూ.747.85 వద్ద ముగిసింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు మార్కెట్లో ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత వెలువడ్డాయి.

‘పటిష్టమైన ఫలితాలతో గతేడాది మంచి పురోగతిని సాధించాం. ఆదాయ వృద్ధి, డిజిటల్‌ వ్యాపారాలతో సహ అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు నమోదైంది. భారీ కాంట్రాక్టులను దక్కించుకోవడం, క్లయింట్లతో మంచి సంబంధాలు కూడా దీనికి దోహదం చేసింది. ప్రణాళికాబద్దంగా మేం చేస్తున్న పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఇక ఆదాయ వృద్ధి అంచనాల విషయానికొస్తే.. గత ఆర్థిక సంవత్సరంలో 6-8 శాతం స్థాయి నుంచి ఈ ఆర్థిక సంవత్సరం 7.5-9.5 శాతానికి పెంచడం కంపెనీ పనితీరుకు నిదర్శనం.’
- సలీల్‌ పరేఖ్‌, ఇన్ఫోసిస్‌ సీఈఓ-ఎండీ



You may be interested

పికిల్స్‌ అడ్డా జంపానీ!

Saturday 13th April 2019

80 రకాల వెజ్, నాన్‌వెజ్‌ పచ్చళ్లు, పిండి వంటలు ఏటా 6 వేల ఆర్డర్లు; అమెరికా, జర్మనీ నుంచే ఎక్కువ త్వరలోనే రూ.4 కోట్ల నిధుల సమీకరణ పూర్తి ‘స్టార్టప్‌ డైరీ’తో ఫౌండర్‌ రవి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇండియా సంస్కృతి, సంప్రదాయాలతో పాటూ పిండి వంటలు, పచ్చళ్లు కూడా ఫేమసే. అందుకే ఇండియా నుంచి వస్తున్నామంటే చాలు..! వీటిని వెంటతెమ్మని చెబుతుంటారు. విదేశాల్లో ఉండే ప్రవాసులు లేదా విదేశీయులు ఎవరైనా సరే కిరాణ కొట్టుకెళ్లి

టీసీఎస్‌ లాభం రూ.8,126 కోట్లు

Saturday 13th April 2019

-అంచనాలను మించిన ఫలితాలు - లాభం 18 శాతం; ఆదాయం 19 శాతం వృద్ధి - రూ.38,010 కోట్లకు చేరిన మొత్తం ఆదాయం  - ఒక్కో షేర్‌కు రూ.18 డివిడెండ్‌ ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. గత ఆర్థిక సంవత్సరం (2018-19 జనవరి-మార్చి) నాలుగో త్రైమాసిక కాలంలో నికర లాభం (కన్సాలిడేటెడ్‌) 18 శాతం వృద్ధితో రూ.8,126 కోట్లకు పెరిగినట్లు గిందని టీసీఎస్‌ తెలిపింది.

Most from this category