STOCKS

News


24 శాతం పెరిగిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాభం

Tuesday 10th July 2018
Markets_main1531209820.png-18166

ముంబై: ప్రైవేట్‌ రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రూ.1,036 కోట్ల నికర లాభం సాధించామని ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ తెలిపింది.  గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఆర్జించిన నికర లాభం రూ.837 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ రమేశ్‌ సోబ్తి చెప్పారు. కీలక వడ్డీ ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.2,122 కోట్లకు పెరగడం, 29 శాతం రుణ వృద్ధి వల్ల  నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించారు. మొత్తం ఆదాయం రూ.5,303 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.6,370 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. 
నికర వడ్డీ ఆదాయం 20 శాతం అప్‌...
గత క్యూ1లో రూ.1,774 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.2,120 కోట్లకు పెరిగిందని రమేశ్‌ సోబ్తి చెప్పారు. వడ్డీయేతర (ఇతర) ఆదాయం రూ.1,167 కోట్ల నుంచి రూ.1,301 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎమ్‌) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 3.97 శాతంగా ఉండగా ఈ క్యూ1లో స్వల్పంగా తగ్గి 3.92 శాతానికి చేరిందని వివరించారు.   అయితే  భవిష్యత్తులో నికర వడ్డీ మార్జిన్‌ 3.9 శాతం రేంజ్‌లో నిలకడగా ఉండగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కాసా డిపాజిట్లు 43 శాతం పెరిగాయని, మొత్తం మీద డిపాజిట్లు 19 శాతం వృద్ధి చెందాయని వివరించారు. కార్పొరేట్‌ రుణాలు 30 శాతం, రిటైల్‌ రుణాలు 28 శాతం చొప్పున పెరిగాయని తెలిపారు. బ్యాంక్‌ వృద్ధికి కీలకమైన వాహన రుణాలు 50 శాతం వృద్ధి సాధించాయని వివరించారు. నిర్మాణరంగం నుంచి డిమాండ్‌ కొనసాగుతుండటంతో వాహన రుణాలు మరింత జోరుగా వృద్ధి సాధిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
‘మొండి’ పరిస్థితి మెరుగుపడుతుంది..! 
గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో  రూ.1,705 కోట్లుగా ఉన్న మొండి బకాయిలు ఈ క్యూ1లో  రూ.1,741 కోట్లకు పెరిగాయని సోబ్తి తెలిపారు. నికర మొండి బకాయిలు రూ.746 కోట్ల నుంచి రూ.762 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. శాతం పరంగా చూస్తే, నికర మొండి బకాయిలు 0.51 శాతంగా ఉండగా, స్థూల మొండి బకాయిలు 1.09 శాతం నుంచి 1.15 శాతానికి పెరిగాయని, అయితే గత క్యూ4తో (1.17 శాతం)పోలిస్తే తగ్గాయన్నారు. రానున్న కాలంలో మొండి బకాయిల పరిస్థితి మరింతగా మెరుగుపడగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. మొత్తం  కేటాయింపులు రూ.310 కోట్ల నుంచి రూ.350 కోట్లకు పెరిగాయని, అంతకు ముందటి క్వార్టర్లో (గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో) రూ.336 కోట్లని తెలిపారు. ప్రభుత్వ సెక్యూరిటీల పోర్ట్‌ఫోలియోకు సంబంధించి మార్క్‌-టు-మార్కెట్‌ (ఎమ్‌టీఎమ్‌) నష్టాలు రూ.85 కోట్లుగా ఉన్నాయని, వీటికి పూర్తిగా కేటాయింపులు జరిపామని, ఇవి లేకపోతే, నికర లాభం మరింతగా పెరిగేదని వివరించారు. మూల ధన నిధులు పుష్కలంగా ఉన్నాయని,  భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ లిమిటెడ్‌ విలీనం కారణంగా క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో మరో 2 శాతం పెరిగిందని పేర్కొన్నారు. 
రూపాయి పతనం మంచిదే...
డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడటం తమకు ప్రయోజనకరమేనని రమేశ్‌ తెలిపారు. రూపాయి పతనం కారణంగా తమ బ్యాంక్‌కు రూ.228 కోట్ల ఫారెక్స్‌ లాభాలు వచ్చాయని వివరించారు. భవిష్యత్తులో మార్క్‌ టు మార్కెట్‌ నష్టాలు వచ్చే అవకాశాల్లేవని పేర్కొన్నారు. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1 శాతం నష్టంతో రూ.1,935 వద్ద ముగిసింది. సోమవారం రూ.1,955 వద్ద ముగిసిన ఈ షేర్‌ మంగళవారం ఇంట్రాడేలో రూ.1,924-1,994 కనిష్ట, గరిష్ట స్థాయిలను తాకింది. 



You may be interested

ఈ స్టాకుల్లో ఏంఏసీడీ బుల్లిష్‌

Tuesday 10th July 2018

ఈ వారం సూచీలు తిరిగి బుల్‌ మూడ్‌లోకి మారాయి. అంతర్జాతీయంగా పాజిటివ్‌ సంకేతాలు దేశీయ సూచీలను ముందుకు నడిపించాయి. ఈ నేపథ్యంలో సోమవారం ముగింపు చార్టుల్లో 132 కంపెనీల షేర్లు పాజిటివ్‌ సంకేతాలు ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ స్టాకుల్లో ఎంఏసిడి ఇండికేటర్‌ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఈ విధంగా ఎంఏసిడి సూచిక పాజిటివ్‌గా మారిన స్టాకుల్లో ఎల్‌ అండ్‌టీ, బీఓబీ, జిందాల్‌స్టీల్‌ అండ్‌ పవర్‌ఱ, హెక్సావేర్‌ టెక్నాలజీ, యాక్సిస్‌

బైబ్యాక్‌ ప్రణాళికతో హెచ్‌సీఎల్‌ హల్‌చల్‌..!

Tuesday 10th July 2018

ముంబై:- షేర్ల బైబ్యాక్ అంశం తెరపైకి రావడంతో ఐటీ దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. జూలై 12న జరిగే కంపెనీ బోర్డు సమావేశంలో షేర్ల బైబ్యాక్‌ అంశంపై చర్చిస్తున్నట్లు హెచ్‌సీఎల్‌ సోమవారం స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. షేర్ల బైబ్యాక్ అంశం వెలుగులోకి రావడంతో నేటి మార్కెట్‌ ప్రారంభంలోనే హెచ్‌సీఎల్‌ షేర్లు 4శాతం లాభంతో రూ.1000.05ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మధ్యాహ్నం గం.12:15ని.లకు

Most from this category