STOCKS

News


కొంటే ఈ నెల్లోనే...! జనవరిలో ధరలు భారీగా పెంపు

Wednesday 5th December 2018
news_main1544033859.png-22673

వచ్చే వేసవిలో చల్లదనం కోసం ఏసీ కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉందా...? అయితే, కాస్త ముందుగా, ఈ నెలలోనే కొనుగోలు చేసుకుంటే ఆర్థికంగా కలిసొస్తుంది. ఎందుకంటే కంపెనీలు 10 శాతం వరకు ధరల పెంపును జనవరి నుంచి అమలు చేయబోతున్నాయి. ధరల పెంపు ఒక్క ఏసీలకే కాదు... టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు వంటి వైట్‌గూడ్స్‌ అన్నింటి ధరలు పెరగబోతున్నాయి. వీటి ధరలు 7-10 శాతం మధ్యలో పెరుగుతాయని, ఏసీలలపై పెంపు ఎక్కువగా ఉంటుందని పరిశ్రమ వర్గాల ఆధారంగా తెలుస్తోంది. గత వేసవిలో ఏసీల అమ్మకాలు ఆశాజనకంగా లేకపోవడం, అమ్ముడుపోని స్టాక్‌ ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పటి వరకు ధరలను పెంచలేకపోయాయని, జనవరి నుంచి గణనీయంగా పెంచొచ్చన్నది పరిశ్రమ వర్గాల అంచనా. 

 

తయారీ వ్యయాలు పెరగడం వల్లే

కంపెనీలకు తయారీ వ్యయాలు పెరిగిపోవడమే ధరల పెంపు నిర్ణయాలకు కారణం. డాలర్‌తో రూపాయి మారకం విలువ గత ఏడాది కాలంలో క్షీణించడం, ప్రభుత్వం దిగుమతులపై సుంకాలు పెంచడం, చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండడంతో ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. కన్జ్యూమర్‌ డ్యురబుల్‌ ఉత్పత్తుల కంపెనీలకు మొత్తం వ్యయాల్లో 15 శాతం వరకు రవాణా రూపంలోనే ఉంటుంది. చమురు ధరలు పెరిగితే ఉత్పత్తుల రవాణాకు ఇవి వెచ్చించే వ్యయాలు కూడా సహజంగానే పెరుగుతాయి. ‘‘ఈ ఏడాది చివరి వరకు ప్రస్తుత ధరలనే కొనసాగిస్తాం. జనవరి 1 నుంచి మాత్రం తక్కువ రేట్లకు ఉత్పత్తులను ఆఫర్‌ చేసే అవకాశం లేదు’’ అని ఓ ప్రముఖ కంపెనీ తెలియజేయడం గమనార్హం.  

 

సుంకాల భారం

10కిలోల వరకు సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్లు, ఏసీలపై కస్టమ్స్‌ సుంకాన్ని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో నిర్ణయం తీసుకుంది. రిఫ్రిజిరేటర్లు, ఏసీల్లో వినియోగించే కంప్రెషర్లపైనా సుంకాన్ని పెంచింది. ఆ సమయంలో పండుగలు ఉండడంతో అధిక అమ్మకాల ఆశతో కంపెనీలు ధరల పెంపును అమలు చేయకుండా ఓపిక పట్టాయి. దీపావళి వరకు ఆగి, ఆ తర్వాత ధరలను పెంచాలనుకున్నామని, పండుగల విక్రయాలు ఆశించినమేర లేకపోవడంతో ధరల పెంపును జనవరికి వాయిదా వేసుకున్నట్టు మరో కంపెనీ చీఫ్‌ తెలిపారు.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 100 పాయింట్లు పతనం

Thursday 6th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:51 సమయంలో 105 పాయింట్ల నష్టంతో 10,728 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,827 పాయింట్లతో పోలిస్తే 100 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

వ్యాలెట్‌లో మోసాలకు ఇకపై మీది కాదు బాధ్యత?

Wednesday 5th December 2018

ఆర్‌బీఐ ఓ మంచి నిర్ణయం తీసుకుంది. అనధికారిక ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల్లో (ఖాతాదారుని ప్రమేయం లేకుండా జరిగేవి) సైబర్‌ దాడి, హ్యాకింగ్‌ వంటి చర్యల వల్ల ఖాతాదారులు మోసపోతే అందుకు వారికి ఉండే బాధ్యత పరిమితం. వెంటనే బ్యాంకుకు సమాచారం ఇచ్చినట్టయితే అస్సలు బాధ్యత లేనట్టే. ఇకపై ప్రీపెయిడ్‌ సాధనాలు (పీపీఐ) అయిన అమేజాన్‌ పే, పేటీఎం, మొబిక్విక్‌, ఫ్రీచార్జ్‌, ఆక్సిజెన్‌ వంటి వ్యాలెట్లకు కూడా ఇదే అమలు కానుంది.

Most from this category