News


గవర్నెన్స్ లోపాలే రాణా ఉద్వాసనకు కారణం

Saturday 1st December 2018
news_main1543643317.png-22542

ముంబై: యస్‌ బ్యాంక్ సీఈవోగా రాణా కపూర్‌ను కొనసాగించే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ నిరాకరించడానికి గవర్నెన్స్‌ లోపాలు, నిబంధనలను పాటించడంలో వైఫల్యాలే కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 17న అప్పటి చైర్మన్ అశోక్‌ చావ్లాకు రాసిన లేఖలో ఆర్‌బీఐ ఈ విషయాలు పేర్కొన్నట్లు వివరించాయి. రుణాల నిర్వహణ విధానాలకు సంబంధించి బ్యాంక్‌లో పెద్ద యెత్తున అవకతవకలు కనిపించినట్లు రిజర్వ్‌ బ్యాంక్ ఆ లేఖలో పేర్కొంది. అలాగే, రాణా కపూర్ జీతభత్యాలు భారీగా పెంచే ప్రతిపాదనపై కూడా ఆర్‌బీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఈవోల బోనస్‌లను తగ్గించాలంటూ బ్యాంక్‌ల బోర్డులకు గతంలో ఇచ్చిన సూచనలకు ఇది విరుద్ధంగా ఉందని తెలిపింది. ప్రస్తుత ఎండీ, సీఈవో సారథ్యంలో యస్ బ్యాంక్ పాలన, నిర్వహణ, పర్యవేక్షణ విషయాలపై తమకున్న అనుమానాలకు ఈ పరిణామాలు ఊతమిచ్చేవిగా ఉన్నాయని లేఖలో ఆర్‌బీఐ పేర్కొంది. ఇవే కాక గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా యస్‌ బ్యాంక్‌ పలు మార్గదర్శకాలను తీవ్ర స్థాయిలో ఉల్లంఘించిందని పేర్కొంటూ.. సీఈవోగా కపూర్ కొనసాగింపును తిరస్కరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1లోగా కొత్త సీఈవోను నియమించాలని ఆదేశించింది. చావ్లా ఈ మధ్యే బోర్డు నుంచి తప్పుకోగా.. ఆర్‌బీఐ లేఖలోని అంశాలపై స్పందించేందుకు యస్‌ బ్యాంక్ నిరాకరించింది. బ్యాంకు, ఆర్‌బీఐకి మధ్య జరిగే ఉత్తర, ప్రత్యుత్తరాలన్నీ గోప్యనీయమైనవని పేర్కొంది. అయితే, ఆర్‌బీఐ లేవనెత్తిన పలు అంశాలను ఇప్పటికే పరిష్కరించినట్లు, ఇదే విషయం ఆర్‌బీఐకి కూడా తెలియజేసినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 17న ఆర్‌బీఐ లేఖ పంపించడానికి ముందే చాలా అంశాలు పరిష్కృతమైనట్లు వివరించాయి. 
రాణా కపూర్‌ పదవీకాలాన్ని ఆర్‌బీఐ కుదించినప్పట్నుంచి యస్‌ బ్యాం‍క్‌లో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. చైర్మన్ అశోక్ చావ్లాతో పాటు ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ షేరు గణనీయంగా పతనమవుతోంది. ఏకంగా 40 శాతం క్షీణించి ప్రస్తుతం 33 నెలల కనిష్ట స్థాయుల్లో ట్రేడవుతోంది. You may be interested

ఫుడ్‌ ప్రాసెస్‌ రంగానికి ఎన్‌బీఎఫ్‌సీ

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: ఆహార శుద్ధి రంగంలో కంపెనీలకు రుణ సాయం అందించేందుకు గాను రూ.2,000 కోట్ల నిధితో ఓ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీని (ఎన్‌బీఎఫ్‌సీ) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో ఇది భాగమని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ తెలిపారు. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ... ఎన్‌బీఎఫ్‌సీ ఏర్పాటుపై కేంద్ర ఆర్థిక శాఖతో చర్చించానని, ఈ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌

కమోడిటీ ట్రేడింగ్‌ సమయం పెరిగింది

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: కమోడిటీ సెగ్మెంట్‌ ట్రేడింగ్‌ సమయం మరింతగా పెరగనుంది. అంతే కాకుండా ట్రేడింగ్‌లో పాల్గొనడానికి రైతు సంఘాలను, విదేశీ సంస్థలను సెబీ అనుమతించింది. కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్‌ను మరింత విస్తృతం చేయడంలో భాగంగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఈ నిర్ణయాలు తీసుకుంది. సవరించిన వేళల ప్రకారం, వ్యవసాయేతర కమోడిటీల ట్రేడింగ్‌  ఉదయం 9 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి గం.11.55 నిమిషాల వరకూ కొనసాగుతుంది. గతంలో ట్రేడింగ్‌ సమయం ఉదయం

Most from this category