STOCKS

News


షాపింగ్‌ బిల్లుపై రూపీ ప్రభావం

Saturday 25th August 2018
news_main1535171110.png-19618

న్యూఢిల్లీ: రూపాయి విలువ క్షీణత సగటు వినియోగదారుడిపై భారాన్ని మోపుతోంది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మెషిన్లు తదితర ఉత్పత్తులపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ ఇటీవల జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోగా... ధరలు తగ్గుతాయని ఆశపడిన వినియోగదారులకు రూపాయి రూపంలో నిరాశే ఎదురైంది. విలువను కోల్పోయిన రూపాయి ఈ ప్రయోజనం అందకుండా చేసింది. అంతేకాదు, రూపాయి బలహీనతతో కంపెనీలు ఉత్పత్తుల ధరలను 3-6 శాతం స్థాయిలో పెంచేందుకు సిద్ధపడడం గమనార్హం. శామ్‌సంగ్‌, ఎల్‌జీ కంపెనీలు రేట్లను పెంచుతూ, అవి ఈ వారం చివరి నుంచే అమల్లోకి వస్తాయని తమ విక్రయ చానళ్లకు సమాచారం ఇచ్చాయి.
ధరల పెంపు ఏ మేర... 
ఎల్‌జీ, శామ్‌సంగ్‌ దేశీయ ఎలక్ట్రానిక్స్‌ మార్కెట్‌లో 55 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ రెండు సంస్థలు తమ ఉత్పత్తుల ధరల్ని 3-5.5 శాతం మేరకు పెంచుతూ ఈ వారం చివరి నుంచి అమలు చేయాలని నిర్ణయించాయి. ఇక ఇతర కంపెనీలు కూడా పెంపునకు సంబంధించి నూతన ధరలను ఖరారు చేసే పనిలో ఉన్నట్టు పరిశ్రమకు చెందిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఇద్దరు తెలిపారు. లెనోవో తన కంప్యూటర్‌ ఉత్పత్తుల ధరల్ని 3-4 శాతం మేర పెంచాలని నిర్ణయించింది. అంటే రూ.700 నుంచి రూ.3,000 వరకు ఉత్పత్తులను బట్టి ధరల పెంపు ఉండనుంది. ప్యానాసోనిక్‌ ఇండియా సీఈవో మనీష్‌ శర్మ స్పందిస్తూ... ‘‘పండుగల సీజన్‌ నేపథ్యంలో ధరల పెంపును సాధ్యమైనంత తక్కువకే పరిమితం చేయాలన్నది మా ప్రయత్నం. వినియోగదారుల సెంటిమెంట్‌ను సానుకూలంగా ఉంచడమే మా ఉద్దేశ్యం’’ అని చెప్పారు. ప్యానాసోనిక్‌ 2-3 శాతం స్థాయిలో ధరల్ని పెంచాలని భావిస్తుండడం గమనార్హం. గోద్రేజ్‌ అప్లయన్సెస్‌ ఈ నెలాఖరున నిర్ణయం తీసుకోనుంది.
రూపాయిని గమనిస్తున్నాం....
క్షీణిస్తున్న రూపాయి విలువపై ఎల్‌జీ ఇండియా బిజినెస్‌ హెడ్‌ విజయ్‌బాబు ఆందోళన వ్యక్తం చేస్తూ... ఈ పరిస్థితి తాము దగ్గరగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికిప్పుడు అయితే ధరల పెంపు లేదని స్పష్టం చేశారు. శామ్‌సంగ్‌ ఇండియా మాత్రం స్పందించలేదు. ఇక ఆన్‌లైన్‌ విక్రయాలకే పరిమితమైన కొడాక్‌, థామ్సన్‌తోపాటు బీపీఎల్‌ సంస్థ 32 అంగుళాలు, అంతకంటే పెద్ద తెరల టీవీల ధరల్ని రూ.1,000-2,200 శ్రేణిలో పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ కొంత మేర విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని అసెంబ్లింగ్‌ చేసి విక్రయిస్తున్నాయి. వీటిల్లో టెలివిజన్‌ ప్యానళ్లు, కంప్రెషర్లు, మ్యాగ్నెట్రాన్‌లు ఇలా ఎన్నో ఉన్నాయి. డాలర్‌తో రూపాయి బెంచ్‌మార్క్‌ ధరను 66-67 స్థాయిలో ప్రస్తుతం ఎలక్ట్రానిక్‌ కంపెనీలు ధరల్ని అమలు చేస్తున్నా‍యి. కానీ, ఇటీవలి కాలంలో డాలర్‌తో రూపాయి విలువ 70 స్థాయికి దిగజారిన విషయం తెలిసిందే. ఫలితంగా రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు, వ్యాక్యూమ్‌ క్లీనర్లు, మరికొన్ని ఉత్పత్తులపై ఇటీవలి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం తాజా ధరల పెంపుతో సగం మేర తరిగిపోనుంది. 
అమ్మకాలపై ప్రభావం...
ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ప్రముఖ రిటైల్‌ సంస్థ ‘గ్రేట్‌ ఈస్టర్న్‌ రిటైల్‌’ డైరెక్టర్‌ పులకిత్‌బెయిద్‌ జీఎస్టీ రేట్ల మార్పు అనంతరం డిమాండ్‌ క్రమంగా పుంజుకుంటోందని తెలిపారు. కానీ, తాజా రేట్ల పెంపు జీఎస్టీ రేట్ల తగ్గింపు సానుకూలతను నిరర్థకం చేయడంతోపాటు కొనుగోళ్లను ప్రభావితం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘రూపాయి విలువ క్షీణతను పరిశ్రమ సర్దుబాటు చేసుకోలేదు. కనుక పర్సనల్‌ కంప్యూటర్‌ ధరలు పెరగడం తథ్యం. వ్యయాలను సర్దుబాటు చేసుకునే విధంగా కచ్చితమైన ధరల పెంపుపై దృష్టి సారించాం. రేట్ల పెంపు పీసీ డిమాండ్‌పై పెద్దగా ప్రభావం చూపిస్తుందని అనుకోవడం లేదు’’ అని లెనోవో ఇండియా సీఈవో రాహుల్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇక దిగుమతి చేసుకుని ఉత్పత్తులను విక్రయించే పర్సనల్‌కేర్‌, కాస్మెటిక్స్‌, ప్రీమియం వస్త్రాల తయారీ కంపెనీలు తాత్కాలికంగా రూపాయి క్షీణత ప్రభావాన్ని సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించాయి. ‘‘పరిస్థితి అంత ఆందోళనకరంగా లేదు. మూడు శాతం పెంపు అన్నది ధరలపై ప్రభావం చూపదు’’ అని అరవింద్‌ బ్రాండ్స్‌ అండ్‌ లైఫ్‌స్టయిల్‌ సీఈవో జే సురేష్‌ తెలిపారు. ఈ సంస్థ గ్యాప్‌, యూఎస్‌ పోలో, సెఫోరా, చిల్డ్రన్స్‌ ప్లేస్‌ తదితర అంతర్జాతీయ బ్రాండ్ల వస్త్రాలను విక్రయిస్తోంది. అయితే, ఇవి ధరల పరంగా సున్నితమైన ఉత్పత్తులు కావన్న సురేష్‌, ఒకవేళ రూపాయి డాలర్‌తో 75 స్థాయికి పడిపోతే కొన్ని విభాగాల్లో ధరల పెంపు ఉంటుందని చెప్పారు. You may be interested

ఈ ఏడాది లాభాల్లోకి వస్తాం

Saturday 25th August 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలను ఆర్జిస్తామని బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. జూన్‌ త్రైమాసికంలో బ్యాంకు రూ.4,876 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.2,006 కోట్ల లాభాలను ఆర్జించింది. 2018-19 సెప్టెంబరు త్రైమాసికం అనంతరం నుంచి లాభాలను చూస్తామని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ శుక్రవారం వెల్లడించారు. హైదరాబాద్‌లో బ్యాంకు నిర్వహించిన

దివాలా అంచున దిగ్గజాలు..

Saturday 25th August 2018

ఢిల్లీ: మొండిపద్దుల పరిష్కారానికి రిజర్వ్‌ బ్యాంక్‌ విధించిన డెడ్‌లైన్‌ దగ్గరపడుతుండటంతో .. భారీగా రుణాలు పేరుకుపోయిన సంస్థలపై దివాలా చర్యలకు రంగం సిద్ధమవుతోంది.  దాదాపు 60 పైచిలుకు కంపెనీలు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి రావొచ్చని తెలుస్తోంది. ఇందులో పంజ్‌లాయిడ్, రిలయన్స్‌ డిఫెన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, బజాజ్‌ హిందుస్తాన్‌ వంటి కంపెనీలు ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఆర్‌బీఐ సర్క్యులర్‌ ప్రభావం..  రుణాల చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా మొండిపద్దుల

Most from this category