STOCKS

News


నిప్పన్‌ చేతికి ఆర్‌నామ్‌... ఇన్వెస్టర్లకు లాభమేనా?

Friday 7th June 2019
personal-finance_main1559931900.png-26166

రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ (రిలయన్స్‌మ్యూచువల్‌ ఫండ్స్‌)లో నియంత్రిత వాటాను రిలయన్స్‌ క్యాపిటల్‌ నుంచి జపాన్‌కు చెందిన నిప్పన్‌ లైఫ్‌ కొనుగోలు చేయబోతోంది. మరి ఆర్‌నామ్‌ మ్యూచువల్‌ ఫం‍డ్స్‌ ఇన్వెస్టర్లకు, కంపెనీ వాటాదారులకు లాభదాయకమేనా...? ఈ ప్రశ్నకు నిపుణుల అభిప్రాయాలను తెలుసుకుందాం...

 

రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఆర్‌నామ్‌) ఆస్తుల పరంగా దేశంలోనే ఐదో అతిపెద్ద మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ. ఈ సంస్థ నిర్వహణలో ఇన్వెస్టర్లకు సంబంధించి రూ.2,25,418 కోట్ల పెట్టుబడులు ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి ఉన్నాయి. సంస్థ నియంత్రణ మారుతుండడం అటు ఆర్‌నామ్‌ పథకాల్లో పెట్టుబడులు పెట్టిన వారితోపాటు, ఆర్‌నామ్‌ కంపెనీ వాటాదారులపైనా ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. అయితే, గతంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ (ఏఎంసీ) నుంచి ఓ వ్యాపార భాగస్వామి తప్పుకున్న సందర్భాలున్నాయి. కానీ, అది ఫండ్స్‌ పనితీరును ప్రభావితం చేయలేదు. ముఖ్యంగా రెలిగేర్‌ ఇన్వెస్కో మ్యూచువల్‌ ఫండ్‌ను ఇన్వెస్కో కొనుగోలు చేయడం... మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల ఇన్వెస్టర్లకు మంచే చేసింది. నిపుణులైన ఉద్యోగులు కొనసాగడంతో, పథకాల పనితీరు అంతకుముందు మాదిరే కొనసాగింది. డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ విషయంలోనూ ఇదే చూశాం. 

 

ఇక ఆర్‌నామ్‌లో రిలయన్స్‌ క్యాపిటల్‌, నిప్పన్‌ లైఫ్‌ భాగస్వాములు. వీటిల్లో రిలయన్స్‌ క్యాపిటల్‌ పూర్తిగా తప్పుకుంటోంది. నిప్పన్‌ లైఫ్‌ చేతికి వెళుతుండడంతో ప్రస్తుత ఫండ్‌ మేనేజర్లు, రీసెర్చ్‌ టీమ్‌లను మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. వీరు కొనసాగితే పథకాల పనితీరుపై ప్రభావం పడదని, ఇంతకముందు మాదిరే వాటి స్వరూప స్వభావాలు కొనసాగుతాయని రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఏఎంసీ సీఈవో సుదీప్‌ సిక్కా స్పష్టం చేశారు. పైగా బలమైన ఆర్థిక వనరులు కలిగిన నిప్పన్‌ లైఫ్‌ చేతికి వెళ్లడం వల్ల కంపెనీ భారీగా ప్రయోజనం పొందగలదన్నారు. నిప్పన్‌ లైఫ్‌ ప్రపంచవ్యాప్తంగా రూ.49 లక్షల కోట్ల ఆస్తుల నిర్వహణతో ఫార్చ్యూన్‌ 500 కంపెనీగా ఉంది. 2007-2011 కాలంలో ఆర్‌నామ్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ పరంగా నంబర్‌-1 స్థానంలో కొనసాగింది. కానీ, పోటీ సంస్థలు కొనుగోళ్లతో ఆర్‌నామ్‌ను దాటుకుని వెళ్లిపోయాయి.  

 

‘‘మంచి అనుభవం కలిగిన పెట్టుబడుల బృందాలు ఉండి, పనితీరు పరంగా మంచి ట్రాక్‌ రికార్డు ఉండి, ఇన్వెస్టర్ల అనుసరణ కలిగిన సంస్థ... స్పాన్సర్‌ మారినప్పటికీ, మెరుగైన స్థానంలోనే కొనసాగుతుంది’’ అని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. ఆర్‌నామ్‌కు సంబంధించిన పెట్టుబడుల టీమ్‌ బలమైనదిగా పేర్కొన్నారు. కంపెనీ యాజమాన్యం మారినంత మాత్రాన పథకాల పనితీరు ప్రభావితం కాబోదన్నారు. ఆర్‌నామ్‌కు సంబంధించి రిలయన్స్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌, రిలయన్స్‌ ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌, రిలయన్స్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్‌ పథకాలు టాప్‌-3గా ఉన్నాయి. ఇవి వార్షికంగా 11.40 శాతం, 12.76 శాతం, 13.51 శాతం చొప్పున ఆరంభం నుంచి రాబడులను ఇవ్వడం గమనార్హం. ‘‘యాజమాన్యం మారడం కారణంగా ఫండ్‌ మేనేజర్లు తప్పుకుంటే లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ టీమ్‌ను మారిస్తే అది ఆందోళన కలిగించేది అవుతుంది. అది ఫండ్స్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపుతుంది. అయితే, అవే బృందాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియలు కొనసాగితే పథకాలపై ప్రభావం ఉండకపోవచ్చు’’ అని హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. 

 

ఆన్‌నామ్‌లో ఎఫ్‌పీఐలకు 3 శాతం వాటా ఉంది. ఈ షేరు 2017 నవంబర్‌లో స్టాక్‌ మార్కెట్లో రూ.294 వద్ద లిస్ట్‌ అయింది. ప్రస్తుత ధర రూ.219.55. వాటాదారుల పరంగా చూస్తే యాజమాన్య నియంత్రణ మారడం అన్నది అడాగ్‌ స్టాక్స్‌ బలహీనత ప్రభావం నుంచి రక్షణ వచ్చినట్టేనని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన ఉన్నతోద్యోగి వీకే శర్మ అభిప్రాయపడ్డారు. ‘‘పెరుగుతున్న భారతీయుల పొదుపు నుంచి, ఈటీఎఫ్‌లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల వారిలో ఆసక్తి నుంచి ఆర్‌నామ్‌ ప్రయోజనం పొందే మంచి స్థితిలో ఉంది. ఏఎంసీల నిర్వహణలోని ఆస్తులు రానున్న ఐదేళ్లలో రెట్టింపు కానున్నాయి. ఇది వాటాదారులకు మంచి రాబడులను తెచ్చిపెడుతుంది’’ అని శర్మ తెలిపారు.



You may be interested

‘టెక్‌’ రూట్లో సహకార బ్యాంకులు!

Saturday 8th June 2019

పెరుగుతున్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవల వాడకం టెక్నాలజీ లేకుంటే మెరుగైన సేవలు చాలా కష్టం దీనికితోడు తగ్గుతున్న ఐటీ ఇన్‌ఫ్రా వ్యయాలు సొంత ఐటీ విభాగం లేకున్నా... ఔట్‌సోర్సింగ్‌తో వీలు ఎస్‌వీసీ, కాస్మోస్‌ తదితర బ్యాంకుల ముందంజ కాకపోతే సవాళ్లూ ఉన్నాయంటున్న నిపుణులు న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంలో టెక్నాలజీ వినియోగం విస్తృతంగా పెరుగుతుండటంతో పట్టణ ప్రాంత సహకార బ్యాంకులు (యూసీబీ) కూడా డిజిటల్‌ బాట పడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, హైస్పీడ్‌ కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ వంటివి

స్మాల్‌క్యాప్స్‌ హవా...: రిలయన్స్‌ సెక్యూరిటీస్‌

Friday 7th June 2019

వచ్చే ఏడాది, రెండేళ్ల కాలంలో మిడ్‌క్యాప్‌, లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే స్మాల్‌క్యాప్‌ అద్భుత పనితీరు చూపిస్తాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ నవీన్‌ కులకర్ణి తెలిపారు. మార్కెట్లలో అస్థిరతలు తగ్గుముఖం పడుతున్నాయని, ఇది స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌కు చాలా మంచిదన్నారు. ద్రవ్య లభ్యత సవాళ్లను పరిష్కరించడం కీలకమైన ప్రాధాన్య అంశంగా నవీన్‌ పేర్కొన్నారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం దీన్ని పరిష్కరించగలవన్నారు. అతిపెద్ద సంస్కరణలు అన్నవి పెద్ద సవాలుగా అభివర్ణించారు.    భూముల సమీకరణ, కార్మిక సంస్కరణలు లేదా

Most from this category