News


స్టార్టప్స్‌కు గుజరాత్‌ బెస్ట్‌

Friday 21st December 2018
news_main1545368405.png-23122

న్యూఢిల్లీ: కొత్త ఎంటర్‌ప్రెన్యూర్లు స్టార్టప్స్‌ స్థాపించుకునేందుకు కావలిసిన వసతుల కల్పనలో గుజరాత్‌ నెంబర్‌వన్‌గా నిలిచింది. ఆయా రాష్ట్రాల్లో స్టార్టప్‌ల ఏర్పాటుకున్న సానుకూల పరిస్థితులపై డీఐపీపీ (పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక శాఖ) పరిశీలన జరిపి ర్యాకింగ్స్‌ ఇచ్చింది. స్టార్టప్‌ పాలసీ, ఇంక్యుబేషన్‌ హబ్స్‌, ఇన్నోవేషన్స్‌, నియంత్రణా సవాళ్లు, ప్రొక్యూర్‌మెంట్‌, కమ్యూనికేషన్స్‌ తదితర విభాగాలకు సంబంధించి 27 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలను పరిశీలించారు. పరిశీలన అనంతరం అత్యున్నతం, ఉన్నతం, అగ్రగామి, కాబోయే అగ్రగామి, వర్ధమాన రాష్ట్రం, ఆరంభకులు పేరిట రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చారు. అన్ని విభాగాల్లో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్‌ బెస్ట్‌ పెర్ఫామర్‌గా నిలిచింది. కర్నాటక, కేరళ, ఒడిషా, రాజస్థాన్‌ టాప్‌ పెర్ఫామర్స్‌గా, ఏపీ, తెలంగాణ, బీహార్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ లీడర్లుగా, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, యూపీ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు యాస్పైరింగ్‌ లీడర్లుగా, అసోమ్‌, ఢిల్లీ, గోవాతో పాటు 8 రాష్ట్రాలు ఎమర్జింగ్‌ స్టేట్స్‌గా, చండీగఢ్‌, మణిపూర్‌, మిజోరం, నాగాలాండ్‌, పుదుచ్చేరి, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు బిగినర్స్‌గా నిలిచాయి. 
ఈ తరహా ర్యాంకింగ్‌లు రాష్ట్రాల్లో స్టార్టప్స్‌కు కావాల్సిన సానుకూలవాతావరణం ఏర్పడేందుకు తోడ్పడతాయని డీఐపీపీ సెక్రటరీ రమేశ్‌ అభిషేక్‌ చెప్పారు. ఏ రాష్ట్రాన్ని తక్కువ చేయడానికి ఈ ప్రక్రియ చేపట్టలేదని, కేవలం ప్రోత్సహించడానికే ర్యాంకింగ్‌లిచ్చామని వివరించారు. విధానపరమైన మద్దతు, ఇంక్యుబేషన్‌ కేంద్రాలు, సీడ్‌ ఫండింగ్‌, ఏంజిల్‌, వెంచర్‌ ఫండింగ్‌, సరళమైన నియంత్రణలతో పాటు వివిధ అంశాలను పరిశీలించి ర్యాంకులను రూపొందించామన్నారు. ఆన్‌లైన్‌ సమాచార కల్పన, నియంత్రణలను సరళీకరించడం, పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌కు ప్రాధానమివ్వడం తదితర అంశాలపై రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. 

పన్ను మినహాయింపులు ఆటోమేటిగ్గా రావు
ఏంజెల్ ట్యాక్స్‌పై స్టార్టప్‌లలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కేంద్రం దీనిపై వివరణ ఇచ్చింది. వీటి నుంచి మినహాయింపు పొందాలంటే ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంతర్‌-మంత్రిత్వ శాఖల బోర్డు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కార్యదర్శి రమేష్ అభిషేక్ గురువారం తెలిపారు. ఏంజెల్ ట్యాక్స్ అంశాన్ని రెవెన్యూ విభాగం దృష్టికి కూడా తీసుకెడుతున్నట్లు ఆయన చెప్పారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 56 కింద ఏంజెల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పన్నులు విధించడంపై పలు స్టార్టప్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్‌ను నిరోధించడానికి ఈ సెక్షన్‌ను ఉద్దేశించామని, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్‌కు దీన్నుంచి మినహాయింపు ఉంటుందని అభిషేక్ చెప్పారు. దీని ప్రయోజనాలు పొందాలంటే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ‘‘డీఐపీపీలో నమోదు చేసుకున్నంత మాత్రాన స్టార్టప్‌లకు పన్ను మినహాయింపులు ఆటోమేటిక్‌గా లభించవు. వీటికోసం ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంలో సమస్యాత్మకమైన అంశాలను స్టార్టప్‌లు మాకు తెలియజేస్తే .. వాటిని సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళతాం’’ అని రమేష్‌ వివరించారు. మరోవైపు, ఏంజెల్ ట్యాక్స్‌ నోటీసులపై ఐటీ పరిశ్రమ దిగ్గజం క్రిస్ గోపాలకృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎంట్రప్రెన్యూర్ వ్యవస్థ మొత్తం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. ‘‘స్టార్టప్‌ విలువను కచ్చితంగా లెక్కకట్టే విధానమేదీ లేదు. పరిశ్రమ వర్గాల అభిప్రాయాలను పరిగణించి, ఏంజెల్ ట్యాక్స్ నోటీసులను ప్రభుత్వం ఉపసంహరిస్తుందేమో చూడాలి’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. 
కొత్త ఈ-కామర్స్ విధానంపై కసరత్తు..
శరవేగంగా వృద్ధి చెందుతున్న దేశీ ఆన్‌లైన్ రిటైల్ రంగానికి ఊతమిచ్చే దిశగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ కొత్త ఈ-కామర్స్ విధానంపై కసరత్తు చేస్తున్నట్లు రమేష్ తెలిపారు. ముసాయిదా ఈ-కామర్స్ విధానంలోని కొన్ని ప్రతిపాదనలపై పరిశ్రమవర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ-కామర్స్ రంగ వృద్ధికి ఉద్దేశించిన ముసాయిదాలో పలు ప్రతిపాదనలు ఉన్నాయి. వీటి ప్రకారం.. భద్రత, ప్రైవసీ అంశాల దృష్ట్యా ఆన్‌లైన్ రిటైల్ సంస్థలు తమ యూజర్ల డేటాను భారత్‌లోనే భద్రపర్చాల్సి ఉంటుంది. అలాగే, ఆన్‌లైన్ రిటైలర్‌ గ్రూప్‌నకు చెందిన ఏ కంపెనీ కూడా సదరు పోర్టల్‌లో మిగతా విక్రేతలపై ప్రతికూల ప్రభావాలు చూపేటువంటి డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించరాదు. You may be interested

బీమా జేవీలో బీఓఐ వాటా విక్రయం!

Friday 21st December 2018

ముంబై: బీమా రంగ జాయింట్‌ వెంచర్‌లో తన వాటాను విక్రయించి రూ. 1000 నుంచి రూ.1200 కోట్లు సమీకరించాలని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భావిస్తున్నట్లు తెలిసింది. 2009లో దైచీ బీమా కంపెనీ, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒక బీమా రంగ జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. స్టార్‌ యూనియన్‌ దైచీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పేరిట ఏర్పాటైన ఈ జేవీలో దైచీకి 45.94 శాతం,

ఓఎన్‌జీసీ బైబ్యాక్‌ @ రూ.4,022 కోట్లు

Friday 21st December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ కంపెనీ రూ.4,022 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌కు కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఓఎన్‌జీసీ వెల్లడించిది. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా 1.97 శాతం వాటాకు సమానమైన 25.29 కోట్ల షేర్లను, ఒక్కో షేర్‌ను రూ.159కు కొనుగోలు చేస్తామని  పేర్కొంది. ఓఎన్‌జీసీలో కేంద్ర ప్రభుత్వానికి 65.64 శాతం వాటా ఉండటంతో ఓఎన్‌జీసీ షేర్ల బైబ్యాక్‌ కారణంగా ప్రభుత్వానికి రూ.2,640 కోట్ల

Most from this category