STOCKS

News


కంపెనీలకు కాసులు కురిపించే పోల్‌ సీజన్‌

Friday 15th March 2019
news_main1552622476.png-24619

కంపెనీలకు కాసులు కురిపించే పోల్‌ సీజన్‌
బిస్కట్లు, స్నాక్స్‌, పానీయాలకు డిమాండ్‌
2014 ఎన్నికల సీజన్‌తో పోలిస్తే పెరుగుతుందని అంచనా
అదనపు నిల్వలతో పెరిగే డిమాండ్‌కు కంపెనీలు సిద్ధం
డిస్ట్రిబ్యూటర్ల స్థాయిలో అమ్మకాలపై ప్రోత్సాహకాలు

న్యూఢిల్లీ: మన దేశంలో ఎన్నికలు ఓ పెద్ద మార్కెట్‌. ఎప్పుడు ఎన్నికలు జరిగినా... రాజకీయ పార్టీలకు ప్రచార సామగ్రిని సమకూర్చే వారికి బోలెడంత ఉపాధి. మరీ ముఖ్యంగా కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలూ జోరుగా సాగుతాయి. బిస్కట్లు, స్నాక్స్‌, పానీయాలు పెద్ద ఎత్తున అమ్ముడుపోవడమే కాదు... చివరికి టెలికం కంపెనీలకూ పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చిపెడుతుంది. డేటా వినియోగం పెరగడం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించగలుగుతాయి. వచ్చే నెల 11 నుంచి సార్వత్రిక ఎన్నికలకు ఏడు దశల్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. మే 23న పోలింగ్‌ చివరి దశ ముగుస్తుంది. ఈ రెండు నెలల కాలంలో రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహిస్తుంటాయి. వీటికి పెద్ద ఎత్తున ప్రజల సమీకరణ కూడా జరుగుతుంది. ఆ సందర్భంగా తినే ఆహార పదార్థాలు, పానీయాలకు డిమాండ్‌ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 90 కోట్ల మంది ఓటర్లు మన దేశంలో ఉన్నారు. ఇది కచ్చితంగా ఇంటి బయట వినియోగానికి పెద్ద అవకాశం అవుతుందని పార్లే ప్రొడక్ట్స్‌ సీనియర్‌ కేటగిరీ హెడ్‌ బి.కృష్ణారావు తెలిపారు. ఎన్నికల సమయంలో అదనంగా 4-5 శాతం అమ్మకాల్లో వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. కంపెనీలు ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ఉత్పత్తుల నిల్వలను పెంచుతున్నాయి. అర్ధరాత్రి సమయాల్లోనూ సరుకులను సరఫరా చేయడంతోపాటు, తగ్గింపులను కూడా ఆఫర్‌ చేస్తున్నాయి. తద్వారా ఈ సీజన్‌లో అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టాయి. 
ఈ సీజన్‌పై అధిక అంచనాలు
2014 సాధారణ ఎన్నికల సమయంలో కన్జ్యూమర్‌ గూడ్స్‌ అమ్మకాలు ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 2.4 శాతం తగ్గిపోయాయి. అధిక ద్రవ్యోల్బణానికి తోడు ఆర్థిక వృద్ధి కనిష్ట స్థాయిలకు చేరడం ప్రభావం చూపించింది. టీ అమ్మకాలు 2.4 శాతం తగ్గితే, బిస్కట్ల అమ్మకాలు ఏకంగా 7.8 శాతం తక్కువగా 2014 ఏప్రిల్‌-మే నెలల్లో నమోదయ్యాయి. అయితే, ఈ ఏడాది పోల్‌ సీజన్‌పై కంపెనీలు ఆశావహ అంచనాలతో ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ గూడ్స్‌ రెండంకెల వృద్ధిని నమోదు చేస్తున్న క్రమంలో డిమాండ్‌ భారీగా పెరుగుతుందని అంచనాలు వేస్తున్నాయి. ‘‘చిన్న ప్యాక్‌ల అమ్మకాలు భారీగా ఈ విడత అమ్ముడుపోతాయని అంచనా వేస్తున్నాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మా చానల్స్‌ స్టాక్‌తో సిద్ధంగా ఉన్నాయి. రానున్న వారాల్లో పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేసేందుకు సంసిద్ధంగా ఉన్నాం’’ అని బ్రిటానియా వైస్‌ ప్రెసిడెంట్‌ గుంజన్‌ షా తెలిపారు. ఎన్నికలు నడి వేసవిలో జరుగుతుండడంతో సాఫ్ట్‌ డ్రింక్‌ కంపెనీలు డిస్ట్రిబ్యూషన్‌ స్థాయిలో ప్రోత్సాహక కార్యక్రమాలు ఆరంభించాయి. ‘‘ఎన్నికల తరుణంలో ప్రజలు మరింత మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. ఓటింగ్‌ జరిగే వారాల్లో వినియోగం భారీగా పెరుగుతుంది’’ అని కోకకోలా సీఈవో జేమ్స్‌కున్సే పేర్కొన్నారు.
వృద్ధి స్వల్పంగానే...  
మార్కెట్‌ పరిశోధనా సంస్థ నీల్సన్‌ నివేదిక ప్రకారం... భారత ఎఫ్‌ఎంసీజీ మార్కెట్‌ 2019లో 11-12 శాతం మేర వృద్ధి చెందనుంది. 2018లో నమోదైన 13.8 శాతం కంటే తక్కువ. దీనికి గతంలోని అధిక అమ్మకాల బేస్‌ కారణం. ‘‘చారిత్రక గణాంకాలను పరిశీలిస్తే ఎన్నికల సమయాల్లో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల్లో వృద్ధి స్వల్పంగానే ఉన్నది’’ అని జనవరిలో విడుదల చేసిన నివేదికలో నీల్సన్‌ పేర్కొంది. సీజన్‌వారీ అమ్మకాలు దేశవ్యాప్తంగా ఫ్లాట్‌గానే ఉన్నాయని, అవసరాలకు అనుగుణంగా సరఫరాను పెంచనున్నట్టు బిస్లరి ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు రమేశ్‌ చౌహాన్‌ తెలిపారు.
టెలికం కంపెనీలకు పండగ! 
వాయిస్‌, డేటా వినియోగం భారీగా పెరుగుతుందని, తద్వారా సగటు వినియోగదారుని నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) పెరుగుతుందన్న అంచనాతో టెలికం కంపెనీలు ఉన్నాయి. ‘‘ఎన్నికల సీజన్‌ రాకతో మొబైల్‌ డేటా వినియోగం 30-40 శాతం వరకు జూన్‌ త్రైమాసికంలో పెంచుతుంది. ఇది 2019-20 మొదటి క్వార్టర్లో ఏఆర్‌పీయూ 15 శాతం పెరిగేందుకు దారితీస్తుంది’’ అని ఐఐఎఫ్‌ఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. పోలింగ్‌ ధోరణలను కేవలం టీవీల్లోనే చూడడానికి పరిమితం కాకుండా, తమ స్టార్ట్‌ఫోన్లలోనూ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చూపించే ఆసక్తితో మొబైల్‌ డేటా వినియోగంలో వృద్ధి ఉంటుందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. You may be interested

ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటు బ్యాంకే!

Friday 15th March 2019

ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటు బ్యాంకే! ఆర్‌బీఐ వర్గీకరణ ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటు రంగ బ్యాంకుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వర్గీకరించింది. జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) మెజారీటీ వాటా కొనుగోలు నేపథ్యంలో ఈ వర్గీకరణ జరిగింది. బ్యాంకులో 51 శాతం వాటాపై నియంత్రణ ప్రక్రియను ఎల్‌ఐసీ జనవరిలో పూర్తిచేసింది. జనవరి 21 నుంచీ ప్రైవేటు రంగ బ్యాంక్‌గా ఐడీబీఐ బ్యాంక్‌  వర్గీకరణ అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ ప్రకటన తెలిపింది.

పాజిటివ్‌ స్టార్ట్‌

Friday 15th March 2019

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయ్యిందనేవార్తలతో ఆసియా మార్కెట్లు జోరుగా పెరిగిన నేపథ్యంలో నాలుగురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు శుక్రవారం సైతం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో 37,855 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 11376 పాయింట్ల వద్ద మొదలయ్యింది. కొద్ది నిముషాల్లోనే 10,400పైకి నిఫ్టీ ఎగబాకడం విశేషం. కొటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు

Most from this category