STOCKS

News


బీఎస్‌ఎన్‌ఎల్ ఇంటర్నెట్ టెలిఫోనీ సేవలు

Wednesday 11th July 2018
news_main1531328372.png-18225

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశీయంగా తొలి ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసును ఆవిష్కరించింది. మొబైల్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఏ టెలిఫోన్ నంబరుకైనా కాల్ చేసే సదుపాయం దీనితో అందుబాటులోకి రానుంది. జులై 25 నుంచి ఈ సర్వీసులు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన మొబైల్ యాప్ 'వింగ్స్‌'ను కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా బుధవారం ఆవిష్కరించారు. "ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో కూడా బీఎస్‌ఎన్‌ఎల్ మార్కెట్ వాటాను పెంచుకోగలగడం ప్రశంసనీయం. సిమ్ అవసరం లేకుండా ఫోన్‌ కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించే ఇంటర్నెట్ టెలిఫోనీని అందుబాటులోకి తెచ్చినందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ను అభినందిస్తున్నా" అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. దేశీ సేవల కోసం వార్షికంగా రూ. 1,099 ఫీజును చెల్లించి, వై-ఫై లేదా ఇతరత్రా ఏ టెలికం ఆపరేటరు ఇంటర్నెట్ సర్వీస్‌నైనా ఉపయోగించుకుని దేశవ్యాప్తంగా ఏ టెలిఫోన్ నంబరుకైనా ఈ యాప్ ద్వారా అపరిమితమైన కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కూడా మొబైల్ యాప్స్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునే వీలున్నప్పటికీ, సదరు యాప్‌ను ఉపయోగిస్తున్న వారికి మాత్రమే చేసే అవకాశం ఉంది. 
త్వరలో రిజిస్ట్రేషన్స్ ప్రారంభం..
మరికొద్ది రోజుల్లో రిజిస్ట్రేషన్స్‌ ప్రారంభిస్తామని, జూలై 25 నుంచి అధికారికంగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. "వింగ్స్ యాప్‌ను ఉపయోగించి కస్టమర్లు.. భారత్‌లోని నంబర్లకు విదేశాల నుంచి కూడా కాల్ చేయొచ్చు. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈ యాప్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. కాల్స్ చేసుకోవచ్చు. దేశీయంగా అన్‌లిమిటెడ్ కాల్స్ కోసం వార్షికంగా రూ. 1,099 ఫీజు ఉంటుంది" అని ఆయన చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్ జారీ చేసే మొబైల్ నంబరుకు ఈ యాప్ అనుసంధానమై ఉంటుందని తెలిపారు. 

ఐడియా-వొడాఫోన్‌ విలీనానికి ఆమోదం..
ప్రైవేట్ టెలికం దిగ్గజాలు ఐడియా సెల్యులార్‌, వొడాఫోన్ ఇండియా విలీన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని మనోజ్ సిన్హా చెప్పారు. అయితే, రెండు కంపెనీలూ ఇంకా కొన్ని లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉందని, ఆ తర్వాత తుది ఆమోదముద్ర లభిస్తుందని వివరించారు. డీల్‌కు పూర్తి స్థాయిలో అనుమతులివ్వాలంటే వొడాఫోన్ ఇండియాకు చెందిన స్పెక్ట్రం కోసం ఐడియా రూ. 3,976 కోట్లు కట్టాలని, ఇరు సంస్థలు రూ. 3,342 కోట్ల మేర బ్యా్ంకు గ్యారంటీ ఇవ్వాలని టెలికం శాఖ షరతులు విధించిన సంగతి తెలిసిందే. కానీ ఐడియా, వొడాఫోన్ వీటిని కోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఐడియా, వొడాఫోన్‌ల విలీనమైతే దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల నికర విలువ, 35 శాతం మార్కెట్ వాటా, 43 కోట్ల యూజర్లతో దేశీయంగా అతి పెద్ద టెలికం సంస్థ ఆవిర్భవించనుంది.
 



You may be interested

కన్నాట్‌ ప్లేస్‌ అత్యంత ఖరీదు

Wednesday 11th July 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్లో మన దేశం నుంచి రెండు నగరాలకు చోటు దక్కాయి. ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ 9వ స్థానంలో నిలవగా.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్‌ (బీకేసీ) 26వ స్థానంలో నిలిచాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెనీ సంస్థ సీబీఆర్‌ఈ నివేదిక తెలిపింది. ప్రైమ్‌ ఆఫీస్‌ మార్కెట్‌ వృద్ధికి ప్రధాన కారణంగా సాంకేతికత, ఆర్ధిక వృద్ధి, ఈ–కామర్స్‌ రంగం అభివృద్దేనని సీబీఆర్‌ఈ ఇండియా అండ్‌

ఎన్‌సీడీల ద్వారా రూ.700 కోట్లు సమీకరిస్తాం

Wednesday 11th July 2018

న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ, శోభ లిమిటెడ్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.700 కోట్లు సమీకరించనున్నది.  రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ల అమలు కోసం అవసరమయ్యే నిధులను  నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్లు(ఎన్‌సీడీ)లను ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన జారీ చేసి సమీకరించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల 7న నిర్వహించే ఏజీఎమ్‌(వార్షిక సాధారణ సమావేశం)లో వాటాదారుల ఆమోదం పొందుతామని కంపెనీ తెలిపింది. కాగా ప్రస్తుత ఏడాది తొలి మూడు నెలల కాలంలో

Most from this category