STOCKS

News


భారత్‌లో 15వేల ఉద్యోగాలు!!

Thursday 22nd November 2018
news_main1542864479.png-22296

న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన ఫర్నిచర్ తయారీ దిగ్గజం ఐకియా... భారత్‌లో తమ కార్యకలాపాలను గణనీయంగా విస్తరించడంపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా భవిష్యత్‌లో భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్యను దాదాపు పది రెట్లు పెంచుకుని.. సుమారు 15,000 స్థాయికి చేర్చనున్నట్లు ఐకియా బుధవారం తెలిపింది. అదే సమయంలో కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అంతర్జాతీయంగా 7,500 ఉద్యోగాలను కుదించనున్నట్లు వెల్లడించింది. ‘‘భారత మార్కెట్లో 1.5 బిలియన్ యూరోల మేర పెట్టుబడులు పెడుతున్నాం. రాబోయే రోజుల్లో పలు నగరాల్లో కార్యకలాపాలు విస్తరించనున్నాం. మా గ్రూప్‌నకు కొత్తదైన భారత మార్కెట్‌లో గణనీయంగా అవకాశాలున్నట్లు భావిస్తున్నాం. వచ్చే మూడేళ్లలో వివిధ మార్గాల్లో 20 కోట్ల మందికి పైగా ప్రజలకు చేరువ కావాలని నిర్దేశించుకున్నాం’’ అని ఐకియా ఇండియా ఒక ప్రకటనలో తెలియజేసింది. అంతర్జాతీయంగా ఐకియా టాప్ 30 మెగా సిటీ వ్యూహాల్లో మూడు భారత నగరాలున్నాయని (ముంబై, బెంగళూరు, ఢిల్లీ), భారత్‌లోని వ్యాపారావకాశాలపై తమకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని వివరించింది. "భారత్‌లో కార్యకలాపాల విస్తరణతో మరిన్ని ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలన కల్పన జరగనుంది. ప్రస్తుతం 1,500 దాకా ఉన్న ఉద్యోగుల సంఖ్య భవిష్యత్‌లో 15,000కు పైగా చేరవచ్చు. వీరిలో 50 శాతం మంది మహిళలే ఉంటారు" అని ఐకియా వివరించింది. ఐకియా భారత్‌లో తొలి స్టోర్‌ను ఆగస్టులో హైదరాబాద్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. త్వరలో ముంబైలోనూ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటు స్టోర్స్‌తో పాటు అటు ఆన్‌లైన్‌లో కూడా విక్రయాలు చేపట్టే ప్రయత్నాల్లో ఉంది. 
వినూత్న ఉద్యోగావకాశాలు..
విస్తరణతో స్టోర్స్‌లో ఉద్యోగాలే కాకుండా డిజిటల్‌, డేటా అనలిటిక్స్‌, ఫుల్‌ఫిల్‌మెంట్ నెట్‍వర్క్స్‌ వంటి విభాగాల్లో కొత్త ఉద్యోగాల కల్పన జరగనున్నట్లు ఐకియా పేర్కొంది. "ప్రస్తుతమున్న కొన్ని ఉద్యోగాల స్వభావం మారుతుంది. కొత్త రూపు సంతరించుకున్న సంస్థలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాం. సంస్థ వృద్ధి ప్రణాళికలు, పరిణామ క్రమంలో భాగంగా 3,000 పైచిలుకు కొత్త ఉద్యోగాల కల్పన జరగవచ్చని అంచనా" అని ఐకియా వివరించింది. కొెత్తగా తీర్చిదిద్దుతున్న తమ అంతర్జాతీయ వ్యవస్థతో భారత విభాగాన్ని అనుసంధానించనున్నట్లు, భవిష్యత్‍లో పోటీపడేందుకు అవసరమైన నైపుణ్యాలతో సంసిద్ధంగా ఉండేట్లు చర్యలు తీసుకోనున్నట్లు ఐకియా ఇండియా సీఈవో పీటర్ బెజెల్‌ తెలిపారు. "ప్రత్యక్షంగా, పరోక్షంగా ‍ఐకియా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఇక డిజిటైజేషన్ ప్రక్రియతో విభిన్న నైపుణ్యాలున్న మరింత మందిని నియమించుకోనున్నాం. కొత్త ఉద్యోగ విధులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రస్తుత సిబ్బందికి తగిన అవకాశాలు లభిస్తాయి" అని ఆయన వివరించారు. 
అంతర్జాతీయంగా వ్యాపారం పునర్‌వ్యవస్థీకరణ..
ఐకియా మాతృ సంస్థ ఇంగా గ్రూప్ అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలను పెద్ద ఎత్తున పునర్‌వ్యవస్థీకరిస్తోంది. వేగవంతంగా కొత్త స్టోర్స్‌, ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటుతో పాటు ఇ‍ప్పటికే ఉన్న వాటిపైనా మరింత ఇన్వెస్ట్ చేస్తోంది. వివిధ నగరాలకు అనువైన ఫార్మాట్స్‌లో స్టోర్స్‌ను అభివృద్ధి చేయడం, ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఏర్పాటు మొదలైన వాటిపై దృష్టి సారిస్తోంది. కస్టమర్స్ అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులు, సేవలను సులభతరంగా, చౌకగా మరింత మందికి అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని ఐకియా వెల్లడించింది. "వచ్చే రెండేళ్లలో అంతర్జాతీయంగా కొత్తగా 11,500 కొత్త ఉద్యోగాల కల్పన జరగనుంది. కొత్తగా 30 ఐకియా టచ్‌ పాయింట్స్‌ను ప్రారంభించడం, ఫుల్‌ఫిల్‌మెంట్‌ నెట్‌వర్క్‌పై పెట్టుబడులు, డిజిటల్ సామర్ధ్యాలను మెరుగుపర్చుకోవడం మొదలైన వ్యూహాల ద్వారా దీన్ని సాధించనున్నాం. కీలకమైన 30 మార్కెట్లలో కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నాం. దీంతో ప్రస్తుతమున్న 1,60,000 పైచిలుకు ఉద్యోగాల్లో సుమారు 7,500 ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది" అని వివరించింది. You may be interested

రెండేళ్లలో రూ.3,000 కోట్ల ఆదాయం

Thursday 22nd November 2018

ముంబై: ఆన్‌లైన్‌ ఫార్మసీ రిటైల్‌ సంస్థ, మెడ్‌లైఫ్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.830 కోట్ల ఆదాయం రాగలదని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల ఆదాయం వచ్చిందని కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ తుషార్‌ కుమార్‌ పేర్కొన్నారు. మొత్తం ఆదాయంలో  ఈ-ఫార్మసీ వ్యాపారం వాటా 80 శాతంగా ఉందని, ఇది వచ్చే ఆర్థిక సంవత్సరంలో 65-70 శాతానికి తగ్గుతుందన్న అంచనాలున్నాయని చెప్పారు. రెండేళ్లలో రూ.700 కోట్ల పెట్టుబడులు... రానున్న రెండేళ్లలో రూ.3,000

భారత్‌ నెట్‌ను ఉపయోగించుకోండి

Thursday 22nd November 2018

న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా విద్య, వైద్యం వంటి సేవలు మరింత చేరువ చేసేందుకు భారత్ నెట్ ప్రాజెక్టు కింద కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ సూచించారు. ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులకు చేరేలా చూసేందుకు భారీ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ ఉపయోగపడగలదని పేర్కొన్నారు. దాదాపు 1 లక్ష గ్రామ పంచాయతీల్లో భారత్‌ నెట్ మౌలిక

Most from this category