STOCKS

News


కార్డుల భద్రతపైనే దృష్టి

Tuesday 18th September 2018
news_main1537249309.png-20345

మాస్టర్‌ కార్డ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ కుమార్‌  

  • మా కార్డులు హ్యాక్‌ చేయలేరు
  • వాలెట్, జేబుల్లో కార్డులను ట్యాప్‌ చేయలేరు
  • సోషల్‌ మీడియా ప్రచారంలో వాస్తవం లేదు
  • నోట్ల రద్దు తర్వాత కార్డు లావాదేవీలు 10% పెరిగాయి
  • ఈ ఏడాది 50 లక్షలు దాటనున్న పాస్‌మెషీన్లు
  • నగదు పెద్ద భూతం, ఆర్ధిక వ్యవస్థకు మంచిది కాదు

సాక్షి, అమరావతి : పెద్ద నోట్ల రద్దు తర్వాత డెబిట్‌ కార్డు ద్వారా కొనుగోళ్లు 10 శాతంపైగా పెరిగినట్లు అంతర్జాతీయ పేమెంట్, టెక్నాలజీ కంపెనీ మాస్టర్‌ కార్డు చెపుతోంది. ఇప్పటీకి 95 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతుండటంతో ఇండియాకి మరిన్ని పేమెంట్‌ సొల్యూషన్స్‌ సంస్థల అవసరం ఉందని మాస్టర్‌ కార్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో... తాము తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇండియాలో డిజిటల్‌ లావాదేవీలు తదితర అంశాలను ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ వివరాలు...

పెద్ద నోట్ల రద్దు తర్వాత కార్డు లావాదేవీలు పెరిగినట్లే పెరిగి, మళ్లీ నగదు లావాదేవీలు యథాస్థానానికి వచ్చాయని పలు సర్వేలు చెపుతున్నాయి?
ఇందులో పూర్తిగా వాస్తవం లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీలు భారీగా పెరగటం నిజం. అప్పటి వృద్ధిరేటుతో పోలిస్తే ఇప్పుడు తక్కువగా ఉన్నప్పటికీ వృద్ధి కొనసాగుతోంది. గతంలో డెబిట్‌ కార్డులను 95 శాతం ఏటీఎంల నుంచి నగదును తీసుకోవడానికే వాడేవారు. 5 శాతమే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పాస్‌) మెషీన్ల వద్ద స్వైప్‌ చేసేవారు.

కానీ ఇప్పుడు ఏటీఎంల నుంచి విత్‌డ్రాయల్స్‌ 85 శాతం లోపే ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దుతో పాస్‌ మెషీన్లు పెరిగాయి. అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ సంస్థల ప్రవేశంతో డిజిటల్‌ లావాదేవీలూ పెరిగాయి. అంతెందుకు! అందరం కలిసి 40 ఏళ్లలో 15 లక్షల పాస్‌ మెషీన్లు అందుబాటులోకి తీసుకువస్తే కేవలం ఈ రెండేళ్లలో ఈ సంఖ్య 37 లక్షలకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికిది 50 లక్షలు దాటొచ్చు.

ప్రభుత్వం రూపే కార్డును ప్రోత్సహిస్తుండటం, గూగుల్‌ పే, పేటీఎం వంటి సంస్థల ప్రవేశంతో మాస్టర్‌ కార్డుకు పోటీ పెరిగిందా?
ప్రభుత్వం రూపే, భీమ్‌ యాప్, భారత్‌ క్యూఆర్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ విషయం. ఇవే కాక మరిన్ని పేమెంట్‌ సొల్యూషన్‌ సంస్థలు రావాల్సిన అవసరం ఉంది. ఇవేమీ మాస్టర్‌కార్డుకు పోటీ కానే కాదు. ఇప్పటికీ దేశంలో 95 శాతం నగదు లావాదేవీలే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో డిజిటల్‌ లావాదేవీల విలువ 200 బిలియన్‌ డాలర్ల లోపే. ఇది వచ్చే ఐదేళ్ల లో ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

కాబట్టి ఆర్థిక వ్యవస్థకు భూతం లాంటి నగదు లావాదేవీలను తరిమికొట్టడానికి మరింత మంది రావాలి. ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌లో భాగం గా రూపే కార్డుతో సబ్సిడీలివ్వటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది చాలామంచి పరిణామం. మాస్టర్‌ కార్డు అనేది ఇంటర్నేషనల్‌ కార్డు. ఈ కార్డు ను ప్రపంచంలో మూడు దేశాలు (ఇరాన్, నార్త్‌కొరియా, సిరియా) తప్ప అన్ని దేశాల్లో వాడొచ్చు. ఏ కార్డునైనా బ్యాంకులు జారీ చేసే అవకాశం ఉంది కనక మాకు ఇబ్బందేమీ లేదు. ఇప్పటికీ దేశీయ డెబిట్‌ కార్డు విభాగంలో మాది అగ్రస్థానమే.  

డిజిటల్‌ లావాదేవీలకు ఫీజులు ఇబ్బందికరమే కదా?
దీన్ని గుర్తించే ప్రభుత్వం రూ.2,000 లోపు డెబిట్‌కార్డు లావాదేవీలపై ఫీజులను రద్దు చేసింది. రూ.2,000 లోపు లావాదేవీలపై మర్చెంట్‌ ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదు. మొత్తం కార్డు లావాదేవీల్లో 85 శాతం రూ.2,000 లోపు ఉండటంతో చాలామందికి ఉపయోగకరంగా ఉంది. చిన్న లావాదేవీలపై మేం కూడా 99 శాతం చార్జీలను తగ్గించాము.  

మరి డిజిటల్‌ మోసాల సంగతో..?
కార్డు భద్రత చాలా ప్రధానం. గత నాలుగేళ్లలో మేం ఇందుకోసం రూ.6,800 కోట్లు ఖర్చు చేశాం. గతంలో స్వైపింగ్‌ కార్డు స్థానంలో చిప్‌ కార్డులు తేగా... ఇపుడు అంతకంటే సెక్యూరిటీతో కూడిన వైఫై (కాంటాక్ట్‌ లెస్‌) కార్డులను ప్రవేశపెట్టాం. చిప్, కాంటాక్ట్‌ లెస్‌ కార్డుల్లో టోకెనైజేషన్‌ టెక్నాలజీ వాడటం వల్ల మీ 16 నెంబర్ల కార్డు నెంబరు అల్గోరిథమ్‌లో 50–60 నెంబర్లుగా మారిపోతుంది. ఈ కార్డుల వివరాలను ఎవ్వరూ హ్యాక్‌ చేయలేరు.

వైఫై కార్డుల్లో రూ.2,000 లోపు లావాదేవీలను మూడుసార్లు వరకు ఎలాంటి పిన్‌ లేకుండా వాడవచ్చు. అంతకంటే ఎక్కువైతే రూ.2,000లోపు లావాదేవీ అయినా సరే పిన్‌ నెంబర్‌ను వాడాల్సి ఉంటుంది. దీనివల్ల కార్డును ఎవరు దొంగిలించినా అధిక లావాదేవీలు నిర్వహించడానికి వీలుండదు. ఇకపై అన్నీ వైఫై కార్డులనే జారీ చేస్తాం. పాస్‌ మెషీన్లు కూడా కాన్‌టాక్ట్‌లెస్‌ టెక్నాలజీతోనే విడుదల చేస్తున్నాం.

వాలెట్, జేబుల్లో ఉన్న కార్డుల డేటాను కూడా హ్యాక్‌ చేయొచ్చునంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. నిజమా?
బస్సులో, షాపింగ్‌ మాల్స్‌లో వాలెట్‌ లేదా జేబును టచ్‌ చేయడం ద్వారా  మీ కార్డులోని డేటాను మొత్తం తెలుసుకోవచ్చునంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వీడియోల్లో వాస్తవం లేదు. కేవలం వాలెట్‌ను టచ్‌ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోలేరు. దీనిపై అవగాహన కల్పించే వీడియోను రూపొ ందిస్తున్నాం. త్వరలోనే విడు దల చేస్తాం. ఇక ఏటీఎం మెషీన్లు స్కిమ్మింగ్‌ చేసి కొత్త కార్డులను తయారు చేయడమనేది ఆయా ఏటీఎంలు నిర్వహిస్తున్న బ్యాంకులు తీసుకునే పటిష్టమైన చర్యలపైనే ఆధారపడి ఉంటుంది.  

ఇండియా కార్యకలాపాల్లో వృద్ధి ఎలా ఉంది?
ఇక్కడ డిజిటల్‌ బ్యాకింగ్‌లో అపార అవకాశాలున్నాయి. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో 90 శాతం లావాదేవీలు డిజిటల్‌లో జరుగుతుంటే ఇక్కడ 5 శాతం కూడా లేవు. అందుకే ఇండియాను ప్రధానమైన మార్కెట్‌గా చూస్తున్నాం. ఇక్కడ 2013లో 29 మందిగా ఉన్న ఉద్యోగులు ఇపుడు 2వేలు దా టారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 15 శా తం మంది ఇక్కడే ఉన్నారు. ఆదాయంలో చూస్తే మూడు శాతం ఇక్కడ నుంచి వస్తోంది. కాబట్టి రా నున్న కాలంలో మరింతగా పెట్టుబడులు పెడతాం.You may be interested

తాజా టారీఫ్‌లపై ట్రం‍ప్‌ ఆర్డర్‌

Tuesday 18th September 2018

200 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై 10 శాతం తాజాగా 200 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై 10 శాతం టారీఫ్‌లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. సెప్టెంబర్‌ 24 నుంచి అమల్లోకి వచ్చే ఈ టారీఫ్‌లపై ఈ సంవత్సరాంతం వరకూ 10 శాతం సుంకం వర్తిసుందని, జనవరి నుంచి టారీఫ్‌లు 25 శాతానికి పెరుగుతాయని ట్రంప్‌ తెలిపారు. అలాగే తమ పరిశ్రమ, తమ

మార్కెట్లోకి మరిన్ని ఉత్పత్తులు

Tuesday 18th September 2018

కెంట్‌ ఆర్‌వో సీఎండీ మహేష్‌ గుప్త నూతన ఆర్‌వో ప్యూరిఫయర్ల విడుదల హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వాటర్‌, ఎయిర్‌ ప్యూరిఫయర్ల తయారీ సంస్థ ‘కెంట్‌ ఆర్‌వో సిస్టమ్స్‌’... కిచెన్‌ అప్లయన్సెస్‌ శ్రేణిని విస్తృతం చేసే పనిలో ఉంది. ఇప్పటికే కంపెనీ గ్రైండర్‌/బ్లెండర్‌, టోస్టర్‌, జ్యూసర్‌, శాండ్‌విచ్‌ మేకర్‌, ఎలక్ట్రిక్‌ రైస్‌ కుకర్‌, ఫ్రైయర్‌, దోస మేకర్‌ వంటి ఉపకరణాలను విక్రయిస్తోంది. డిమాండ్‌ ఉన్న అప్లయన్సెస్‌ తయారీలోకి ప్రవేశిస్తామని కెంట్‌ ఆర్‌వో సిస్టమ్స్‌ సీఎండీ

Most from this category