News


విప్రో ప్రేమ్‌జీ రిటైర్మెంట్‌!!

Friday 7th June 2019
Markets_main1559888039.png-26149

  • జూలై 30న చైర్మన్‌గా పదవీ విరమణ
  • నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగింపు
  • కుమారుడు రిషద్‌కు చైర్మన్‌గా బాధ్యతలు

న్యూఢిల్లీ: చిన్న స్థాయి వంట నూనెల సంస్థను దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దిన ఐటీ దిగ్గజం, విప్రో వ్యవస్థాపకుడు అజీం హెచ్‌ ప్రేమ్‌జీ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. కుమారుడు రిషద్ ‍ప్రేమ్‌జీ చేతికి పగ్గాలు అందించనున్నారు. వచ్చే నెల 74వ పడిలో అడుగుపెట్టనున్న అజీం ప్రేమ్‌జీ.. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి జూలై 30న రిటైరవుతున్నారు. ఆ తర్వాత నుంచి అజీం కుమారుడు, సంస్థ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్‌, బోర్డు సభ్యుడు అయిన రిషద్ ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు చేపడతారు. రిటైరయ్యాక అజీం ప్రేమ్‌జీ అయిదేళ్ల పాటు 2024 దాకా విప్రో నాన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతారు. ఆయన వ్యవస్థాపక చైర్మన్‌గా ఉంటారని విప్రో పేర్కొంది. "దేశ టెక్నాలజీ పరిశ్రమ దిగ్గజాల్లో ఒకరు, విప్రో వ్యవస్థాపకులు అయిన అజీం ప్రేమ్‌జీ దాదాపు 53 ఏళ్లు కంపెనీకి సారథ్యం వహించిన తర్వాత జూలై 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన కంపెనీ నాన్‌-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతారు" అని స్టాక్ ఎక్స్చేంజీలకు విప్రో తెలియజేసింది. మరోవైపు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ ఆబిదాలి జెడ్ నీముచ్‌వాలాను మరో విడత అయిదేళ్ల పాటు సీఈవో, ఎండీ హోదాల్లో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విప్రో ఎంటర్‌ప్రైజెస్‌, విప్రో-జీఈ హెల్త్‌కేర్‌ చైర్మన్‌గా అజీం ప్రేమ్‌జీ కొనసాగుతారు. షేర్‌హోల్డర్ల అనుమతుల మేరకు జూలై 31 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని విప్రో వివరించింది. "ఇటు విప్రో, అటు టెక్నాలజీ పరిశ్రమ పెను మార్పులకు లోనవుతున్న ప్రస్తుత తరుణంలో అన్ని వర్గాలకూ ప్రయోజనాలు చేకూర్చేలా కృషి చేసేందుకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను" అని రిషద్ పేర్కొన్నారు. చిత్తశుద్ధి విషయంలో రాజీ పడకుండా నైతిక విలువలకు కట్టుబడి ఉండటం ద్వారా కూడా దిగ్గజ సంస్థగా ఎదగొచ్చని విప్రో దశాబ్దాలుగా నిరూపిస్తూ వస్తోందని తెలిపారు. 

ఇకపై పూర్తి స్థాయిలో సేవా కార్యక్రమాలు...
వంట నూనెల సంస్థగా మొదలైన విప్రోను 8.5 బిలియన్ డాలర్ల అంతర్జాతీయ టెక్ దిగ్గజంగా అజీం తీర్చిదిద్దారు. విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ను అంతర్జాతీయ ఎఫ్‌ఎంసీజీ సంస్థగా నిలబెట్టారు. ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్, మెడికల్ డివైజ్‌ల తయారీ తదితర రంగాల్లోకి వ్యాపారాన్ని విస్తరించారు. వీటి ఆదాయం దాదాపు 2 బిలియన్ డాలర్ల పైగా ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్ పురస్కారాల గ్రహీత అయిన అజీం ప్రేమ్‌జీ రిటైర్మెంట్ తర్వాత దాతృత్వ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాల్లో మరింతగా పాలుపంచుకోవాలని భావిస్తున్నారు. "ఈ సుదీర్ఘ ప్రస్థానం ఎంతో సంతృప్తికరంగా సాగింది. భవిష్యత్‌లో మా ఫౌండేషన్ నిర్వహించే సామాజిక సేవా కార్యకలాపాలకు మరింత సమయం వెచ్చించాలనుకుంటున్నాను. కంపెనీని అధిక వృద్ధి బాట పట్టించగలిగే సామర్ధ్యాలు రిషద్‌కు ఉన్నాయని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను" అని ప్రేమ్‌జీ పేర్కొన్నారు. ఇప్పటికే తన పేరిటే ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా ప్రేమ్‌జీ  ప్రజా సేవా కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ ట్రస్టుకు దాదాపు రూ. 52,750 కోట్ల విలువ చేసే విప్రో షేర్లను ఈ ఏడాది మార్చిలో ఆయన విరాళంగా ఇచ్చారు. ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ విద్యా రంగంలో సేవలు అందించడంతో పాటు బడుగు వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న దాదాపు 150 పైగా స్వచ్ఛంద సేవా సంస్థలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోంది. 



You may be interested

వాహన బీమా ప్రీమియం ప్రియం

Friday 7th June 2019

21 శాతం దాకా పెంపు జూన్ 16 నుంచి అమల్లోకి న్యూఢిల్లీ: కార్లు, ద్విచక్ర వాహనాల బీమా మరింత భారం చేసే నిబంధనలు జూన్ 16 నుంచి అమల్లోకి రానున్నాయి. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏఐ ఆదేశాల ప్రకారం వివిధ రకాల వాహనాలకు తప్పనిసరైన థర్డ్‌ పార్టీ (టీపీ) మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం 21 శాతం దాకా పెరగనుంది. సాదారణంగా టీపీ ఇన్సూరెన్స్ కవర్ రేట్లు ఏటా ఏప్రిల్ 1న

ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ లావాదేవీలపై రుసుముల తొలగింపు

Friday 7th June 2019

ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసే బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త ప్రకటించింది. ఆర్టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా చేసే నగదు బదిలీలపై ఛార్జీలను తొలగిస్తున్నట్లు తెలిపింది. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, బ్యాంకులు ఈ ప్రయోజనాలను తమ ఖాతాదారులకు బదిలీ చేయాలని ఆదేశించామని తెలిపింది.  దీంతో పాటు ఏటీఎం ఛార్జీలను కూడా

Most from this category