STOCKS

News


నిద్రపుచ్చే కంపెనీ!

Saturday 2nd March 2019
news_main1551505523.png-24402

  • వేక్‌ఫిట్‌లో ఆర్థోపెడిక్‌ స్లీపింగ్‌ ఉత్పత్తులు
  • త్వరలో మార్కెట్లోకి టావెల్‌ పిల్లోస్, దుప్పట్లు, కుషన్స్‌
  • నెలకు రూ.9 కోట్ల వ్యాపారం; హైదరాబాద్‌ వాటా కోటి
  • సికోయా క్యాపిటల్‌ నుంచి రూ.65 కోట్లు నిధుల సమీకరణ 
  • ‘స్టార్టప్‌ డైరీ’తో కో–ఫౌండర్‌ చైతన్య రామలింగె గౌడ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:

‘నిద్ర పోవాలంటే.. ముందు మేల్కోవాలి’ ఇది ఓ పరుపుల తయారీ కంపెనీ ప్రకటన. మేల్కోవాల్సిన అవసరం లేదు.. నిద్రపుచ్చితే చాలు అంటోంది మ్యాట్రెస్‌ ఇన్నోవేషన్‌ స్టార్టప్‌ వేక్‌ఫిట్‌. వేక్‌ఫిట్‌ పరుపు మీద 6 గంటలు నిద్రపోతే చాలు! 8 గంటల గాఢ నిద్రతో సమానమంటోంది. కస్టమర్ల వయస్సు, లింగ భేదం, శరీరాకృతి, తత్వంలను బట్టి ఆర్థోపెడిక్‌ పరుపులను అభివృద్ధి చేయడం దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు కంపెనీ కో–ఫౌండర్‌ చైతన్య రామలింగె గౌడ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. 


ప్రస్తుతం మార్కెట్లో లభ్యమయ్యే ఏ మ్యాట్రెస్‌లనైనా తీసుకోండి.. తయారీ సంస్థ నుంచి కస్టమర్‌కు మధ్యలో డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, రిటైలర్‌ మూడు రకాల మధ్యవర్తులుంటారు. ప్రతి దశలో ఎవరి మార్జిన్స్‌ వారికుంటాయి. దీంతో ఉత్పత్తి అంతిమ ధర పెరుగుతుంది. కానీ, వేక్‌ఫిట్‌లో తయారీ కేంద్రం నుంచి నేరుగా కొనుగోలుదారునికి చేరుతాయి. దీంతో నాణ్యమైన ఉత్పత్తులతో పాటూ ధర కూడా తగ్గుతుంది. ఇదే లక్ష్యంగా 2016 మార్చిలో బెంగళూరు కేంద్రంగా రూ.15 లక్షల పెట్టుబడితో మరొక కో–ఫౌండర్‌ అంకిత్‌ జార్జ్‌తో కలిసి వేక్‌ఫిట్‌ ఇన్నోవేషన్‌ను ప్రారంభించాం.
వారం రోజుల్లో మరో 4 ఉత్పత్తులు..
ప్రస్తుతం వేక్‌ఫిట్‌లో పరుపులు, దిండ్లు, పరుపుల కవచాలు, బెడ్స్‌ ఉన్నాయి. వీటి ధరలు పరుపులు రూ.5 వేలు, దిండ్లు రూ.399, కవచాలు రూ.999, బెడ్‌ రూ.10 వేల నుంచి ఉన్నాయి. వచ్చే వారం మార్కెట్లోకి ట్రావెల్‌ దిండ్లు, దుప్పట్లు, కుర్చీ కుషన్స్, బ్లాంకెట్‌ ఉత్పత్తులను విడుదల చేయనున్నాం. ప్రస్తుతం నెలకు 9 వేల పరుపులను విక్రయిస్తున్నాం. వీటికి 20 ఏళ్ల వారంటీ ఉంటుంది. అన్ని ఉత్పత్తులు కలిపి నెలకు రూ.9 కోట్ల వరకు విక్రయిస్తున్నాం.


హైదరాబాద్‌ నుంచి రూ.కోటి
మా వ్యాపారంలో బెంగళూరు, ముంబై తర్వాత హైదరాబాద్‌ మూడో అతిపెద్ద మార్కెట్‌. ఇక్కడ నెలకు 800ల పరుపులను విక్రయిస్తున్నాం. కోటికి పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. గచ్చిబౌలి సమీపంలో ఒక గిడ్డంగి ఉంది. త్వరలోనే దీని సామర్థాన్ని విస్తరించనున్నాం. ఇటీవలే బెంగళూరులో ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించాం. త్వరలోనే హైదరాబాద్, ముంబై నగరాల్లో ఏర్పాటు చేయనున్నాం. 


ఉత్తరాదిలో 2 కొత్త గిడ్డంగులు..
ఇప్పటివరకు 3 లక్షల మంది మా ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఏడాదిలో 5 లక్షలకు చేరుకోవాలన్నది మా లక్ష్యం. మా మొత్తం కస్టమర్లలో 25 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ఉంటారు. ఆర్డర్‌ వచ్చిన 4–5 రోజుల్లో ఉత్పత్తులను డెలివరీ చేస్తాం. ముడి సరుకులను యూరప్, మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం బెంగళూరులో తయారీ కేంద్రం ఉంది. దీని సామర్థ్యం రోజుకు 500 పరుపులు. హైదరాబాద్, ముంబై, పుణె, బెంగళూరులో గిడ్డంగులున్నాయి. ఏడాదిలో ఉత్తరాది రాష్ట్రాల్లో 2 గిడ్డంగులను ఏర్పాటు చేస్తాం.


2020 నాటికి రూ.200 కోట్లు..
గత ఆర్ధిక సంవత్సరంలో రూ.27 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఇప్పుడు మార్చి ఫలితాల నాటికి రూ.80 కోట్లను అధిగమిస్తాం. 2020 నాటికి రూ.200 కోట్లకు చేరుకోవాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం మా సంస్థలో 160 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో ఈ సంఖ్యను 200లకు చేర్చుతాం. ఇటీవలే సికోయా క్యాపిటల్‌ 31.9 శాతం వాటాతో రూ.65 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇందులో 10–15 శాతం నిధులను ప్లాంట్‌ విస్తరణకు వినియోగిస్తామని’’ చైతన్య వివరించారు.



You may be interested

ఫేమ్‌-2కు సిద్ధమైన ట్రినిటీ క్లీన్‌టెక్‌

Saturday 2nd March 2019

2019-20లో రూ.200 కోట్ల పెట్టుబడి సామర్థ్యం పెంపునకు వినియోగం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- దేశంలో ఎలక్ట్రిక్‌, హైబ్రీడ్‌ వాహనాల వినియోగాన్ని అధికం చేసేందుకు రెండో విడత ఫేమ్ పథకానికి కేంద్రం రూ.10,000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో అయిదు లక్షల త్రిచక్ర వాహనాలకు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార అవకాశాలను అందుకోవడానికి హైదరాబాద్‌ కంపెనీ ట్రినిటీ క్లీన్‌టెక్‌ సిద్ధమైంది. ఉత్పత్తి సామర్థ్యం పెంపు, వాహనాల తయారీకై 2019-20లో రూ.200 కోట్ల పెట్టుబడి

నాల్కో రూ.4.50 మధ్యంతర డివిడెండ్‌

Saturday 2nd March 2019

న్యూఢిల్లీ: వాటాదారులకు ప్రతీ షేరు (రూ.5 ముఖ విలువ)పై ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.4.50 మధ్యంతర డివిడెండ్‌గా ఇవ్వాలని నాల్కో కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోపే అర్హులైన వాటాదారులకు డివిడెండ్‌ పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. డివిడెండ్‌ ఇచ్చేందుకు రికార్డు డేట్‌గా ఈ నెల 12వ తేదీని ఖరారు చేసింది. అంటే ఆ తేదీ నాటికి కంపెనీ రికార్డుల్లో వాటాదారులుగా పేరు నమోదైన వారికే డివిడెండ్‌ పంపిణీ జరుగుతుంది.

Most from this category