STOCKS

News


క్యాడ్‌కు కళ్లెం... రూపాయికి జోష్‌!

Saturday 15th September 2018
news_main1536988154.png-20281

న్యూఢిల్లీ: కరెంటు ఖాతా లోటు (క్యాడ్‌) పెరిగిపోకుండా చూడడం, పడిపోతున్న రూపాయి విలువకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర సర్కారు శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశీ రుణ నిబంధనలను సరళీకరించడంతోపాటు, అనవసర ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం, ఆంక్షలు విధించడం ఇందులో కీలకమైనవి.  ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక రంగ సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌, ఆర్థిక శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం సమావేశం వివరాలను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు వెల్లడించారు. క్యాడ్‌ పెరగకుండా చూడడం, విదేశీ మారకం నిధుల ప్రవాహాన్ని పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. ‘‘పెరిగిపోతున్న క్యాడ్‌కు పరిష్కారంగా అనవసర దిగుమతులను తగ్గించేందుకు, ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎటువంటి దిగుమతులను నియంత్రించాలన్నది సంబంధిత మంత్రిత్వశాఖలను సంప్రదించిన అనంతరం, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు అనుగుణంగా నిర్ణయిస్తాం’’అని జైట్లీ వివరించారు. ప్రభుత్వం ద్రవ్యలోటు కట్టడికి కట్టుబడి ఉందన్న జైట్లీ, బడ్జెట్‌లో పేర్కొన్న అంచనాలను చేరుకుంటామన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ఆర్థిక రంగంపై 5-10 బిలియన్‌ డాలర్ల మేర ప్రభావం చూపిస్తాయని చెప్పారు. ఇవే కాకుండా మరిన్ని చర్యలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు. రూపాయి తన చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయికి పడిపోవడం, డాలర్‌తో 72.91 స్థాయికి పడిపోయి కాస్తంత కోలుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి దేశ ద్రవ్యలోటు 6.24 లక్షల కోట్లుగా ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనాలు పేర్కొనగా... మొదటి నాలుగు నెలల్లోనే (ఏప్రిల్‌-జూలై) రూ.5.40 లక్షల కోట్లుగా నమోదై, నిర్ధేశిత లక్ష్యంలో 86.5 శాతానికి ద్రవ్యలోటు చేరింది. పడిపోతున్న రూపాయి విలువ నేపథ్యంలో పరిస్థితి చేయిదాటిపోకుండా చూసేందుకు, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  
నేడు కూడా సమావేశం
ప్రధానమంత్రి మోదీ శనివారం కూడా ఆర్థిక రంగంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనూ స్థూల ఆర్థిక రంగ పరిస్థితులకు ఎదురైన సవాళ్లు, రూపాయి విలువను కాపాడడంపై ప్రభుత్వం ఏ మేరకు జోక్యం చేసుకోవచ్చు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. 
కీలక నిర్ణయాలు
- 2018-19లో జారీ చేసే మసాలా బాండ్లను విత్‌హోల్డింగ్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు
- మనకు ముఖ్యం కాని ఉత్పత్తుల దిగుమతుల నిషేధం. అదే సమయంలో ఎగుమతులకు ప్రోత్సాహకాలు.
- 20 శాతంగా ఉన్న ఎఫ్‌పీఐల కార్పొరేట్‌ బాండ్‌ పోర్ట్‌ఫోలియో పరిమితిని ఒకే కార్పొరేట్‌ గ్రూపునకు పరిమితం చేయడం, ఏ కార్పొరేట్‌ బాండ్‌ ఇష్యూలో అయినా 50 శాతానికి సవరించడం.  
- ఇన్‌ఫ్రా రుణాలకు తప్పనిసరి హెడ్జింగ్‌ షరతును సరళించడం.
- తయారీ రంగ కంపెనీలు 50 మిలియన్‌ డాలర్ల వరకు రుణాలను ఏడాది కాల పరిమితితో తీసుకునేందుకు అవకాశం కల్పించడం. వీటిలో కొన్నింటిపై నిర్ణయం తీసుకోగా, మరికొన్నింటిపై స్పష్టత రావాల్సి ఉంది.


 You may be interested

ఆర్‌ఈసీ లభం రూ.1,469 కోట్లు

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ. 1,469 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం, రూ.1,076 కోట్లతో పోల్చితే 37 శాతం వృద్ధి సాధించామని ఆర్‌ఈసీ తెలిపింది. ఆదాయం అధికంగా ఉండటం దీనికి కారణమని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.5,628 కోట్ల నుంచి రూ.6,319 కోట్లకు పెరిగిందని తెలిపింది. షేర్‌ వారీ ఆర్జన(ఈపీఎస్‌) రూ.5.45

ఆధార్ డెడ్‌లైన్ పెంచండి

Saturday 15th September 2018

న్యూఢిల్లీ:  దరఖాస్తుదారుల ఫేస్ ఆథెంటికేషన్‌ ఫీచర్‌ను అమలు చేసేందుకు మరింత సమయం కావాలని విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికరణ సంస్థ (యూఐడీఏఐ)ని మొబైల్ ఆపరేటర్లు కోరారు. ఇందుకు అవసరమైన బయోమెట్రిక్ డివైజ్‌లు తయారు చేసే సంస్థలు పూర్తి స్థాయిలో సిద్ధంగా లేకపోవడం దీనికి కారణంగా పేర్కొన్నారు. ఫేస్‌ ఆథెంటికేషన్‌ అమలుకు డెడ్‌లైన్ సెప్టెంబర్ 15తో ముగిసిపోనున్న నేపథ్యంలో యూఐడీఏఐకి ఆపరేటర్ల ఫోరం (యాక్ట్‌) ఒక లేఖ రాసింది. దీన్ని అమలు

Most from this category