STOCKS

News


‘పెప్సీ’లో ముగియనున్న ఇంద్రానూయి శకం

Tuesday 7th August 2018
news_main1533620043.png-19006


న్యూయార్క్‌: భారతీయ మహిళలు వ్యాపార నిర్వహణలోనూ దిట్టలు అని నిరూపించిన మహిళ... ప్రపంచ స్థాయి కంపెనీని సైతం విజయవంతంగా భవిష్యత్తులోకి నడిపించగలరని నిరూపించిన నారీశక్తి... ప్రపంచ పారిశ్రామిక రంగంలో అసాధారణ మహిళగా గుర్తింపు పొందిన ఇంద్రా నూయి (62) పెప్సీకో కంపెనీ నాయకత్వ బాధ్యతల్ని విడిచిపెట్టబోతున్నారు. శీతలపానీయాలు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ తయారీలో ప్రపంచ రెండో అగ్రగామి సంస్థ, అమెరికాకు చెందిన ‘పెప్సీకో’ సీఈవోగా పనిచేస్తున్న భారతీయ అమెరికన్‌ ఇంద్రానూయి త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్నారు. 12 సంవత్సరాల పాటు కంపెనీకి సారథ్యం వహించిన ఆమె అక్టోబర్‌ 3న తన బాధ్యతలను కొత్త సారథికి అప్పగించనున్నారు. కంపెనీ ప్రెసిడెంట్‌ రామన్‌ లగుర్తాను నూతన సీఈవోగా కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఎంపిక చేసింది. ఇవి మినహా కంపెనీ యాజమాన్యంలో మరే మార్పులు లేవని కంపెనీ స్పష్టం చేసింది. పెప్సీకోతో ఇంద్రానూయికి ఉన్న 24 ఏళ్ల అనుబంధం కూడా త్వరలోనే ముగిసిపోనుంది. సీఈవోగా వైదొలిగినా, వచ్చే ఏడాది ఆరంభం వరకు చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. తాజా పరిణామంపై ఆమె స్పందిస్తూ కంపెనీకి మంచి రోజులు ఇంకా రావాల్సి ఉందన్నారు. ‘‘భారత్‌లో పెరుగుతున్న నేను ఈ స్థాయి కంపెనీని నడిపించే అవకాశం లభిస్తుందనుకోలేదు. గడిచిన 12 సంవత్సరాల్లో వాటాదారుల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు మేం చేసిన కృషికి గర్విస్తున్నాం. ఉత్తమ కంపెనీగా మారేందుకు, ఉత్తమ కంపెనీగానూ కొనసాగేందుకు మా ప్రపంచ బృందం చేసిన అద్భుత ప్రయాణాన్ని ప్రశంసిస్తున్నాను’’అని ఇంద్రా నూయి ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘ఈ రోజు నాకు భావోద్వేగాల మిశ్రమంతో కూడినది. పెప్సీకోతో 24 ఏళ్ల ప్రయాణం. నా హృదయంలో కొంత భాగం కంపెనీతోనే ఉంటుంది. భవిష్యత్తు కోసం మేం చేసిన దాని పట్ల గర్విస్తున్నాం. పెప్సీకోకు మంచి రోజులు రావాల్సి ఉంది. పర్యావరణ వినియోగాన్ని పరిమితం చేస్తూనే ప్రజల జీవితాలపై అర్థవంతమైన ప్రభావం చూపించాం. ఉజ్వలమైన భవిష్యత్తు కోసం వృద్ధిని కొనసాగించేందుకు పెప్సీకో బలమైన స్థితిలో ఉంది’’ అని నూయి పేర్కొన్నారు.
శక్తిమంతమైన వ్యాపార మహిళ
ఇంద్రానూయి పెప్సీకో సీఈవోగా తప్పుకోవడం వెనుక కారణం ఏంటన్నది ఇంకా స్పష్టం కాలేదు. అతిపెద్ద శీతల పానీయాల కంపెనీ సారధిగా ఆమె ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందారు.  ‘ప్రపంచంలో శక్తిమంతమైన వ్యాపార మహిళ’ (అమెరికా వెలుపల)గా ఫార్చ్యూన్స్‌ జాబితా 2017లో 2వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో టాప్‌-100 శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా 2014లో ఫోర్బ్స్‌ జాబితాలో 13వ స్థానంలో నిలిచారు. అత్యధిక పారితోషికం అందుకునే మహిళా సీఈవోగానూ అగ్ర స్థానంలో ఉన్నారు. కార్పొరేట్‌ అమెరికా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ప్రపంచ దిగ్గజ సంస్థను నడిపించిన భారత మహిళామణుల్లో ఒకరిగానూ చరిత్ర సృష్టించారు. 
మార్పు దిశగా నడిపించారు... 
రామన్‌ లగుర్తా సైతం పెప్సీకో సీనియర్‌ ఉద్యోగుల్లో ఒకరు. 22 ఏళ్లుగా కంపెనీతో పనిచేస్తున్నారు. ఈ కాలంలో ఎన్నో నాయకత్వ బాధ్యతలను నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి కంపెనీ ప్రెసిడెంట్‌గా సేవలు అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు, కార్పొరేట్‌ విధానాలు, పబ్లిక్‌ పాలసీ, ప్రభుత్వ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇంద్రానూయి నాయకత్వాన్ని ఈ సందర్భంగా రామన్‌ ప్రశంసించారు. తన సాహసోపేతమైన దృష్టి, అసాధారణ నాయకత్వంతో కంపెనీని మార్చివేశారని పేర్కొన్నారు. మార్గదర్శకురాలిగా, తన స్నేహితురాలిగా ఆమె ఉండడం అదృష్టంగా అభివర్ణించారు. అందరితో మరింత సన్నిహితంగా పనిచేస్తూ కంపెనీని భవిష్యత్తు దిశగా నడిపించేందుకు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. 
వాటాదారులకు లాభాలు
ఇంద్రానూయి సారథ్యంలో పెప్సీకో మంచి ఫలితాలను ప్రదర్శించింది. 2006 డిసెంబర్‌ 31 నుంచి 2017 డిసెంబర్‌ నాటికి వాటాదారులకు 162 శాతం ప్రతిఫలం లభించింది. వాటాదారులకు డివిడెండ్లు, షేర్ల తిరిగి కొనుగోలు ద్వారా 2006 ప్రారంభం నుంచి 2017 చివరి నాటికి 79.4 బిలియన్‌ డాలర్ల (రూ.5.39 లక్షల కోట్లు) లాభాలను పంచారు. 2006లో 35 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఆదాయాన్ని 2017 నాటికి 63.5 బిలియన్‌ డాలర్లకు చేర్చారు. గత 12ఏళ్లలో అసాధారణ నాయకత్వాన్ని అందించారని కంపెనీ డైరెక్టర్ల బోర్డు తరఫున ప్రిసైడింగ్‌ డైరెక్టర్‌ ఇయాన్‌కుక్‌ పేర్కొన్నారు. ‘‘స్వల్ప కాలం కోసమే కాకుండా, దీర్ఘకాల దృష్టితో స్థిరమైన, బలమైన పనితీరు చూపించారు. సీఈవోగా ఉన్న సమయంలో కంపెనీ ఆదాయం 80 శాతానికిపైగా పెరిగింది. ఇది పోటీ కంపెనీలకు మించిన పనితీరు. వాటాదారులు కూడా ప్రయోజనం పొందారు. 2006లో 1,000 డాలర్లు ఇన్వెస్ట్‌ చేస్తే, ఆ విలువ ఈ కాలంలో రెండున్నర రెట్లు పెరిగింది’’ అని ఇయాన్‌కుక్‌ వివరించారు.

చెన్నై నుంచి అమెరికాకు
మద్రాస్‌లో జన్మించిన ఇంద్రా కృ‍ష్ణమూర్తి నూయి అక్కడే పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌ పరిధిలోని క్రిస్టియన్‌ కాలేజీలో 1974లో డిగ్రీ ముగించారు. ఐఐఎం, కల్‌కత్తా నుంచి ఎంబీఏ చేశారు. దేశీయంగానే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీలో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టారు. 1978లో యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో చేరి పబ్లిక్‌, ప్రైవేటు మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందారు. ఆ తర్వాత బోస్టన్‌ గ్రూపులో చేరారు. అనంతరం మోటరోలా, ఏసీ బ్రౌన్‌ బొవేరిలోనూ పనిచేసిన తర్వాత 1994లో పెప్సీకో ఉద్యోగిగా మారారు. 2001లో సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. 2006లో సీఈవోగా, ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. 44 ఏళ్ల పెప్సీకో కంపెనీకి ఆమె ఐదో సీఈవో కావడం గమనార్హం. యుమ్‌ బ్రాండ్‌ పునరుద్ధరణ, ట్రోపికానా కొనుగోలు, క్వాకర్‌ ఓట్స్‌ విలీనం, గాటొరేడ్‌ కొనుగోలులో కీలక పాత్ర పోషించారు.You may be interested

స్థిరంగా పసిడి

Tuesday 7th August 2018

ముంబై:- అంతర్జాతీయంగా పసిడి ధర మంగళవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య యుద్ధ భయాలతో పాటు, ఆసియాలోని మార్కెట్లు మిశ్రమ ట్రేడింగ్‌ పసిడి ధర స్థిరమైన ర్యాలికి కారణమవుతున్నాయి.  ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ఔన్స్‌ ధర భారత కాలమానం ప్రకారం గం.10:15ని.లకు 0.70 డాలర్లు స్వల్పంగా పెరిగి  1,218.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు రానున్న రోజుల్లో అమెరికా వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలతో పాటు డాలర్‌ ఇండెక్స్‌

ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ రోడ్‌మ్యాప్‌నకు కమిటీలు

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ఎయిర్‌క్రాఫ్ట్‌లు, డ్రోన్ల తయారీకి కార్యాచరణను రూపొందించేందుకు ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్‌ ప్రభు తెలిపారు. ఏవియేషన్‌ రంగం దేశీయంగా వేగంగా వృద్ధి చెందుతోందని, ప్రతీ రోజూ కొత్తగా ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. దీంతో రానున్న సంవత్సరాల్లో వేలాది విమానాల కొనుగోళ్లకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. విమానయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు గాను రెండు టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఒకటి

Most from this category