STOCKS

News


తనఖాల్లేకుండా కంపెనీలకు వేల కోట్ల రుణాలెలా ఇచ్చారు?

Tuesday 4th September 2018
news_main1536037593.png-19938

చెన్నై: కార్పొరేట్‌ కంపెనీల రుణ ఎగవేతల విషయంలో బ్యాంకుల ఉదాసీనతపై మద్రాస్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన తనఖాల్లేకుండా కంపెనీలకు వేల కోట్ల రుణాలను ఎలా మంజూరు చేశారంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులను నిగ్గదీసింది. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు చెన్నైకు చెందిన కనిష్క్‌ గోల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాదాపు రూ.820 కోట్ల రుణాలను ఎగవేసిన సంగతి తెలిసిందే. ఈ రుణ ఎగవేత స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జారీచేసిన కనిష్క్‌ గోల్డ్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌ ఆదేశాలను కోట్టివేయాలంటూ ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. చట్టపరమైన రుణ రికవరీ చర్యల్లో భాగంగా ఎస్‌బీఐ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
అధికారులెవరూ తప్పించుకోలేరు...
కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ ఆర్. మహదేవన్‌ బ్యాంకు తరఫు న్యాయవాదులను తూర్పారబట్టారు. ‘ఇదంతా ప్రజల సొమ్ము. ఒకపక్క ప్రజలేమో విద్య, వ్యవసాయ రుణాల కోసం తనఖాలు పెట్టికూడా బ్యాంకులను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. మరోపక్క, బ్యాంకులు మాత్రం సరైన తనఖాల్లేకుండానే ఇష్టానుసారంగా కంపెనీలకు వేల కోట్ల రుణాలిచ్చేస్తున్నాయి. సర్ఫేసి చట్టం ప్రకారం అధికారులెవరూ తప్పించుకోలేరు. వారికి కొమ్ము కాయొద్దు. ఈ స్కామ్‌తో ప్రమేయం ఉన్న బ్యాంక్‌ ఆఫీసర్లందరినీ అరెస్ట్‌ చేసేవిధంగా ఆదేశిస్తాం. ఈ కేసులో మేమిచ్చే తీర్పు దేశవ్యాప్తంగా ఒక గీటురాయిగా మారుతుంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘అసలు ఈ సంస్థకు రుణాలిచ్చేముందు బ్యాంక్‌ అధికారులు డాక్యుమెంట్లన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించారా? మంజూరు చేసిన మొత్తం రుణం ఎంత? దీనికి ప్రతిగా కంపెనీ తనఖాగా పెట్టిన ఆస్తుల విలువ ఎంత? అంటూ జడ్జి ప్రశ్నలు సంధించారు. కాగా, ఈ స్కామ్‌లో ప్రమేయం ఉన్న అధికారుల వివరాలను సేకరించాలని, తగిన దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాలంటూ ఈడీ న్యాయవాదులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది.
ఎన్‌పీఏ కేసు మాత్రమే కాదు...
కాగా, కనిష్క్‌ గోల్డ్‌ తప్పుడు పత్రాలను సమర్పించి రుణాలను పొందిందని, అదేవిధంగా ఈ నిధులను పక్కదారి పట్టించారని కూడా ఈడీ తన కౌంటర్‌లో పేర్కొంది. మొత్తంమీద ఈ మోసంలో బ్యాంకులకు రూ.824 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. అయితే, ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి బ్యాంకుల వద్ద తనఖాలో ఉన్న స్థిరాస్తుల విలువ రూ.158.65 కోట్లేనని కూడా ఈడీ కోర్టుకు వివరించింది. రుణం మంజూరు సమయంలో బ్యాంకు అధికారులు తగిన పరిశీలన జరపలేదని కూడా స్పష్టం చేసింది. ‘ఇది మొండిబాకాయి(ఎన్‌పీఏ) కేసు మాత్రమే కాదు. రుణ గ్రహీత(కనిష్క్‌ గోల్డ్‌)తో పాటు బ్యాంకుల కన్సార్షియంకు చెందిన అధికారుల ప్రమేయంతో జరిగిన నేరపూరిత కుట్ర, మోసం కూడా ఇందులో ఉంది’ అని ఈడీ వాదించింది. ఈ స్కామ్‌కు సంబంధించి కనిష్క్‌ గోల్డ్‌ డైరెక్టర్లలో ఒకరైన భూపేష్‌ కుమార్‌జైన్‌ను పన్ను ఎగవేత ఆరోపణలపై అరెస్ట్‌ చేశారు. మరోపక్క, ఈడీ డైరెక్టర్‌ కూడా మనీలాండరింగ్‌ చట్టం కింద కనిష్క్‌ గోల్డ్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు  ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సొమ్ము రికవరీ ప్రయత్నాలకు ఈడీ ఆదేశాలు గండికొడతాయని, దీన్ని కొట్టేయాలంటూ ఎస్‌బీఐ హైకోర్టును ఆశ్రయించింది.



You may be interested

ఆర్‌బీఐ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు వాయిదా

Tuesday 4th September 2018

కోల్‌కతా: ఆర్‌బీఐ ఉద్యోగులు మూకుమ్మడిగా ఈ నెల 4, 5వ తేదీల్లో తలపెట్టిన సెలవుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఆర్‌బీఐ ఉన్నత యాజమాన్యంతో పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం మూకుమ్మడి సెలవు కార్యక్రమాన్ని 2019 జనవరి మొదటి వారానికి వాయిదా వేసినట్టు రిజర్వ్‌ బ్యాంకు అధికారులు, ఉద్యోగుల ఐక్య సంఘం (యూఎఫ్‌ఆర్‌బీఓఈ) తెలిపింది. కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌ పరిధిలోని వారు పెన్షన్‌ పథకంలోకి మారే అవకాశం కల్పించాలన్నది ఉద్యోగుల

సెబీకి ఫిర్యాదుల వరద

Tuesday 4th September 2018

న్యూఢిల్లీ: లిస్టెడ్‌ కంపెనీలు, మార్కెట్‌ ఇంటర్‌మీడియరీలకు వ్యతిరేకంగా ఇన్వెస్టర్ల నుంచి వచ్చే ఫిర్యాదులు పెరిగిపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో 43,131 ఫిర్యాదులు సెబీ వద్ద దాఖలయ్యాయి. ఆరేళ్ల గరిష్ట స్థాయి ఇది. సెబీ వార్షిక నివేదిక ప్రకారం... గత ఆర్థిక సంవత్సరంలో 43,131 ఫిర్యాదులు దాఖలవ్వగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇవి 40,000గా ఉన్నాయి. 2011-12లో వచ్చిన 46,548 తర్వాత మళ్లీ గత ఆర్థిక సంవత్సరంలోనే అధిక సంఖ్యలో ఫిర్యాదులు

Most from this category