STOCKS

News


ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ప్రకంపనలు!

Saturday 29th September 2018
news_main1538201428.png-20697

న్యూఢిల్లీ: మౌలిక రంగానికి రుణాలు, నిర్మాణ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు... తాను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం కావడం యావత్‌ ఎన్‌బీఎఫ్‌సీ రంగాన్నే తీవ్రంగా కుదిపేస్తోంది. క్రెడిట్‌ రిస్క్‌పై సరికొత్త ఆందోళనలకు తావిచ్చింది. అంతేకాదు, ఈ పరిణామం ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు మరణశాసనం కానుంది! సుమారు 1,500 చిన్న ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల లైసెన్స్‌లను ఆర్‌బీఐ రద్దు చేసే అవకాశం ఉందని, కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టే వాటికి అనుమతులు కూడా మరింత కష్టతరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిధుల బలం ఉండి, సంప్రదాయంగా నడిచే ఫైనాన్స్‌ కంపెనీలు చిన్న సంస్థలను మింగేయవచ్చన్నది నిపుణులు అంచనా కడుతున్నారు. దీంతో చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకునే వారికి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని, ఇది ప్రైవేటు వినియోగం పెరుగుదలను అడ్డుకునే అంశంగా భావిస్తున్నారు. ‘‘వెలుగుచూస్తున్న పరిణామాలు కచ్చితంగా ఆందోళన కలిగించేవి. ఈ రంగం స్థిరకీరణకు గురవుతుంది’’ అని బంధన్‌ బ్యాంకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ హరూన్‌ రషీద్‌ ఖాన్‌ తెలిపారు. ఆస్తులు, అప్పుల మధ్య అంతరం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు.
బ్యాంకులకు మించి ఎదుగుదల
గ్రామీణంగా అధిక రిస్క్‌తో రుణాలిస్తున్న వేలాది సంస్థల మనుగడను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ అంశం ప్రశార్థకం చేసింది. దేశవ్యాప్తంగా 11,400 ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల ఉమ్మడి బ్యాలన్స్‌ షీటు మొత్తం 22.1 లక్షల కోట్ల రూపాయిలుగా ఉంది. బ్యాంకుల కంటే వీటిపై నియంత్రణలు తక్కువే. దీంతో బ్యాంకులతో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల రుణ పుస్తక మొత్తం రెండు రెట్ల మేర వృద్ధి చెందడం గమనార్హం. అందుకే ఈ విభాగం కొత్త పెట్టుబడిదారులను ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంతో చాలా సంస్థల క్రెడిట్‌ రేటింగ్‌కు డౌన్‌గ్రేడ్‌ ముప్పు ఏర్పడింది. ఒకవైపు నిధుల సమీకరణ వ్యయాలు పెరుగుతుండడం, మరోవైపు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తరహా సంక్షోభాలతో రుణాలకు కటకట ఏర్పడుతుందని, తగినన్ని నిధుల్లేని సంస్థలు నిలదొక్కుకోవడం కష్టంగా మారుతుందన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ‘‘చిన్న ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు వ్యయాల పరంగా సమస్యను ఎదుర్కోనున్నాయి. వాటి లిక్విడిటీ (నగదు లభ్యత) ప్రస్తుతమున్న స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ, మధ్య, పెద్ద స్థాయి ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు తమ లక్ష్యాలను సాధించగలవు. నిధులను పొందగలవు’’ అని క్యాప్రి గ్లోబల్‌ క్యాపిటల్‌ ఎన్‌బీఎఫ్‌సీ సం‍స్థ అధిపతి రాజేష్‌ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు ఎటువంటి రాయితీలు లేనందున, తమ పోర్ట్‌ఫోలియో పనితీరును సరిగ్గా నిర్వహించలేని సంస్థలు కనుమరుగవుతాయన్నారు. 
చిన్న సంస్థలకు అస్తిత్వ ముప్పు
కనీసం రూ.2 కోట్ల నిధుల్లేని ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్‌ను ఆర్‌బీఐ రద్దు చేసే ప్రక్రియలో ఉందంటున్నారు నిపుణులు. ‘‘ఆర్‌బీఐ ఇప్పటికే షోకాజు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు వాటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే ప్రక్రియలో ఉంది. 1,500 సంస్థలు కనుమరుగు కానున్నాయి’’ అని ఫైనాన్స్‌ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ( ఈ రంగానికి చెందిన సంఘం) చైర్మన్‌ రామన్‌ అగర్వాల్‌ తెలిపారు. అయితే, ఇదే సమయంలో ఎన్‌బీఎఫ్‌సీ రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్‌బీఐ వద్దకు వందలాది నూతన దరఖాస్తులు వరదగా వస్తున్నట్టు చెప్పారు. ‘‘దేశంలో సుమారు 11,000 వరకు ఎన్‌బీఎఫ్‌సీలు 500 కోట్ల రూపాయాల్లోపు ఆస్తులు కలిగిన చిన్న, మధ్య స్థాయి సంస్థలే. కానీ, అగ్ర స్థానంలో ఉన్న 400 ఎన్‌బీఎఫ్‌సీల్లో చాలా వరకు బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీలకు చెందినవి. 90 శాతానికి పైగా ఆస్తులు వీటి నియంత్రణలోనే ఉన్నాయి’’ అని రామన్‌ అగర్వాల్‌ వివరించారు. కస్టమర్లకు 2 శాతం అదనపు వడ్డీ రేటు విధించినప్పటికీ, ఎన్‌బీఎఫ్‌సీలు కస్టమర్లతో సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకుంటాయన్నారు. స్థానిక మార్కెట్ల తీరు తెన్నులు, ఆర్థిక పరిణామాలు వాటికి తెలుసని, రుణ గ్రహీతతో కొన్ని నిమిషాలు మాట్లాడడంతోనే రుణంపై ఓ నిర్ణయం తీసుకోగలవని అగర్వాల్‌ తెలిపారు. బ్యాంకుల మాదిరిగా కాకుండా, ఎటువంటి క్రెడిట్‌ హిస్టరీ లేకున్నా, బ్యాంకు ఖాతాల్లేకపోయినా రుణాలిస్తాయన్నారు. ఇక తాజా పరిణామాలను ఆర్థికంగా దిగ్గజ సంస్థలైన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ వంటి సంస్థలు తట్టుకుని నిలబడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండేళ్ల కాలంలో ఐడీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్‌ మహింద్రా బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు ఒక్కో మైక్రోఫైనాన్స్‌ సంస్థను కొనుగోలు చేశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంకు సైతం భారత్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. మార్కెట్లో కొంతమేర స్థిరీకరణ ఉంటుందని ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ ముంద్రా పేర్కొన్నారు. దీర్ఘకాలంలో ఈ రంగానికి ఇది మేలు చేస్తుందన్నారు. 

రూ.300 కోట్లు చెల్లించిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌
పలు రుణ చెల్లింపుల్లో విఫలమైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు, ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌కు మాత్రం రూ.300 కోట్ల బకాయిలను చెల్లించింది. ఆగస్ట్‌ 27 నుంచి ఏడు చెల్లింపుల్లో వైఫల్యం చెందినట్టు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు స్వయంగా ప్రకటించింది. ‘‘ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సెక్యూరిటీస్‌ నుంచి మా వడ్డీ చెల్లింపులు, మెచ్యూరిటీ తిరిన వాటి చెల్లింపులు జరిగాయి. ఇందులో తుదిగా రూ.300 కోట్లు శుక్రవారం చెల్లించడం జరిగింది’’ అని ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ తెలిపింది. 

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ వాటాదారులతో ఆర్‌బీఐ మంతనాలు
తీవ్ర రుణ భారంలో కూరుకుపోయి చెల్లింపుల్లో వైఫల్యం చెందిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ సంస్థను ఒడ్డున పడేయడం, నిధుల సాయం ప్రణాళికలపై ప్రధాన వాటాదారులతో ఆర్‌బీఐ చర్చించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ వాటాదారులైన ఎల్‌ఐసీ, జపాన్‌కు చెందిన ఓరిక్స్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎన్‌ విశ్వనాథన్‌, ఎంకే జైన్‌ శుక్రవారం భేటీ అయి చర్చించారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో ఎల్‌ఐసీకి 25.34 శాతం, ఓరిక్స్‌కు 23.54 శాతం వాటాలున్నాయి. అయితే, చర్చల సారాంశం బయటకు రాలేదు. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ, హెచ్‌డీఎఫ్‌సీ, సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఎస్‌బీఐలకూ ఈ సంస్థలో వాటాలున్నాయి. తొలుత అందరు వాటాదారులను ఆర్‌బీఐ భేటీకి ఆహ్వానించగా, ఆ తర్వాత రెండు ప్రధాన వాటాదారులతోనే సమావేశాన్ని పరిమితం చేసింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు రూ.91,000 కోట్ల రుణ భారాన్ని మోస్తోంది. You may be interested

మార్కెట్‌ రుణ లక్ష్యం తగ్గింపు

Saturday 29th September 2018

న్యూఢిల్లీ: మార్కెట్‌ ద్వారా రుణ సమీకరణ స్థూల అంచనాల లక్ష్యాన్ని కేంద్రం రూ.70,000 కోట్లు తగ్గించుకుంది. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. 2018-19 ఆర్థిక సం‍వత్సరంలో మార్కెట్‌ రుణాల ద్వారా రూ.6.05 లక్షల కోట్లు సమీకరించుకోవాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం- ఇందులో రూ.70,000 కోట్లు తగ్గించుకుంది. ‘‘మంచి ప్రజాదరణ ఉన్న చిన్న పొదుపు మొత్తాల పథకాల ద్వారా అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో అంచనాలకు మించి

భారత్‌లో ఆలీబాబా 2వ క్లౌడ్‌ డేటా సెంటర్‌

Saturday 29th September 2018

న్యూఢిల్లీ: చైనీస్‌ దిగ్గజ సంస్థ ఆలీబాబా భారత్‌లో తమ క్లౌడ్‌ సేవలను మరింత విస్తరించనుంది. త్వరలోనే ముంబై డేటా సెంటర్‌లో మరో క్లౌడ్‌ ఇన్‌ఫ్రాను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. ఈఏడాది ప్రారంభంలో క్లౌడ్‌ సేవలను ఇక్కడి మార్కెట్‌లో ప్రారంభించిన ఈ సంస్థ.. నెలల వ్యవధిలోనే తమకు లభించిన విశేష స్పందన చూసి, 2వ క్లౌడ్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ అంశంపై మాట్లాడిన సంస్థ జనరల్‌ మేనేజర్‌

Most from this category