STOCKS

News


ఏవియేషన్‌కు ఈ ఏడాది కష్టమే: క్రిసిల్‌

Friday 2nd November 2018
news_main1541142850.png-21662

- 2018-19లో భారీ నష్టాలు రావచ్చు
- దశాబ్ద కాలంలోనే ఇదే అత్యధికం
- ధరల పెంపుతో బయటపడే అవకాశం
- రేటింగ్స్‌ సంస్థ క్రిసిల్‌ నివేదిక

ముంబై: ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలు మూటగట్టుకోనున్నాయని రేటింగ్స్‌ సంస్థ క్రిసిల్‌ అంచనా వేసింది. ఇంధన ధరలు గరిష్ట స్థాయికి చేరడం, రూపాయి విలువ జీవిత కాలంలోనే కనిష్ట స్థాయికి పడిపోవడం నష్టాలకు కారణాలుగా తెలిపింది. విమాన టికెట్‌ చార్జీలను 12 శాతం పెంచడం ద్వారా పెరిగిన వ్యయాలను అధిగమించొచ్చని సూచించింది. అంతేకాక విమానయాన సంస్థల రుణ భారం 10 శాతం మేర పెరుగుతుందని కూడా అంచనా వేసింది. ప్రస్తుతం ప్రయాణికుల్లో 71 శాతం వాటా జెట్‌ ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌, ఇండిగో సంస్థల చేతుల్లోనే ఉంది. ‘‘ఎయిర్‌లైన్స్‌ మొత్తం వ్యయాల్లో ఇంధనం కోసం చేసే ఖర్చు 35-40 శాతంగా ఉంటుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌, ఇంజన్‌ అద్దెలు, నిర్వహణ ఖర్చులు 30-35 శాతం. ఎయిర్‌లైన్స్‌ పరిశ్రమ ఎబిట్‌ స్థాయిలో (వడ్డీ, పన్నులకు ముందస్తు ఆదాయం) రూ.9,300 కోట్ల నష్టాలను చవిచూడొచ్చు. 2014లో వచ్చిన రూ.7,348 కోట్ల నష్టాలకన్నా ఇది చాలా ఎక్కువ. 2014 తరవాత వరసగా మూడేళ్లు రూ.4,000 కోట్ల చొప్పున లాభాలను ఆర్జించిన ఎయిర్‌లైన్స్‌ పరిశ్రమకు ఈ స్థాయి నష్టాలు చాలా ఎక్కువ’’ అని క్రిసిల్‌ తన నివేదికలో వివరించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) వ్యయాలు సగటున 28 శాతం అధిక స్థాయిలో ఉండొచ్చని, ఇది ఎయిర్‌లైన్స్‌ బ్యాలన్స్‌ షీట్లపై గణనీయమైన ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఏటీఎఫ్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ 3 శాతం తగ్గించి 11 శాతం చేసిన విషయాన్ని క్రిసిల్‌ ప్రస్తావించింది. మరోవైపు రూపాయి డాలర్‌తో మార్చి నుంచి 13 శాతం నష్టపోయిందని, ఇవన్నీ విమానయాన సంస్థలకు పెద్ద నష్టాలను మిగులుస్తాయన్నది క్రిసిల్‌ అంచనా.
ధరల పెంపు
పెరిగిన నిర్వహణ వ్యయాలను అధిగమించాలంటే ఎయిర్‌లైన్స్‌ సంస్థలు 12 శాతం టికెట్‌ చార్జీలను పెంచాల్సి ఉంటుందని క్రిసిల్‌ తెలిపింది. అదే సమయంలో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టరాదని పేర్కొంది. కానీ, భారీగా విస్తరణ ప్రణాళికలు, అధిక ప్రయాణికుల వాటా కోసం పోటీ కారణంగా ధరలను పెంచే అవకాశాలు పరిమితమేనని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ సచిన్‌గుప్తా అన్నారు. నిర్వహణ వ్యయం గణనీయంగా పెరగడంతో స్వల్పకాలం నుంచి మధ్య కాలానికి ఎయిర్‌లైన్స్‌ సంస్థల కష్టాలు కొనసాగుతాయని క్రిసిల్‌ అంచనా వేసింది.



You may be interested

మార్కెట్‌ ర్యాలీకి 5 కారణాలు

Friday 2nd November 2018

- ఇంట్రాడేలో 600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ - 10,584 పాయింట్లకు చేరిన నిఫ్టీ - 1.80 శాతం మేర లాభాలు ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్‌లో శుక్రవారం బుల్‌ రంకెలు వేసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 600 పాయింట్లకు మించి లాభాలను నమోదుచేసింది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయానికి సెన్సెక్స్‌ 601 పాయింట్లు (1.72 శాతం) లాభంతో 35,032 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ 182 పాయింట్లు (1.76 శాతం)

గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ లాభం రూ.21కోట్లు

Friday 2nd November 2018

రూ.487 కోట్లకు పెరిగిన మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ: గోద్రేజ్‌ గ్రూప్‌నకు చెందిన రియల్టీ కంపెనీ గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో కన్సాలిడేటెడ్‌ ప్రాతపదికన రూ. 21 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.21 లక్షల నికర లాభం మాత్రమే వచ్చిందని గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌ పేర్కొంది. ఆదాయం అధికంగా ఉండటం, పన్ను రివర్సల్‌, అధిక ఇతర ఆదాయం కారణంగా నికర

Most from this category