News


నిబంధనలు కాస్త సడలించండి

Saturday 15th December 2018
news_main1544849329.png-22954

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) నుంచి దాదాపు రూ. 60,000 కోట్ల రుణాలను రాబట్టుకునేందుకు బ్యాంకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ముందు రెండు ప్రతిపాదనలుంచాయి. వీటి ప్రకారం రుణాలను మొండిబాకీలుగా వర్గీకరించేందుకు ఆరు నెలల మారటోరియం వ్యవధి, ఆ తర్వాత సదరు రుణాల ప్రొవిజనింగ్‌ నిబంధనల్లో కొంత సడలింపు ఇవ్వాలని కోరుతున్నాయి. సంబంధిత వర్గాల కథనం ప్రకారం.. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ రుణాల ప్రొవిజనింగ్‌ సమస్యలపై ముందుగా దాదాపు 20 బ్యాంకులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించుకున్నాయి. ఆ తర్వాత 13 బ్యాంకులు..  ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) అధికారులతో భేటీ అయి, ప్రతిపాదనల గురించి వివరించాయి. దీంతో ఐబీఏ ఈ అంశాలపై చర్చించి, తమ సిఫార్సులను శుక్రవారం ఆర్‌బీఐకి పంపినట్లు తెలియవచ్చింది.
భారం పడకుండా చూసుకునేందుకు ..
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ రుణాల కారణంగా మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థపై భారం పడకుండా కాపాడుకునేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్‌బీఐకి కూడా ఈ విషయం తెలిసున్నప్పటికీ.. బ్యాంకర్ల నుంచి అధికారికంగా ఒక ప్రతిపాదన రావడం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌నకు రూ.500 కోట్ల పైగా రుణాలిచ్చిన బ్యాంకులు ఐబీఏని గురువారం కలిశాయి. వీటిలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, సిండికేట్‌ బ్యాంక్‌ మొదలైనవి ఉన్నాయి. డిసెంబర్‌ 31 నాటికి ఐఎల్‌ఎఫ్‌ఎస్, దాని అనుబంధ సంస్థలకిచ్చిన రుణాల్లో సింహభాగం మొండిపద్దులుగా మారనున్నాయి. దీంతో ఆ తర్వాత 65 శాతం దాకా రుణాలకు (విలువపరంగా దాదాపు రూ. 40,000 కోట్లు) బ్యాంకులు భారీగా ప్రొవిజనింగ్‌ చేయాల్సి రానుంది. ఓవైపు, కొత్తగా ఏర్పాటైన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ బోర్డు సారథ్యంలో రుణాల చెల్లింపు ప్రణాళిక రూపకల్పనలో జాప్యం జరుగుతుండటం.. మరోవైపు మొండిపద్దుల నిబంధనల గడువు దగ్గరపడుతుండటం కారణంగా బ్యాంకులే స్వయంగా రంగంలోకి దిగాయి. 
రెండు ప్రతిపాదనలు ..
బ్యాంకర్లు నిర్దిష్టంగా రెండు ప్రతిపాదనలు చేస్తున్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, దాని అనుబంధ సంస్థలకు ఇచ్చిన రుణాల వర్గీకరణ విషయంలో కొంత వెసులుబాటు కల్పించేలా ఆర్‌బీఐని కోరాలన్నది మొదటిది. దీని ప్రకారం.. ఐఎల్‌ఎఫ్‌ఎస్, దాని అనుబంధ సంస్థలు డిఫాల్ట్‌ అయిన తేదీ నుంచి ఆయా రుణాలపై కనీసం ఆరు నెలల మారటోరియం ఉండాలని బ్యాంకులు కోరుతున్నాయి. దీంతో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ రుణాలను సబ్‌–స్టాండర్డ్‌ రుణాలుగా తక్షణం వర్గీకరించాల్సిన పరిస్థితి తప్పుతుంది. ఫలితంగా ప్రొవిజనింగ్‌ భారం కూడా తప్పుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక, రెండో ప్రతిపాదన ప్రకారం..  ఐఎల్‌ఎఫ్‌ఎస్, దాని అనుబంధ సంస్థలకి ఇచ్చిన రుణాల ప్రొవిజనింగ్‌ విషయంలో కూడా వెసులుబాటు కల్పించాలని బ్యాంకులు కోరుతున్నాయి. ఆరు నెలల మారటోరియం పూర్తయ్యాక... వీటికి సబ్‌–స్టాండర్డ్‌ రుణాలకు వర్తింపచేసే ప్రొవిజనింగ్‌ కాకుండా, స్టాండర్డ్‌ అసెట్స్‌కి వర్తించే నిబంధనలు అమలు చేసేందుకు ఆర్‌బీఐ అనుమతి కోరనున్నాయి. 
ప్రొవిజనింగ్‌ లెక్కలివీ ...
ప్రస్తుతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.. ఐఎల్‌ఎఫ్‌ఎస్, దాని 350 అనుబంధ సంస్థలకు సుమారు రూ.94,000 కోట్లు రుణాలిచ్చాయి. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 35,000–40,000 కోట్లు ఇచ్చాయి. ప్రైవేట్‌ బ్యాంకులు ఇచ్చినవి కూడా కలిపితే బ్యాంకులిచ్చిన రుణాలు రూ. 50,000–60,000 కోట్ల దాకా ఉంటాయని అంచనా. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. స్టాండర్డ్‌ అసెట్స్‌కి 0.4 శాతం ప్రొవిజనింగ్‌ సరిపోతుంది. అదే, సబ్‌–స్టాండర్డ్‌ అసెట్స్‌కు (మొండిబాకీలకు) మొదటి ఏడాది 25 శాతం, ఆ తర్వాత మూడేళ్ల దాకా 40 శాతం, మూడేళ్ల తర్వాత 100 శాతం ప్రొవిజనింగ్‌ చేయాల్సి ఉంటోంది. ఒకవేళ బ్యాంకర్ల ప్రతిపాదనకు ఆర్‌బీఐ గానీ అంగీకరించకపోతే.. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ పద్దులకు బ్యాంకులు ఈ స్థాయిలోనే ప్రొవిజనింగ్‌ చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే దాదాపు రూ. 10,000 కోట్ల మేర కేటాయింపుల భారం భరించాల్సి వస్తుంది.



You may be interested

కావాలని రుణాలు ఎగ్గొట్టిన వారిపై 2,571 కేసులు

Saturday 15th December 2018

న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసిన వారిపై ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులు 2,571 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం పార్లమెంటుకు తెలిపారు. 9,363 కేసులు వారి నుంచి రకవరీ కోసం దాఖలు చేసినవిగా పేర్కొన్నారు. సెక్యూరిటైజేషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ అసెట్స్‌, అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెక్యూరిటీ ఇంటరెస్ట్‌ యాక్ట్‌ కింద ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు వ్యతిరేకంగా 7,616 కేసులు దాఖలైనట్టు చెప్పారు.

పెరగనున్న హోండా కార్ల ధరలు

Saturday 15th December 2018

న్యూఢిల్లీ: దేశీ ఆటోరంగ సంస్థ హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌సీఐఎల్‌) ఉత్పత్తి చేస్తున్న అన్ని మోడళ్ల ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ అంశంపై వివరణ ఇచ్చిన కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌) రాజేష్ గోయల్.. ‘ముడి పదార్థాల ధరలు 4 శాతం పెరిగాయి. ఈ కారణంగా

Most from this category