STOCKS

News


మొండి బకాయిలు తగ్గుతాయ్‌...!

Friday 15th March 2019
Markets_main1552622862.png-24621

ఇక్రా నివేదిక వెల్లడి 
ముంబై: వరుసగా నాలుగేళ్లపాటు నష్టాలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మంచి లాభాలు సాధిస్తాయని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ, ఇక్రా తాజా నివేదిక వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి స్థూల మొండి బకాయిలు 8.1-8.4 శాతానికి దిగివస్తాయని, ఫలితంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రూ.23,000-37,000 కోట్ల రేంజ్‌లో నికర లాభం సాధిస్తాయని పేర్కొంది. అయితే మొత్తం మీద లాభదాయకత బలహీనంగానే ఉండగలదని పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల రిటర్న్‌ ఆన్‌ నెట్‌వర్త్‌ (ఆర్‌ఓఎన్‌డబ్ల్యూ) 4-6.3 శాతం రేంజ్‌లో ఉండగలదని పేర్కొంది. 
ఆరు బ్యాంక్‌ల రేటింగ్‌ అవుట్‌లుక్‌ సవరణ...
ఆరు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల రేటింగ్‌ అవుట్‌లుక్‌ను ఇక్రా సవరించింది. ఐడీబీఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ల రేటింగ్‌ను సవరించింది. 
ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు.... 
-గత నాలుగేళ్లుగా కేంద్రం భారీ స్థాయిలోనే ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో పెట్టుబడులు పెట్టింది. మొండి బకాయిలకు తగిన స్థాయిలో కేటాయింపులు  జరపడానికి ఈ నిధులు ఉపయోగపడ్డాయి. ఫలితంగా స్థూల, నికర మొండి బకాయిలు చెప్పుకోదగిన స్థాయిలో దిగివచ్చాయి. 
-ప్రభుత్వం అందించిన నిధుల తోడ్పాటు కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మూలధన నిష్పత్తులు మెరుగుపడ్డాయి. దీంతో పలు బ్యాంక్‌లు పీసీఏ చట్రం నుంచి బైటపడ్డాయి. 
-ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి స్థూల మొండి బకాయిలు 10.3 శాతంగా, నికర మొండి బకాయిలు 5.4 శాతంగా ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిలు 8.1-8.4 శాతానికి, నికర మొండి బకాయిలు 3.5-3.6 శాతానికి తగ్గుతాయి. 
-తాజా మొండి బకాయిలు తగ్గుతాయి. అలాగే మొండి బకాయిలకు కేటాయింపులు కూడా తగ్గుతాయి. 
-ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మాత్రమే లాభాలు ప్రకటించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 11-14 రేంజ్‌లో ఉండొచ్చు. 
-ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నికర నష్టాలు రూ.42,900 కోట్లుగా ఉన్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సంరలో ఇవి రూ.65,000 కోట్లకు పెరుగుతాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం నికర నష్టాలు రూ.85,400 కోట్లుగా ఉన్నాయి. 
-ప్రభుత్వ రంగ బ్యాంక్‌లతో పోల్చితే ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ల పనితీరు మెరుగ్గా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల రుణ వృద్ది 4.2 శాతంగా ఉండగా, ప్రైవేట్‌ బ్యాంక్‌ల రుణ వృద్ధి 19 శాతంగా ఉంది. ఏడాది కాలంలో ప్రైవేట్‌ బ్యాంక్‌ల రుణ వృద్ధి 64 శాతం మేర పెరగవచ్చు. 

 



You may be interested

బ్యాంకు నిఫ్టీ 1.50శాతం అప్‌

Friday 15th March 2019

 ఈ వారం ప్రారంభంలో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచి నిఫ్టీ-50ని అధిగమించి, కొత్త గరిష్టస్థాయికి చేరిన బ్యాంక్‌ నిఫ్టీ కొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. ఈ వారాంతపు రోజైన శుక్రవారం 29,400 పాయింట్ల స్థాయిని అధిగమించి సరికొత్త రికార్డును నెలకొల్పింది.  ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్ల భారీ ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభమైన అరగంటకే1.50శాతం(483 పాయింట్లు) లాభపడింది. అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌,

ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటు బ్యాంకే!

Friday 15th March 2019

ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటు బ్యాంకే! ఆర్‌బీఐ వర్గీకరణ ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటు రంగ బ్యాంకుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వర్గీకరించింది. జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) మెజారీటీ వాటా కొనుగోలు నేపథ్యంలో ఈ వర్గీకరణ జరిగింది. బ్యాంకులో 51 శాతం వాటాపై నియంత్రణ ప్రక్రియను ఎల్‌ఐసీ జనవరిలో పూర్తిచేసింది. జనవరి 21 నుంచీ ప్రైవేటు రంగ బ్యాంక్‌గా ఐడీబీఐ బ్యాంక్‌  వర్గీకరణ అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ ప్రకటన తెలిపింది.

Most from this category