STOCKS

News


అమెరికా మార్కెట్‌... ఇకపైనా సవాలే!

Thursday 7th March 2019
news_main1551934823.png-24461

- ఔషధ కంపెనీలపై కొనసాగనున్న ఒత్తిడి
- జనరిక్స్‌ ధరల ఒత్తిడి మాత్రం కాస్త తగ్గుముఖం
- పూర్తిగా సమసిపోలేదంటున్న విశ్లేషకులు
- సన్‌ఫార్మా, బయోకాన్‌, అరబిందోపై సానుకూలం

న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో భారత ఫార్మా కంపెనీలకు ధరల ఒత్తిడి కొంత తగ్గినప్పటికీ... సమస్యలు ఇంకా పూర్తిగా సమసిపోలేదని, వృద్ధి అవకాశాలు ఇకముందు కూడా సవాలేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అబ్రివేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్ల (ఏఎన్‌డీఏ) ఆమోదం గత కొన్ని నెలలుగా మెరుగుపడింది. ప్రస్తుత తీరు ప్రకారం 2017-18 సంవత్సరంతో పోలిస్తే 2018-19లో ఏఎన్‌డీఏ ఆమోదాలు 38 శాతం పెరుగుతాయని ఐఐఎఫ్‌ఎల్‌ అనలిస్ట్‌ పేర్కొన్నారు. యూఎస్‌ఎఫ్‌డీఏ ఇకముందూ ఏఎన్‌డీఏల అనుమతుల వేగాన్ని పెంచనుందని అనలిస్టుల అంచనా. దీనివల్ల అమెరికా జనరిక్‌ మార్కెట్‌ వాతావరణం మెరుగుపడుతుందని, మొత్తం మీద జనరిక్స్‌ అనుమతులు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. అదే సమయంలో మొదటి సారి (ప్రత్యేకమైన) జనరిక్స్‌ అనుమతులు పెరుగుతాయని అంచనా. భిన్నమైన, ప్రత్యేకమైన ఉత్పత్తులు, బయోసిమిలర్ల పరంగా ఉన్న అవకాశాల వైపు కంపెనీలు చూస్తున్నాయని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రంజిత్‌ కపాడియా తెలిపారు. పోటీ కంపెనీలతో పోలిస్తే కాంప్లెక్స్‌ ఉత్పత్తులు ఉన్న కంపెనీల పట్ల బ్రోకరేజీలు సానుకూలంగా ఉన్నాయి. వీటికి అధిక వ్యాల్యూషన్‌ ఇస్తున్నాయి. 
అమెరికా మార్కెట్లో ప్రత్యేక ఉత్పత్తులు
సన్‌ఫార్మా పట్ల సానుకూలంగా ఉండేందుకు స్పెషాలిటీ ఉత్పత్తులే కారణమని అనలిస్టులు పేర్కొంటున్నారు. ఆంకాలజీ ఔషధం యోన్సా, సోరియాసిస్‌ చికిత్సలో వినియోగించే ఇలుమ్యాలను 2018-19 మొదటి అర్ధ సంవత్సరంలో సన్‌ ఫార్మా అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. కంటి చికిత్సకు సంబంధించి గ్జెల్‌ప్రోస్‌ను మూడో త్రైమాసికంలో లాంచ్‌ చేసింది. అలాగే, ప్రస్తుత త్రైమాసికం (మార్చి ముగిసేలోపు)లో సీక్వాను విడుదల చేయనుంది. ఇక జనరిక్స్‌ పరంగా ఎక్కువగా ధరల ఒత్తిడి చవిచూడని దిగ్గజ కంపెనీల్లో అరబిందో ఫార్మా కూడా ఒకటి. ఏ ఉత్పత్తిపైనా ఎక్కువగా ఆధారపడి లేకపోవడం కంపెనీకి కలిసొచ్చిందన్నది విశ్లేషణ. పైగా ఇంజెక్టబుల్స్‌ వంటి పరిమిత పోటీ ఉన్న ఉత్పత్తులపైనే కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కూడా సానుకూలించింది. దీనికి అదనంగా కొనుగోళ్ల ద్వారా వృద్ధి అవకాశాల పెంపుపై కంపెనీ దృష్టి సారిండం గమనార్హం. యూరోప్‌లో ఇటీవలే అపోటెక్స్‌ కంపెనీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను అరబిందో కొనుగోలు చేసిన విషయం గమనార్హం. ఎబిట్డాకు ఐదు రెట్లు, అమ్మకాలకు ఒక రెట్టు మాత్రమే ఖర్చు చేసి చౌకగా ఈ పోర్ట్‌ఫోలియోను సొంతం చేసుకుంది. అమెరికాలో శాండజ్‌కు చెందిన డెర్మటాలజీ వ్యాపారాన్ని ఏకీకృతం చేసే పనిని కూడా చేపట్టింది. దీనివల్ల 2019-20లో కంపెనీ షేరువారీ ఆర్జన 15-20 శాతం పెరుగుతుందని ఎలారా క్యాపిటల్‌ అంచనా. అమెరికా వ్యాపారం బలంగా ఉండడం, యూరోపియన్‌ యూనియన్‌లో వృద్ధి చెందుతుండడం, ఆపరేటింగ్‌ మార్జిన్లను ప్రతికూలం నుంచి రెండంకెల లాభదాయకత దిశగా తీసుకెళ్లడం వంటివి అరబిందో వృద్ధి అవకాశాలను పెంచేవిగా విశ్లేషకుల అంచనా. ఇక లుపిన్‌ కంపెనీ కూడా అమెరికా మార్కెట్లో వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని గ్యావిస్‌ను 2015లోనే 880 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, ఓపియోడ్‌ ఔషధాల పరంగా 2018-19 ఆరంభంలో రూ.1,464 కోట్ల  ఏకీకృత నష్టాన్ని ప్రకటించింది. కొన్ని మాలిక్యూల్స్‌ పరంగా పనితీరు ఆశాజనకంగా లేకపోవడమే ఇందుకు కారణమని కంపెనీ మాజీ సీఎఫ్‌వో రమేష్‌ స్వామినాథన్‌ తెలిపారు. 



You may be interested

మార్కెట్లోకి ‘వ్యాగన్‌ఆర్‌ ఎస్‌-సీఎన్‌జీ’

Thursday 7th March 2019

- ప్రారంభ ధర రూ.4.84 లక్షలు న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతి సుజుకీ.. వ్యాగన్‌ఆర్‌ సీఎన్‌జీ వెర్షన్‌ కార్లను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘వ్యాగన్‌ఆర్‌ ఎస్‌-సీఎన్‌జీ’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈకార్లలో ఎల్‌ఎక్స్‌ఐ వేరియంట్‌ ధర రూ.4.84 లక్షలు కాగా, ఎల్‌ఎక్స్‌ఐ(ఓ) వేరియంట్‌ ధర రూ.4.89 లక్షలు. ఈ కార్లు ప్రతి కేజీ సీఎన్‌జీకి 33.54 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తాయని సంస్థ ఎండీ, సీఈఓ కెనిచి అయుకవా తెలిపారు. సీఎన్‌జీ ఇన్‌ఫ్రా

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ చార్జింగ్ స్టేషన్లు

Thursday 7th March 2019

- ఆస్ట్రేలియన్ సంస్థతో టాటా ఆటోకాంప్ ఒప్పందం - దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కె‍ట్‌కు కొత్త ఊపిరి న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై టాటా ఆటోకాంప్ దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాకి చెందిన ట్రీటియం సంస్థతో చేతులు కలిపింది. ఈ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ట్రీటియం తయారు చేసే డైరెక్ట్ కరెంట్ (డీసీ) ఫాస్ట్ చార్జర్లను భారత్‌లో అందుబాటులోకి తేనున్నట్లు టాటా ఆటోకాంప్

Most from this category