STOCKS

News


చిన్న వ్యాపారులకు భారీ ఊరట

Friday 11th January 2019
news_main1547184674.png-23520

  • రూ.40 లక్షల టర్నోవర్‌పై జీఎస్టీ లేదిక
  • మినహాయింపు పరిమితి రెట్టింపు
  • కేరళ చేతికి ఒక శాతం విపత్తు సెస్సు
  • రూ.1.5 కోట్ల టర్నోవర్‌పై ఒక శాతమే పన్ను
  • వచ్చే ఏప్రిల్‌ నుంచి అమల్లోకి
  • జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు

న్యూఢిల్లీ: చిన్న వ్యాపారులకు ఊరట కల్పిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు రూ.20 లక్షల వరకు వార్షిక వ్యాపారంపై జీఎస్టీ మినహాయింపు ఉండగా... దీన్ని రెట్టింపు చేస్తూ రూ.40 లక్షలకు పెంచింది. దీనికితోడు ఒక శాతం పన్ను చెల్లించే కాంపోజిషన్‌ స్కీమ్‌ టర్నోవర్‌ పరిమితిని రూ.1.5 కోట్లు చేయాలని గతంలోనే నిర్ణయించగా... ఇది వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని కౌన్సిల్‌ ప్రకటించింది. భారీ వరదలతో దెబ్బతిన్న కారణంగా... పునర్నిర్మాణ కార్యక్రమాలకు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అంతర్రాష్ట్ర రవాణాపై రెండేళ్ల పాటు ఒక శాతం విపత్తు సెస్సును విధించుకునే అవకాశాన్ని కేరళ రాష్ట్రానికి కౌన్సిల్‌ కల్పించింది. ఈ మేరకు గురువారం జీఎస్టీ కౌన్సిల్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం వార్షికంగా రూ.20 లక్షల టర్నోవర్‌ లోపు ఉంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ నుంచి మినహాయింపు ఉందని, దీన్ని రూ.40 లక్షలకు పెంచామని చెప్పారు. పర్వత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉండగా, ఇకపై రూ.20లక్షలు అవుతుందన్నారు. జీఎస్టీ మినహాయింపును రెట్టింపు చేయడం వల్ల... అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే రూ.5,200 కోట్ల మేర పన్ను రాబడి తగ్గుతుందని అంచనా.
కాంపోజిషన్‌ స్కీమ్‌ మినహాయింపులు
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి వరకు టర్నోవర్‌ ఉన్న వారు... కాంపోజిషన్‌ స్కీమ్‌ కింద టర్నోవర్‌పై ఒక శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఈ పరిమితిని రూ.1.5 కోట్లకు పెంచుతూ కౌన్సిల్‌ నవంబర్‌ నాటి సమావేశంలోనే నిర్ణయం తీసుకుంది. దీన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించింది. సర్వీస్‌ ప్రొవైడర్లు, వస్తు, సేవల సరఫరా దారులు రూ.50 లక్షల్లోపు టర్నోవర్‌ ఉంటే, కాంపోజిషన్‌ స్కీమ్‌ కింద 6 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. కాంపోజిషన్‌ స్కీమ్‌లో టర్నోవర్‌ పరిమితి పెంచటం వల్ల రూ.3,000 కోట్ల మేర ఆదాయం తగ్గొచ్చని అంచనా. ఈ నిర్ణయాలు, సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి వ్యాపారులకు (ఎంఎస్‌ఎంఈ) ఉపశమనం కల్పిస్తాయని జైట్లీ అభిప్రాయపడ్డారు. కాంపోజిషన్‌ స్కీమ్‌ను ఎంచుకునే వ్యాపారులు వార్షికంగా ఒకేసారి ట్యాక్స్‌ రిటర్ను వేస్తే సరిపోతుందని, పన్ను మాత్రం త్రైమాసికానికి ఓ సారి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారాయన. ‘‘జీఎస్టీలో ఎక్కువ భాగం వ్యవస్థీకృత రంగం, పెద్ద కంపెనీల నుంచే వస్తోంది. ఈ నిర్ణయాలు ఎంఎస్‌ఎంఈలకు మేలు చేస్తాయి. వారికి పలు ఆప్షన్లు ఇచ్చాం. సేవల రంగంలో ఉంటే, 6 శాతం కాంపౌండింగ్‌ పొందొచ్చు. తయారీ రంగంలో ఉంటే రూ.1.5 కోట్ల టర్నోవర్‌పై ఒక శాతం కాంపౌడింగ్‌ ఎంచుకోవచ్చు. వీరు రూ.40 లక్షల వరకు పన్ను మినహాయింపును కూడా పొందొచ్చు. సరుకుల సరఫరాదారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌, చెల్లింపు విషయంలో రూ.40 లక్షలు, రూ.20 లక్షల పరిమితులు ఉన్నాయి. పరిమితి  పెంచుకునేందుకు, తగ్గించుకునేందుకు వారికి అవకాశం ఉంటుంది’’ అని జైట్లీ వివరించారు.
ఇతర నిర్ణయాలు...
- రియల్‌ ఎస్టేట్‌పై జీఎస్టీ విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో ఏడుగురు సభ్యుల మంత్రివర్గ గ్రూపును ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది.
- లాటరీల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో దీన్ని కూడా మంత్రివర్గ బృందమే తేల్చనుంది.
- ప్రస్తుతం రూ.20 లక్షల్లోపు టర్నోవర్‌కు పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ... 10.93 లక్షల మంది పన్నులు చెల్లిస్తున్నారని కేంద్ర రెవెన్యూ సెక్రటరీ అజయ్‌భూషణ్‌ పాండే తెలిపారు. రూ.40 లక్షల టర్నోవర్‌ వరకు మినహాయింపు అనేది సరుకుల వర్తకానికి, ఒకే రాష్ట్రం పరిధిలో వాణిజ్యానికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య లావాదేవీలకు ఇది వర్తించదన్నారు.
- జీఎస్టీ కింద 1.7 కోట్ల వ్యాపారులు నమోదు చేసుకోగా, వీరిలో 18 లక్షల మంది కాంపోజిషన్‌ స్కీమ్‌ను ఎంచుకున్నారు. వీరు త్రైమాసికోసారి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన వారు ప్రతీ నెలా పన్ను చెల్లించాలి. పైగా కాంపోజిషన్‌ స్కీమ్‌ కింద ఉన్న వ్యాపారులు రికార్డులను నిర్వహించాల్సిన అవసరం ఉండదు.



You may be interested

మారుతి కార్లు ప్రియం

Friday 11th January 2019

న్యూఢిల్లీ: ముడివస్తువుల ధరలు పెరుగుతుండటం, విదేశీ మారకం రేట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు వంటి అంశాల నేపథ్యంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ కార్ల రేట్లను పెంచింది. వివిధ కార్ల మోడల్స్‌పై ఈ పెంపు రూ. 10,000 దాకా (ఢిల్లీ ఎక్స్‌ షోరూం) ఉంటుందని, ఇది తక్షణమే అమల్లోకి వచ్చిందని కంపెనీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు అన్ని మోడల్స్ ధరలు పెరగ్గా.. ఇటీవలే ప్రవేశపెట్టిన ఎర్టిగా కొత్త వెర్షన్‌ని

డాలర్‌ పతనంతో పసిడి వెలుగులు

Friday 11th January 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం 6 డాలర్లు లాభపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత పసిడికి ర్యాలీకి తోడ్పాటు అందిస్తుంది.  ఆసియా మార్కెట్లో గురువారం ఉదయం గం.10:00ని.లకు ఔన్స్‌ పసిడి ధర 6డాలర్లు లాభపడి 1,293 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లను పెంచకపోవచ్చనే అంచనాలతో డాలర్‌ బలహీనపడింది. బలహీనపడి డాలర్‌,

Most from this category