News


కొన్ని ప్రధాన కంపెనీల క్యూ4 ఫలితాలు

Friday 17th May 2019
Markets_main1558077390.png-25797

  • పెన్నార్‌  విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

హైదరాబాద్‌: పెన్నార్‌ ఇండస్ట్రీస్‌లో పెన్నార్‌అనుబంధ కంపెనీల విలీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం లభించింది. పెన్నార్‌ ఇంజినీర్డ్‌ బిల్డింగ్‌ సిస్టమ్స్‌(పెబ్స్‌), పెన్నార్‌ ఎన్విరో లిమిటెడ్‌లు పెన్నార్‌ ఇండస్ట్రీస్‌లో విలీనమవుతాయి. విలీన స్కీమ్‌ ప్రకారం, ప్రతి 13 పెబ్స్‌ షేర్లకు 23 పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లభిస్తాయి. అలాగే ప్రతి ఒక్క పెన్నార్‌ ఎన్విరో షేర్‌కు ఒక పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ లభిస్తుంది. విలీన స్కీమ్‌కు అప్పాయింటెడ్‌ డేట్‌ను గత ఏడాది ఏప్రిల్‌ 1గా ఎన్‌సీఎల్‌టీ ఆమోదించింది. వాటాదారులకు కొత్త షేర్లు రావడానికి 2-3 నెలల సమయం పడుతుందని అంచనా. విలీనం కారణంగా వ్యయాలు కలసివస్తాయని, నిధుల వినియోగం మెరుగుపడుతుందని కంపెనీ వైస్‌-ప్రెసిడెంట్‌ (కార్పొరేట్‌ స్ట్రాటజీ) కె.ఎమ్‌. సునీల్‌ పేర్కొన్నారు. త్వరలో రికార్డ్‌ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు. 

  • జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లాభం 79 శాతం డౌన్‌

న్యూఢిల్లీ: జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం (2018-19) మార్చి క్వార్టర్‌లో 79 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.159 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.34 కోట్లకు తగ్గిందని జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. ముడి పదార్ధాల ధరలు పెరగడం, వ్యయాలు కూడా అధికం కావడంతో నికర లాభం ఈ స్థాయిలో క్షీణించిందని కంపెనీ సీఎమ్‌డీ రఘుపతి సింఘానియా తెలిపారు. ఆదాయం రూ.2,284 కోట్ల నుంచి రూ.2,706 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.  ఒక్కో ఈక్విటీ షేర్‌కు 75 పైసలు డివిడెండ్‌ను ఇవ్వనున్నామని వెల్లడించారు.
ఏడాది లాభం రూ.171 కోట్లు..
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.63 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.171 కోట్లకు పెరిగిందని సింఘానియా పేర్కొన్నారు. ఆదాయం రూ.8,397 కోట్ల నుంచి రూ.10,370 కోట్లకు చేరిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు రూ.10,000 కోట్ల మైలురాయిని అధిగమించాయని  క్యూ4లో నికర లాభం తగ్గినా, నిర్వహణ మార్జిన్‌ 35 శాతం పెరిగిందని వివరించారు.

  • జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ఆదాయం రూ.2,018 కోట్లు

- ఒక్కో షేర్‌కు రూ. 1 డివిడెండ్‌
- ఆగస్టు 13న 25వ ఏజీఎమ్‌

న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.6 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.480 కోట్ల నికర నష్టాలు వచ్చినట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ పేర్కొంది.  ఇక మొత్తం ఆదాయం రూ.1,879 కోట్ల నుంచి రూ.2,018 కోట్లకు పెరిగింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1 డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ ఏడాది ఆగస్టు 13న 25వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్‌) జరపనున్నామని వెల్లడించింది. 
ఏడాది లాభం రూ.684 కోట్లు...
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.85 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.684 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.8,514 కోట్ల నుంచి రూ.9,506 కోట్లకు పెరిగింది. 
ఎలక్ట్రిక్‌ వాహన వ్యాపారానికి బై...
ఎలక్ట్రిక్‌ వాహన వ్యాపారంలో కొనసాగకూడదని నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ వ్యాపారంలో అనిశ్చిత పరిస్థితులు అంచనాల కంటే అధికంగా ఉన్నాయని, అందుకే ఈ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నామని వెల్లడించింది. విద్యుత్తు, సంబంధిత వ్యాపారాలకు సౌకర్యవంతంగా మూలధనం సమకూరేలా చూస్తామని పేర్కొంది. అదనపు, పూర్తి కాలపు డైరెక్టర్‌గా శరద్‌ మహేంద్రను నియమించామని, ఆయన ఐదేళ్లపాటు పదవిలో ఉంటారని వివరించింది.



You may be interested

ఈ స్టాకులు మార్కెట్‌ కదలికలకు అతీతం!

Friday 17th May 2019

మార్కెట్లో వస్తున్న తీవ్ర ఆటుపోట్లకు అతీతంగా ముందుకే దూసుకుపోతున్న కొన్ని స్టాకులను అనలిస్టులు గుర్తించారు. ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రతినెలా ఈ స్టాకులు అప్‌మూవ్‌నే చూపుతున్నాయి. ఇలా మార్కెట్‌ పరిస్థితులతో సంబంధం లేకుండా ర్యాలీ జరుపుతున్న చిన్న స్టాకుల్లో ఎస్‌ఆర్‌ఎఫ్‌, డీసీబీ బ్యాంక్‌, ఇండో రమా సింథటిక్స్‌, లీడింగ్‌ లీజింగ్‌ ఫైనాన్స్‌, ఎస్సార్‌, సహయోగ్‌ మల్టిబేస్‌, జంప్‌నెట్‌వర్క్‌, ప్రభాత్‌ టెక్నాలజీస్‌, కావిట్‌ ఇండస్ట్రీస్‌, ఫ్రెడన్‌ ఫార్మా, ఆర్‌ఏసీఎల్‌ గేర్‌టెక్‌,

పెన్నార్‌ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

Friday 17th May 2019

హైదరాబాద్‌: పెన్నార్‌ ఇండస్ట్రీస్‌లో పెన్నార్‌అనుబంధ కంపెనీల విలీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం లభించింది. పెన్నార్‌ ఇంజినీర్డ్‌ బిల్డింగ్‌ సిస్టమ్స్‌(పెబ్స్‌), పెన్నార్‌ ఎన్విరో లిమిటెడ్‌లు పెన్నార్‌ ఇండస్ట్రీస్‌లో విలీనమవుతాయి. విలీన స్కీమ్‌ ప్రకారం, ప్రతి 13 పెబ్స్‌ షేర్లకు 23 పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లభిస్తాయి. అలాగే ప్రతి ఒక్క పెన్నార్‌ ఎన్విరో షేర్‌కు ఒక పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ లభిస్తుంది. విలీన స్కీమ్‌కు అప్పాయింటెడ్‌ డేట్‌ను గత

Most from this category