STOCKS

News


పార్లమెంట్‌లో ‘‘బిజినెస్‌’’

Saturday 29th December 2018
news_main1546057754.png-23308

ఆర్‌బీఐ పనితీరుపై అసంతృప్తి లేదు: జైట్లీ
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పనితీరు పట్ల అసంతృప్తి లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ విషయం చెప్పారు. ‘‘ఇటీవలి కాలంలో ఆర్‌బీఐ పర్యవేక్షణ, నియంత్రణ గణనీయంగా మెరుగుపడింది. పటిష్టమయ్యింది’’ అంటూ ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఇచ్చిన ఒక నివేదికను కూడా ఆర్థికమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్‌బీఐ నియంత్రణలో ఉన్న రూ.9 లక్షల కోట్లకు పైగా నిధుల్లో భారీ మొత్తాన్ని ప్రభుత్వం కోరుతోందని, దిద్దుబాటు చర్యల చట్రంలో ఉన్న 11 బ్యాంకుల్లో కొన్నింటిపై నియంత్రణలు ఎత్తివేయాలని ఒత్తిడితెస్తోందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ నెలారంభంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయటం తెలిసిందే. కొత్త గవర్నర్‌గా శక్తికాంతదాస్‌ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో జైట్లీ తాజా సమాధానమిచ్చారు.

ఎన్‌పీఏలకు 6,000 మంది అధికారులు కారణం
2017-18 ఆర్థిక సంవత్సరంలో మొండిబకాయిలకు (ఎన్‌పీఏ) 6,049 మంది ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు కారణమని జైట్లీ లోక్‌సభకు తెలిపారు. తీవ్రతను అనుసరించి తప్పు చేసిన అధికారులపై తగిన జరిమానాలు విధించినట్లు చెప్పారు. ఉద్యోగం నుంచి తొలగించటం, తప్పనిసరి పదవీ విరమణ, హోదా తగ్గింపు వంటి చర్యలు ఇందులో ఉన్నాయన్నారు. 2017-18లో  పీఎన్‌బీ, కెనరాబ్యాంక్‌సహా 19 జాతీయ బ్యాంకుల నికరనష్టం రూ.6,861 కోట్లు. అయితే 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఈ నష్టం రూ. 21,388 కోట్లు. కాగా మంత్రి శుక్లా ఈ అంశంపై ఒక ప్రకటన చేస్తూ, అన్ని వాణిజ్య బ్యాంకుల ఎన్‌పీఏలు 2016 మార్చి నాటికి రూ.5.66 లక్షల కోట్లయితే, 2018 నాటికి ఈ మొత్తం రూ.9.62 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు.

993 కోట్ల విలువైన ఆస్తులు ‘ఐటీ’ జప్తు
ఆదాయపు పన్ను శాఖ 2017-18 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 992.5 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.  లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంతో ఆర్థికశాఖ సహాయమంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా ఈ విషయాన్ని తెలిపారు. ఈ సమయంలో 582 ఐటీ దాడులు జరిగినట్లు వివరించారు. లెక్క చెప్పని, వెల్లడించని పలు ఖాతాలు, ఆస్తులు ఈ జప్తుల్లో ఉన్నట్లు మంత్రి తెలిపారు. 2016-17లో 1,152 ఐటీ దాడుల్లో జరిగిన జప్తు ఆస్తుల విలువ రూ.1,469.62 కోట్లని మంత్రి పేర్కొన్నారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోందని మంత్రి ఈ సందర్భంగా  పేర్కొన్నారు.  

రూ.38,896 కోట్ల జీఎస్‌టీ ఎగవేతలను గుర్తించాం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ మధ్య రూ.38,896 కోట్ల వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఎగవేతలను గుర్తించినట్లు మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా తెలిపారు. 6,585 కేసుల విషయంలో ఈ ఎగవేతలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. కాగా 398 కేసుల్లో ఎక్సైజ్‌ సుంకం ఎగవేతలు రూ.3,029 కేసులని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. సేవల పన్నుకు సంబంధించి 3,922 కేసుల్లో రూ.26,108 కోట్ల ఎగవేతలను అధికారులు గుర్తించినట్లు పార్లమెంటుకు తెలిపారు. 12,711 కేసుల్లో కస్టమ్స్‌ సుంకం ఎగవేతల విలువ రూ.6,966 కోట్లని మంత్రి పేర్కొన్నారు.

జీడీపీలో  పన్నుల నిష్పత్తి పెరుగుతోంది
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రత్యక్ష పన్నుల నిష్పత్తి క్రమంగా పెరుగుతోంది. మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా లోక్‌సభలో ఈ విషయాన్ని తెలిపారు. 2015-16జీడీపీలో ప్రత్యక్ష పన్నుల నిష్పత్తి 5.47 శాతం ఉంటే, 2016-17లో 5.57 శాతానికి పెరిగిందని తెలిపారు. 2017-18లో ఇది 5.98 శాతానికి ఎగిసింది. ఇక పరోక్ష పన్నుల విషయంలో ఈ నిష్పత్తి వరుసగా 5.16 శాతం, 5.65 శాతం, 5.43 శాతంగా నమోదయ్యాయి.  2018-19 జీడీపీలో పరోక్ష పన్నుల  నిష్పత్తి 5.96 శాతానికి చేరాలన్నది లక్ష్యం. కేంద్రం తీసుకుంటున్న పలు చర్యలు జీడీపీలో పన్నుల నిష్పత్తి పెరగడానికి కారణమని మంత్రి తెలిపారు.

‘59 మినిట్స్‌’ కింద లక్ష దరఖాస్తులు ఆమోదం
లఘు, చిన్న, మధ్య  తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రుణాలకు సంబంధించి ‘59 మినిట్స్‌’ పథకం కింద 1.12 లక్షలకుపైగా రుణ దరఖాస్తులకు ఆమోదముద్ర వేసినట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి శివ్‌ప్రతాప్‌ శుక్లా తెలిపారు. ఈ దరఖాస్తుల కింద కోరిన రుణ మొత్తం విలువ రూ.37,412 కోట్లని లోక్‌సభలో మంత్రి తెలిపారు. అయితే 40,669 అప్లికేషన్ల విషయంలో రూ.14,088 కోట్లు మంజూరయినట్లూ మంత్రి తెలిపారు. ఎంఎస్‌ఎంఈల రుణ అవసరాలకు నవంబర్‌లో ప్రత్యేకంగా కేంద్రం స్కీమ్‌ను ఆవిష్కరించింది. 'psbloansin59minutes.com'  పోర్టల్‌ ద్వారా కేవలం 59 నిముషాల్లో జీఎస్‌టీ రిజిస్టర్డ్‌ ఎంఎస్‌ఎంఈలు కోటి రూపాయల వరకూ రుణం పొందే అవకాశం ఉండడం ఈ పథకం ప్రత్యేకత.You may be interested

1280డాలర్ల పైన పసిడి ముగింపు

Saturday 29th December 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధర 6నెలల తర్వాత మొదటిసారి 1280డాలర్లపై ముగిసింది. ప్రపంచ ఆర్థిక మందగమన ఆందోళనలు, అమెరికా మార్కెట్ల ఒడిదుడుకుల ట్రేడింగ్‌, డాలర్‌ ఇండెక్స్‌ వారం రోజుల కనిష్టానికి పతనం... తదితర అంశాలు పసిడికి అండగా నిలిచాయి. ఒకానొకదశలో పసిడి ధర శుక్రవారం రాత్రి 1,284.55 డాలర్ల వద్ద తాజాగా ఆరునెలల గరిష్టాన్ని అందుకుంది. చివరకు రాత్రి అమెరికా మార్కెట్లో 2.20 డాలర్ల లాభంతో 1,283.30డాలర్ల వద్ద ముగిసింది. ఈ

ఎన్‌బీఎఫ్‌సీలకు మరింత ఊరట

Saturday 29th December 2018

-సింగిల్‌ బారోవర్‌ లిమిట్‌ పొడిగింపు  మరో మూడు నెలలు వరకూ ముంబై: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) ఊరటనిచ్చే నిర్ణయాన్ని ఆర్‌బీఐ తీసుకుంది. సింగిల్‌ బారోవర్‌ లిమిట్‌ ఫెసిలిటీని మరో మూడు నెలలు పొడిగించింది. దీంతో లిక్విడిటీ సమస్యలతో సతమతమవుతున్న ఎన్‌బీఎఫ్‌సీలకు మరింత వెసులుబాటు చిక్కుతుంది. బ్యాంక్‌లు ఎన్‌బీఎఫ్‌సీలకు ఇచ్చే సింగిల్‌ బారోవర్‌ లిమిట్‌ ఫెసిలిటీని ఈ ఏడాది అక్టోబర్‌లో  ఆర్‌బీఐ 10 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీనిని

Most from this category