STOCKS

News


జెట్‌కు బ్యాంకుల బాసట

Thursday 21st March 2019
news_main1553161137.png-24727

- సంస్థను నిలబెట్టేందుకు ప్రణాళికలు
- మేనేజ్‌మెంట్ మార్పు యోచన
- ఆర్థిక మంత్రి జైట్లీతో ఎస్‌బీఐ చీఫ్ కుమార్‌ భేటీ

న్యూఢిల్లీ: భారీ రుణభారంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ విమానయాన దిగ్గజం జెట్ ఎయిర్‌వేస్‌ కుప్పకూలకుండా చూసేందుకు బ్యాంకర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మేనేజ్‌మెంట్ మార్పు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్‌, పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా, ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన సందర్భంగా ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత మేనేజ్‌మెంట్‌తో కంపెనీ నిర్వహణ సాధ్యపడే అవకాశాలు లేనందున.. జెట్ ఎయిర్‌వేస్‌ను పునరుద్ధరించేందుకు బ్యాంకులు రూపొందించిన ప్రణాళికలో యాజమాన్య మార్పు ప్రతిపాదన ఉండొచ్చని వివరించారు. 
దివాలా కోడ్ పరిష్కారం కాదు..
జెట్ ఎయిర్‌వేస్‌ పరిస్థితుల గురించి ప్రభుత్వానికి వివరించేందుకే జైట్లీతో భేటీ అయినట్లు సమావేశం అనంతరం రజనీష్ కుమార్ చెప్పారు. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికపై బ్యాంకులు గత అయిదు నెలలుగా కసరత్తు చేస్తున్నాయని, ఇది దాదాపు సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. సర్వీసుల రంగంలో ఉన్న జెట్ లాంటి కంపెనీ నుంచి బకాయిలు రాబట్టుకునేందుకు దివాలా కోడ్‌ను తక్షణం ప్రయోగించడం పరిష్కారం కాదని, ఇది ఆఖరు అస్త్రం మాత్రమే కాగలదని కుమార్ చెప్పారు. "ఐబీసీని ప్రయోగించడమంటే కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడమే. అయితే, ఇంకా పరిస్థితి చేయి దాటిపోలేదనే మేం భావిస్తున్నాం. కాబట్టి జెట్ ఎయిర్‌వేస్‌ను నిలబెట్టేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. వీటిని.. ఒక వ్యక్తినో లేదా ప్రమోటరునో కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా భావించనక్కర్లేదు. బ్యాంకుల, దేశ, ఏవియేషన్ రంగ ప్రయోజనాలను కాపాడేందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌ను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం" అని ఆయన పేర్కొన్నారు. అయితే పునరుద్ధరణ ప్రణాళిక గురించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. జెట్‌ ఎయిర్‌వేస్‌లో కొత్తగా మరో వాటాదారును తీసుకొస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ఆ అవకాశాలను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. సంస్థలో 24 శాతం వాటాలు ఉన్న ఎతిహాద్ ఎయిర్‌వేస్ వాటి విక్రయం కోసం ఎస్‌బీఐని సంప్రతించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌లో ప్రమోటరు నరేష్ గోయల్‌కు 51 శాతం వాటాలు ఉన్నాయి. 
    దాదాపు రూ. 8,200 కోట్ల పైచిలుకు రుణభారంతో కుంగుతున్న జెట్ ఎయిర్‌వేస్ ఇప్పటికే రుణదాతలకు చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి ఆఖరు నాటికి కంపెనీ రూ. 1,700 కోట్ల మేర చెల్లింపులు జరపాల్సి ఉంది. 119 విమానాలకు గాను.. ప్రస్తుతం కేవలం 41 ఎయిర్‌క్రాఫ్ట్స్‌ మాత్రమే నడుపుతోంది. జీతాలు బకాయిపడటంతో అటు ఉద్యోగులు కూడా ఆందోళనకు దిగబోతున్నారు. తక్షణం జీతాలు చెల్లించకపోతే ఏప్రిల్ 1 నుంచి విమానసేవలు నిలిపివేస్తామంటూ పైలట్ల యూనియన్ హెచ్చరించింది. కంపెనీ గానీ మూతబడితే దాదాపు 23,000 మంది ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన నెలకొంది. 



You may be interested

అమ్మకానికి రహదారి ప్రాజెక్టులు

Thursday 21st March 2019

- మూడేళ్లలో 52 ప్రాజెక్టుల విక్రయం - రూ. 37,019 కోట్ల విలువ - నిధుల కొరత తదితర సమస్యలే కారణం ముంబై: గత కొన్నాళ్లుగా పలు రహదారి ప్రాజెక్టులు అమ్మకానికి వస్తున్నాయి. నిధుల కొరత తదితర కారణాలతో ప్రమోటర్లు లేదా వాటి నిర్మాణం కోసం ఏర్పాటైన స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్‌పీవీ) వీటిని విక్రయిస్తున్నాయి. 2015-18 మధ్యకాలంలో ఏకంగా 52 రహదారి ప్రాజెక్టులను ప్రమోటర్లు విక్రయించారు. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక ప్రకారం

లాభాల్లో ఆసియా మార్కెట్లు... మిశ్రమంగా యూరప్‌ మార్కెట్లు

Thursday 21st March 2019

ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీరేట్లపై యథాతధ పాలసీ ప్రకటన నేపథ్యంలో గురువారం ఆసియాలో హాంకాంగ్‌ మినహా మిగిలిన మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అయితే అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనలు, అమెరికా - చైనా వాణిజ్య చర్చలు మార్కెట్ల లాభాల్ని పరిమితం చేస్తున్నాయి. అలాగే ప్రపంచమార్కెట్లో 4నెలల గరిష్టస్థాయి స్థాయిల నుంచి ముడిచమురుధరలు దిగిరావడం, డాలర్‌ ఇండెక్స్‌ పతనం తదితర అంశాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. అన్ని మార్కెట్లు అరశాతం లాభపడ్డా‍యి. అత్యధికంగా

Most from this category