News


వృద్ధి రేటు 6 శాతమే

Friday 1st March 2019
Markets_main1551435830.png-24389

- అక్టోబర్‌-డిసెంబర్‌ 
 వృద్ధి గణాంకాలు విడుదల
- ఐదు త్రైమాసికాల కనిష్ట రేటు
- అయినా ప్రపంచంలో ఏ దేశంలోనూ
ఈ స్థాయి వృద్ధి స్పీడ్‌ లేదు
- వ్యవసాయం, తయారీ రంగాల పేలవం
- వినియోగ డిమాండ్‌ కూడా బలహీనమే!
- ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలు
7.2 శాతం నుంచి 7 శాతానికి కుదింపు
- ఇదే జరిగితే ఐదేళ్లలో ఇదే తక్కువస్థాయి
న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి సంబంధించి  ప్రస్తుత ఆర్థిక సంతవ్సరం (2018 ఏప్రిల్‌ 2019 మార్చి) అక్టోబర్‌-డిసెంబర్‌ (మూడవ త్రైమాసికం) ఫలితాలు వెలువడ్డాయి. ఈ కాలంలో వృద్ధిరేటు కేవలం 6.6 శాతంగా నమోదయ్యింది. గడచిన ఐదు త్రైమాసికాల్లో (15 నెలలు) ఇంత తక్కువ స్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. అయినా ఈ స్థాయి వృద్ధి రేటు ప్రపంచంలోని ఏ దేశంలోనూ నమోదుకాకపోవడం గమనార్హం. ఇదే మూడు నెలల్లో చైనా 6.4 శాతం వృద్ధితో రెండవ స్థానంలో ఉంది.  దీనితో ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి రేటును సాధిస్తున్న దేశంగా భారత్‌ కొనసాగుతోంది. కాగా 2017-18 అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు 7.7 శాతం.  గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) గురువారం విడుదల చేసిన గణాంకాల ముఖ్యాంశాలను క్లుప్తంగా చూస్తే...
- విలువల్లో చూస్తే, 2018-19 అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య  జీడీపీ విలువ రూ.35 లక్షల కోట్లు. 2017-18 ఇదే నెలలో జీడీపీ విలువ రూ.32.85 లక్షల కోట్లు. అంటే వృద్ధి 6.6 శాతంగా ఉందన్నమాట. 
- వ్యవసాయం, తయారీ వృద్ధి తగ్గడం, బలహీన వినియోగ డిమాండ్‌ మూడవ త్రైమాసికంలో వృద్ధి స్పీడ్‌ను తగ్గించాయి. 
- మార్చి 31వ తేదీతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలు ఇంతక్రితం 7.2 శాతంకాగా ఇప్పుడు 7 శాతానికి తగ్గించడం జరిగింది. ఇదే ఫలితం వెలువడితే, గడచిన ఐదు సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి అవుతుంది. అయితే 7 శాతం స్థాయి వృద్ధి సాధించడానికి సైతం నాల్గవ త్రైమాసికంలో కనీనం 6.5 శాతం వృద్ధిని సాధించాల్సి ఉంటుంది.  కాగా క్యూ4లో 6.5 శాతం వృద్ధి సాధనకు దేశ ఎగుమతుల్లో వృద్ధి కనీసం 14 శాతం ఉండాలని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. 
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ జరిగిన త్రైమాసికంలో వృద్ధిరేటు 8 శాతం అయితే, జూలై-సెప్టెంబర్‌ మధ్య ఈ రేటు 7 శాతంగా ఉంది. తొలి అంచనాలకన్నా (వరుసగా 8.2 శాతం, 7.1 శాతం) కేంద్ర గణాంకాల శాఖ ఈ రేట్లను తగ్గించడం గమనార్హం. 
- వినియోగ వ్యయం వృద్ధి రేటు 8.4 శాతంగా నమోదయ్యింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఈ రేటు 9.9 శాతం. 
- వ్యవసాయ రంగం వృద్ధి రేటు త్రైమాసికాల పరంగా తగ్గుతూ వస్తుండడం గమనార్హం. క్యూ1లో వృద్ధి రేటు 4.6 శాతం అయితే, క్యూ2లో 4.2 శాతంగా ఉంది. ఇక క్యూ3లో భారీగా 2.7 శాతానికి పడిపోయింది. 
- వార్షికంగా చూస్తే, మైనింగ్‌, క్వారీయింగ్‌ రంగాల వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గింది. 
- తయారీ రంగం వృద్ధి రేటు 8.6 శాతం నుంచి 6.7 శాతానికి దిగింది. 
- సీఎస్‌ఓ అంచనాల ప్రకారం, 2018-19లో వ్యవసాయ రంగం 2.7 శాతం వృద్ధి సాధిస్తుంది. 2017-18లో ఈ రేటు 5 శాతం.  తయారీ రంగం వృద్ధి మాత్రం 5.9 శాతం నుంచి 8.1 శాతం వృద్ధి పెరిగే అవకాశం ఉంది. వాణిజ్యం, హోటెల్‌, రవాణా రంగాల వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదయ్యే వీలుంది. మైనింగ్, క్వారీయింగ్‌ రంగాల వృద్ధి రేటు 5.1 శాతం నుంచి 1.2 శాతానికి తగ్గుతుంది.  పెట్టుబడుల సూచీ స్థూల స్థిర మూలధన ఏర్పాటు (జీఎఫ్‌సీఎఫ్‌) రూ.48.97 లక్షల కోట్ల నుంచి రూ.55.02 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. 

తలసరి ఆదాయం రూ.92,718!
కాగా ఆర్థిక సంవత్సరం మొత్తంగా తలసరి ఆదాయం (2017-18తో పోల్చి) రూ.87,623 నుంచి రూ.92,718 కోట్లకు పెరిగే అవకాశం ఉందని గణాంకాల శాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించి వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 5.8 శాతానికి పెరగనున్నట్లు అంచనా. 



You may be interested

మౌలిక రంగం నిరాశ

Friday 1st March 2019

- జనవరిలో కేవలం 1.8 శాతం వృద్ధి  -  19 నెలల కనిష్ట స్థాయి న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్‌ జనవరి వృద్ధి ధోరణి నిరాశ కలిగించింది. వృద్ధి రేటు కేవలం 1.8 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జనవరితో (6.2 శాతం వృద్ధి) పోల్చిచూస్తే, 2019 జనవరిలో ఎనిమిది పరిశ్రమల బాస్కెట్‌  వృద్ధి కేవలం 1.8 శాతంగా నమోదయ్యిందన్నమాట. గడచిన 19 నెలల్లో (2017 జూన్‌లో కేవలం 1 శాతం)

లాభాల ముగింపు..నిఫ్టీ 71 పాయింట్లు జంప్‌

Friday 1st March 2019

 ఇండోపాక్‌ ఉద్రిక్తతల నడుమ వరుసగా మూడురోజులు నష్టాలపాలైన మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 196 పాయింట్ల లాభంతో 36,064 పాయింట్ల వద్ద క్లోజ్‌కాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 10,863 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. పాక్‌ నుంచి భారత్‌ ఎయిర్‌ఫోర్స్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ఈ రోజు  స్వదేశానికి వస్తున్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య శాంతి నెలకొంటుందన్న ఆశాభావంతో  రోజంతా వివిధ రంగాల షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా

Most from this category