STOCKS

News


వృద్ధి స్పీడ్‌కు ఫిచ్‌ రెండవసారి బ్రేక్‌లు!

Tuesday 18th June 2019
news_main1560837566.png-26372

 2019-2020లో
  జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతమే
- ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి స్పీడ్‌ 
  అంచనాకు కోత ఇది రెండవసారి
- ఇంతక్రితం 7 శాతం నుంచి
  6.8 శాతానికి కుదింపు

- తయారీ, వ్యవసాయం పేలవ పనితీరు నేపథ్యం
న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- ఫిచ్‌ వరుసగా రెండవసారి కుదించింది. 2019- 2020లో కేవలం 6.6 శాతమే నమోదవుతుందని ఫిచ్‌ అంచనా వేసింది. తొలుత 7 శాతంగా ఉన్న ఈ అంచనాలను మార్చిలో 6.8 శాతానికి తగ్గించింది. ఆర్థిక మందగమనం దీనికి కారణంగా పేర్కొంది.  తాజాగా మరో 20 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) కుదించింది.  గత ఏడాది కాలంగా తయారీ, వ్యవసాయ రంగాల పేలవ పనితీరు తమ తాజా అంచనాలకు కారణమని సోమవారం విడుదల చేసిన తన తాజా నివేదికలో ఫిచ్‌  పేర్కొంది. జీడీపీలో ఈ రెండు రంగాల వెయిటేజ్‌ కొంచెం అటు ఇటుగా 15 చొప్పున ఉంది.  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జూలై 5వ తేదీన 2019-20 పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఫిచ్‌ ‘గ్లోబల్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ పేరుతో’ తాజాగా విడుదల చేసిన నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
- 2020-2021లో భారత్‌ వృద్ధి 7.1 శాతానికి చేరుతుంది. అయితే 2021-2022లో ఈ రేటు 7 శాతానికి దిగివస్తుంది. 
- అయితే 2019-2020కి సంబంధించి తాజా ఫిచ్‌ అంచనా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా (7 శాతం) కన్నా తక్కువగా ఉండడం గమనార్హం. 
- అంతర్జాతీయ అంశాలతో పాటు దేశీయ పరిస్థితులూ భారత్‌ వృద్ధి మందగమనానికి  కారణమవుతున్నాయి. ఎగుమతుల పెరుగుదలా ఇటీవలి కాలంలో పేలవంగా ఉంది. 
- బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- రెపో (ప్రస్తుతం 5.75 శాతం) రేటును 2019లో మరో 25 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించే అవకాశాలు ఉన్నాయి. రేటు తగ్గింపు వల్ల ప్రైవేటు రంగంలో రుణ సౌలభ్యత పెరుగుతుంది. ఇది వృద్ధికి దారితీసే అంశం. ఇలాంటి పరిస్థితి దేశంలోకి పెట్టుబడులనూ ఆకర్షిస్తుంది. 
- 2019 చివరి నాటికి డాలర్‌ మారకంలో రూపాయి  విలువ కొంచెం అటుఇటుగా 70 వద్దే స్థిరపడుతుంది. 2020 నాటకి ఈ విలువ 71కి బలహీనపడుతుంది. 
- అంతర్జాతీయ వాణిజ్య యుద్దం అంతర్జాతీయ పెట్టుబడులపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇది ప్రతికూలాంశం. 
- చైనాపై అమెరికా టారిఫ్‌లు తగ్గినా... 2020లో ప్రపంచ ఆర్థిక రంగం ఊపందుకునే అవకాశం లేదు. వాణిజ్యంలో అనిశ్చితి వాతావరణం ఇప్పటికే పెట్టుబడులకు సంబంధించి తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితిని సృష్టించింది. 
- 2020 వృద్ధి రేటును ఇంతక్రితం 2.8 శాతంగా అంచనావేసినా తాజాగా 2.7 శాతానికి కుదిస్తున్నాం. చైనా వృద్ధి రేటు అంచనా కూడా 6.1 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నాం. అమెరికా వృద్ధి రేటు అంచనా కూడా 1.9 శాతం నుంచి 1.8 శాతానికి తగ్గిస్తున్నాం. 2018లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతం వృద్ధిసాధించింది. ఇది 2019లో 2.8 శాతానికి తగ్గే అకాశాలు ఉన్నాయి. 
- భారత్‌ ఆర్థిక రంగం మందగమనంలో ఉన్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. 2018-19లో కేవలం 6.8 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. గడచిన ఐదేళ్లలో ఇంత తక్కువ స్థాయి వృద్ధి స్పీడ్‌ ఇదే తొలసారి. ఇక జనవరి-మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టం 5.8 శాతానికి దిగింది. దీనితో ఈ త్రైమాసికంలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న హోదాను చైనాకు భారత్‌ కోల్పోయింది. సంబంధిత త్రైమాసిక కాలంలో చైనా వృద్ధి రేటు 6.4 శాతం. 



You may be interested

ఇండిగో షేరుకు ఆర్డర్ల హుషారు!

Tuesday 18th June 2019

బీఎస్‌ఈ లో 2శాతం​పెరిగిన షేరు విలువ ఇండిగో షేరు విలువ మంగళవారం సెషన్‌లో 2 శాతం పెరిగి రూ. 1,673.60వద్ద ట్రేడవుతోంది. యూఎస్‌ ఆధారిత సీఎఫ్‌ఎమ్‌ ఇంటర్నేషనల్‌ లీప్‌-1ఏ ఇంజిన్‌ల కోసం 20 బిలియన్‌ డాలర్ల ఆర్డర్లను పెట్టామని కంపెనీ ప్రకటించడంతో ఇండిగో షేరు విలువ పెరిగింది.  గత మూడేళ్ల నుంచి ఉపయోగిస్తున్నా ఏ320 నియో ఇంజిన్‌ల వలన ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అందుకే సీఎఫ్‌ఎమ్‌ ఇంజిన్‌లను ఉపయోగించాలని నిర్ణయించుకున్నామని కంపెనీ తెలిపింది.

ఫేస్‌బుక్‌ నుంచి కొత్త క్రిప్టో కరెన్సీ

Tuesday 18th June 2019

రూపకల్పనకు లిబ్రా పేరిట కన్సార్షియం వీసా, మాస్టర్‌కార్డ్‌, పేపాల్‌తో జట్టు లండన్‌: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ ఫేస్‌బుక్ కొత్తగా వివాదాస్పద క్రిప్టో కరెన్సీ చెల్లింపుల విధానాన్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థల ఆమోదముద్ర గల కొత్త క్రిప్టోకరెన్సీకి సంబంధించిన విషయాలను మంగళవారం ఆవిష్కరించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. దీని రూపకల్పన కోసం లిబ్రా

Most from this category