STOCKS

News


జెట్ ఎయిర్‌వేస్‌లో సంక్షోభం

Wednesday 20th March 2019
news_main1553059160.png-24701

- వాటాలు విక్రయించనున్న ఎతిహాద్‌
- ఏప్రిల్‌ 1 నుంచి సేవలు నిలిపేస్తామంటున్న పైలట్లు
- గట్టెక్కించేందుకు రంగంలోకి కేంద్రం
- నిధులు సమకూర్చాలని బ్యాంకులకు సూచన

ముంబై:- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్‌ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితి మరింతగా దిగజారుతోంది. భాగస్వామ్య సంస్థ ఎతిహాద్‌ కూడా ఏదో ఒక ధరకు వాటాలు విక్రయించేసి తప్పుకునే ప్రయత్నాల్లో ఉంది. షేరు ఒక్కింటికి రూ. 150 చొప్పున జెట్‌లో తమకున్న 24 శాతం వాటాలను రూ. 400 కోట్లకు అమ్మేసేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు ఆఫర్‌ చేసినట్లు సమాచారం. దీని ప్రకారం చూస్తే జెట్‌ ఎయిర్‌వేస్‌ విలువ రూ. 1,800 కోట్లుగా ఉండనుంది. దీంతో పాటు .. జెట్‌ ప్రివిలెజ్‌ వ్యాపార విభాగంలో తనకున్న 50.1 శాతం వాటాలను కూడా ఎస్‌బీఐకి ఎతిహాద్‌ ఆఫర్‌ చేసింది. ఒకవేళ అదే జరిగితే.. ఇప్పటికే రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అవుతున్న జెట్‌ పరిస్థితి మరింత జటిలంగా మారనుంది. దాదాపు రూ. 8,200 కోట్ల మేర రుణభారంలో ఉన్న జెట్‌ ఈ నెలాఖరు కల్లా రూ. 1,700 కోట్లు చెల్లించాల్సి ఉంది. భారీగా రుణభారంతో దివాలా తీసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ని జెట్‌ ఎయిర్‌వేస్ తలపిస్తుండటం గమనార్హం.

పైలట్లు, ఇంజినీర్ల హెచ్చరికలు...
మరోవైపు, జీతాల చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతుండటంతో పైలట్లు సైతం పోరు బాట పట్టనున్నారు. మార్చి 31లోగా పరిష్కార ప్రణాళికపై స్పష్టతనిచ్చి, తమ జీతాల బకాయీలను చెల్లించకపోతే ఏప్రిల్‌ 1 నుంచి విమాన సేవలు నిలిపివేస్తామంటూ పైలట్ల సంఘం నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ (ఎన్‌ఏజీ) హెచ్చరించింది. అటు, జెట్‌ విమానాల నిర్వహణ ఇంజినీర్ల సంఘం (జేఏఎంఈడబ్ల్యూఏ) కూడా తమ జీతాల విషయంలో జోక్యం చేసుకుని, బకాయిలు ఇప్పించాలంటూ డీజీసీఏకి ఈ–మెయిల్‌ పంపింది. మూడు నెలలుగా జీతాలు రాకపోతుండటంతో ఆర్థిక సమస్యలతో తమపై మానసికంగా ఒత్తిడి పెరిగిపోతోందని ఇంజినీర్లు పేర్కొన్నారు. ఇది మరింత తీవ్రమైతే ఫ్లయిట్‌ భద్రతకు ప్రమాదమని తెలిపారు. వందకు పైగా విమానాల నిర్వహణ కోసం జెట్‌ ఎయిర్‌వేస్‌లో సుమారు 560 మంది ఇంజినీర్లు ఉన్నారు. అటు మొత్తం 119 విమానాల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రస్తుతం 41 విమానాలతో దేశీయంగా 603, విదేశీ రూట్లలో 382 ఫ్లయిట్స్‌ నడుపుతోందని డీజీసీఏ పేర్కొంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గొచ్చని మంగళవారం జెట్‌ యాజమాన్యంతో సమావేశం అనంతరం డీజీసీఏ వర్గాలు తెలిపాయి. ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులను విధుల్లోకి పంపొద్దని జెట్‌కు సూచించినట్లు వివరించాయి. 

కేంద్రం సమీక్ష ...
ఈ పరిణామాల నేపథ్యంలో పరిస్థితి చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు నిధులు సమకూర్చి, దివాలా తీయకుండా చూడాలంటూ బ్యాంకులకు సూచించినట్లు సమాచారం. ఎన్నికల వేళ జెట్‌ ఎయిర్‌వేస్‌ గానీ దివాలా తీస్తే.. వేల మంది ఉద్యోగులు రోడ్డున పడటం శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాన వాటాదారులు (వ్యవస్థాపకుడు నరేష్‌ గోయల్, ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌) గానీ మరిన్ని వాటాలను తనఖా ఉంచిన పక్షంలో బ్యాంకులు మరికొంత మేర రుణాలిచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. గడిచిన ఏడాదికాలంగా జెట్‌ ఆర్థిక పరిస్థితి గురించి కేంద్ర ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు బ్యాంకుల నుంచి సమాచారం తెలుసుకుంటూనే ఉందని వివరించాయి.  జెట్‌లో నరేష్‌ గోయల్, ఆయన కుటుంబానికి 52 శాతం, ఎతిహాద్‌కు 24 శాతం వాటాలు ఉన్నాయి. రుణాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కొంత రుణాన్ని బ్యాంకులు ఈక్విటీ వాటాల కింద మార్చుకునే ప్రతిపాదనకు జెట్‌ బోర్డు గత నెల ఆమోదముద్ర వేసింది. దీంతో జెట్‌ ఎయిర్‌వేస్‌లో బ్యాంకులే అతిపెద్ద వాటాదారుగా మారనున్నాయి. 
    ఇక,  రుణభారం, ఆర్థిక సంక్షోభంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ పెద్ద స్థాయిలో ఫ్లయిట్స్‌ను రద్దు చేస్తుండటంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్‌ ప్రభు దృష్టి సారించారు. ఫ్లయిట్స్‌ రద్దు, అడ్వాన్స్‌ బుకింగ్స్, రీఫండ్స్, భద్రతాపరమైన అంశాలు మొదలైన వాటన్నింటినీ సమీక్షించేందుకు అత్యవసర సమావేశం నిర్వహించాలని పౌర విమానయాన శాఖ కార్యదర్శిని ఆదేశించారు. అలాగే డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నుంచి కూడా నివేదిక తీసుకోవాలని సూచించారు. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ఈ విషయాలు తెలిపారు. You may be interested

ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌పై ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌ కన్ను

Wednesday 20th March 2019

ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌పై ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌ కన్ను రూ.35వేల కోట్ల మార్కెట్లోకి త్వరలో రంగప్రవేశం ఇందుకు అనుగుణంగా ప్రణాళిక రూపకల్పన న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ దిగ్గజాలు అమేజాన్‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌ (వాల్‌మార్ట్‌)లు భారత ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్లో అవకాశాలపై కన్నేశాయి. రూ.35,000 కోట్ల విలువతో, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌లోని అవకాశాలను చేజిక్కించుకునేందుకు అవి సన్నద్ధం అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, గ్రోసరీలతో ఈ కామర్స్‌లో ఈ రెండు సంస్థలు

బుధవారం వార్తల్లో షేర్లు

Wednesday 20th March 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ముత్తూట్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌:- ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్ల విలువ సెక్యూరిటైజేషన్ లావాదేవీ ప్రక్రియను పూర్తి చేసినట్లు స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లు సమాచారం ఇచ్చింది. ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- బ్రిక్‌రేటింగ్‌ సంస్థ ఎన్‌సీడీలపై రేటింగ్‌ను పెంచింది. గతంలో తాము కేటాయించిన ఎఎ(నెగిటివ్‌) నుంచి ఎఎ(స్థిరత్వం)కు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఓఎన్‌జీసీ:- మార్చి 23వ తేది నుంచి షేరు మధ్యంతర డివిడెండ్‌ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు బోర్డు తెలిపింది.  కాక్స్‌&కింగ్స్‌:- హంగేరీలోని

Most from this category