News


బంగారంపై దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలి

Wednesday 30th January 2019
Markets_main1548821325.png-23886

  • కట్‌, సానబెట్టిన వజ్రాలు, రత్నాలపైనా తగ్గించాలి
  • నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలు ఇంకా వేధిస్తున్నాయ్‌
  • కేంద్ర ఆర్థిక శాఖను కోరిన రత్నాభరణాల పరిశ్రమ
  • టీవీ, ఏసీ, ప్రిడ్జ్‌లపై దిగుమతి సుంకాలు పెంచాలి
  • దేశీయ తయారీని పెంచేందుకు ఇది అవసరం
  • కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారుల సంఘం వినతి

ముంబై: నోట్ల రద్దు, జీఎస్టీ తాలూకూ ప్రభావాలను ఇంకా ఎదుర్కొంటున్నామని, ఈ నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని రత్నాభరణాల పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కట్‌, పాలిష్డ్‌ వజ్రాలు, కట్‌, పాలిష్డ్‌ రత్నాలపై పన్నును ప్రస్తుతమున్న 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలని, వీటికి అదనంగా రుణ నిబంధనలను సరళతరం చేయాలని ఈ పరిశ్రమ కేంద్ర ఆర్థిక శాఖకు రాసిన లేఖలో పేర్కొంది. వచ్చే శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి పార్లమెంట్‌కు బడ్జెట్‌ సమర్పించనున్న నేపథ్యంలో తమ డిమాండ్లను అఖిల భారత జెమ్స్‌, జ్యుయలరీ కౌన్సిల్‌ చైర్మన్‌ అనంత పద్మనాభన్‌ లేఖ రూపంలో తెలియజేశారు. ‘‘కరెంటు ఖాతా లోటు అధికంగా ఉన్నప్పుడు దానికి కళ్లెం వేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకాన్ని 10 శాతానికి పెంచింది. నాటి నుంచి వాణిజ్య లోటు తగ్గడంతో కరెంటు ఖాతా లోటు నియంత్రణలోకి వచ్చింది. అయితే, బంగారంపై అధిక దిగుమతి సుంకాలతో ఈ లోహం దొంగ రవాణా పెరిగేందుకు దారితీస్తుంది. దీంతో సంబంధిత లక్ష్యాలు నెరవేరవు’’ అని పద్మనాభన్‌ పేర్కొన్నారు.
బడ్జెట్‌లో పరిశ్రమ ఆశిస్తున్నవి ఇవే...
- బంగారు ఆభరణాల కొనుగోళ్ల సమయంలో విలువ రూ.2 లక్షలు, అంతకుమించి ఉంటే పాన్‌ నంబర్‌ సమర్పించాలన్న నిబంధనను సడలించాలి. రూ.5 లక్షలకు పెంచాలి. దేశంలో 50 శాతం మందికి పాన్‌ లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల వారికి ఇబ్బంది అవుతోంది.
- ప్రత్యేకంగా గుర్తించిన జోన్ల ద్వారా ముడి వజ్రాలను విదేశీ మైనింగ్‌ కంపెనీలు విక్రయించేందుకు ఆదాయపన్ను నిబంధనల్లో మార్పులు చేయాలి.
- ఇన్‌పుట్‌ సేవలపై 0.25 జీఎస్టీ ఉండాలి.
- మూలధన అవసరాల కోసం రుణాలను సులభంగా పొందేందుకు నిబంధనలు సడలించాలి.
-  రత్నాభరణాల ఎగుమతులకు సంబంధించి తీసుకునే రుణాలపై 5 శాతం వడ్డీ రాయితీని తిరిగి ప్రవేశపెట్టాలి.
- కమోడిటీ ట్రేడింగ్‌ ట్యాక్స్‌ ఎత్తివేయాలి.
ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ డిమాండ్లు...
దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై సుంకాలు పెంచడంతోపాటు, వీటికి సంబంధించిన విడిభాగాల దిగుమతులపై మాత్రం సుంకాలు తగ్గించాలని కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయన్సెస్‌ తయారీ దారుల సంఘం (సీఈఏఎంఏ) కోరింది.
- టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు వంటి పూర్తి స్థాయి ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెంచాలి. వాస్తవానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల వీటి దిగుమతులపై సుంకాలు విడిభాగాల కంటే తక్కుగా ఉంటున్నాయి.
- కంప్రెషర్లు, ఓపెన్‌ సెల్‌, డిస్‌ప్లే ప్యానెళ్లపై ప్రస్తుతమున్న 10 శాతం సుంకాన్ని 5 శాతానికి తగ్గించాలి. దీనివల్ల దేశీయ తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. ధరల పరంగా స్థానిక కంపెనీలు పోటీ పడగలుగుతాయి. ఓపెన్‌ సెల్స్‌, డిస్‌ప్లే ప్యానెళ్లు, కంప్రెషర్లను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం వల్ల, అధిక సుంకాల కారణంగా దేశీయ పరిశ్రమలో రెండేళ్లుగా వృద్ధి ఉండడం లేదు.
- దేశీయంగా తయారయ్యే విడిభాగాలు, ఉత్పత్తులకు సబ్సిడీలు ఇవ్వడం వల్ల స్థానిక తయారీ పెరుగుతుంది.
- భారీగా దిగుమతి అవుతున్న సెక్యూరిటీ, నిఘా కెమెరాల విషయమై దృషి సారించాలి. వీటిపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచాలి. దిగుమతులను నిరుత్సాహపరిచి, స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ఇది అవసరం.



You may be interested

ఆల్‌టైం హైకి యాక్సిస్‌ బ్యాంక్‌

Wednesday 30th January 2019

ప్రైవేట్‌రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంకు షేరు బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఆల్‌టైం గరిష్టాన్ని అందుకుంది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. క్యూ3 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో నేడు బీఎస్‌ఈలో షేరు గతముగింపు(రూ.660.8)తో 4శాతం లాభంతో రూ.687.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే షేరు కొనుగోళ్ల మద్దతు లభించడంతో 6.50శాతం ర్యాలీ చేసి రూ.703.00వద్ద ఆల్‌టైం హైకి

‍బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం నాలుగు రెట్లు

Wednesday 30th January 2019

- క్యూ3లో రూ. 471 కోట్లు - స్వల్పంగా తగ్గిన ఎన్‌పీఏలు న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) నికర లాభం నాలుగు రెట్లు ఎగిసి, రూ. 471 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 112 కోట్లు. మరోవైపు, మూడో త్రైమాసికంలో ఆదాయం రూ. 12,976 కోట్ల నుంచి రూ. 14,563 కోట్లకు పెరిగింది. క్యూ3లో

Most from this category