STOCKS

News


బంధన్ చేతికి గృహ్‌ ఫైనాన్స్‌

Tuesday 8th January 2019
news_main1546939611.png-23465

- షేర్ల మార్పిడి రూపంలో విలీనం
- విలీన సంస్థ విలువ సుమారు రూ. 83,000 కోట్లు
- డీల్ జనవరి 1 నుంచి వర్తింపు 

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ తాజాగా గృహ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు  ప్రకటించింది. షేర్ల మార్పిడి రూపంలో ఈ విలీన ఒప్పందం ఉండనుంది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి జనవరి 1 నుంచి ఇది వర్తించనుంది.  ఇరు సంస్థల బోర్డులు సోమవారం ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేశాయి. రెండు పక్షాలకు ఇది ప్రయోజనకరమైన ఒప్పందంగా హెచ్‌డీఎఫ్‌సీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ వ్యాఖ్యానించారు. పెద్ద ఎత్తున కార్యకలాపాలు విస్తరించేందుకు గృహ్‌ ఫైనాన్స్‌కి, మరింత వైవిధ్యమైన సెక్యూర్డ్‌ రుణాల పోర్ట్‌ఫోలియో దక్కడం ద్వారా బంధన్‌ బ్యాంక్‌కు ఇది లాభించగలదన్నారు. విలీన సంస్థలో 15 శాతం దాకా వాటాలను అట్టే పెట్టుకునేందుకు అనుమతించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ను కోరతామని, అనుమతి లభించని పక్షంలో నిబంధనల ప్రకారం 10 శాతం లోపునకు తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు వృద్ధి ప్రణాళికల్లో భాగంగా డైవర్సిఫికేషన్‌పై దృష్టి పెట్టినట్లు, ఇందులో భాగంగానే గృహ్‌ ఫైనాన్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు బంధన్‌ బ్యాంక్‌ సీఈవో చంద్ర శేఖర్‌ ఘోష్‌ తెలిపారు. విలీనానంతరం బంధన్‌ బ్యాంక్‌ పోర్ట్‌ఫోలియోలో అన్‌సెక్యూర్డ్‌ రుణాల వాటా 86 శాతం నుంచి 50 శాతానికి తగ్గుతుందన్నారు. 

షేర్ల మార్పిడి ఇలా..
డీల్‌ ప్రకారం..  గృహ్‌ ఫైనాన్స్‌ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 1,000 షేర్లకు గాను బంధన్‌ బ్యాంక్‌కి చెందిన 568 షేర్లు లభిస్తాయి. ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా ప్రమోటర్‌ హోల్డింగ్‌ను తగ్గించుకోవడానికి, అలాగే హౌసింగ్‌ ఫైనాన్స్‌ పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించుకోవడానికి బంధన్‌ బ్యాంక్‌కు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. విలీన సంస్థ విలువ సుమారు రూ. 83,000 కోట్లుగా ఉంటుంది. బంధన్ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 59,800 కోట్లుగా ఉండగా, గృహ్ ఫైనాన్స్ విలువ రు. 23,224 కోట్లుగా ఉంది. 

గృహ్‌ ఫైనాన్స్‌..
అల్పాదాయ వర్గాలకు గృహ రుణాలు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో 1986లో ఆగా ఖాన్‌ ఫౌండేషన్, హెచ్‌డీఎఫ్‌సీ కలిసి గృహ్‌ ఫైనాన్స్‌ ఏర్పాటు చేశాయి. సెప్టెంబర్‌ క్వార్టర్‌ గణాంకాల ప్రకారం.. గృహ్‌ ఫైనాన్స్‌ దాదాపు రూ. 2,738 కోట్ల రుణాలు ఇచ్చింది. మొత్తం లోన్‌ బుక్‌ పరిమాణం రూ. 16,663 కోట్లుగా ఉంది. ప్రధానంగా రిటైల్‌ విభాగంపై దృష్టి పెడుతున్న గృహ్‌ ఫైనాన్స్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రూ. 220 కోట్ల నికర లాభం ఆర్జించింది. 

బంధన్‌ బ్యాంక్‌..
బంధన్‌ బ్యాంక్‌కు.. 938 శాఖలు, 30,431 మంది ఉద్యోగులు ఉన్నారు. మొత్తం డిపాజిట్లు రూ. 33,869 కోట్లు, ఇచ్చిన రుణాలు రూ. 33,373 కోట్లుగా ఉన్నాయి. బంధన్‌ బ్యాంక్‌ ప్రధానంగా తూర్పు భారతదేశ రాష్ట్రాల్లోని గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. రుణాల పోర్ట్‌ఫోలియోలో ఎక్కువగా మైక్రోఫైనాన్స్‌ లోన్సే ఉన్నాయి. అటు గృహ్‌ ఫైనాన్స్‌ పశ్చిమాది రాష్ట్రాల్లో .. గృహ రుణాల కేటగిరీలో కార్యకలాపాలు సాగిస్తోంది. 

తగ్గనున్న బంధన్‌ హోల్డింగ్స్‌ వాటాలు ..
ప్రస్తుతం బంధన్‌ బ్యాంక్‌లో మాతృ సంస్థ బంధన్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌కు (బీఎఫ్‌హెచ్‌ఎల్‌) 82.28 శాతం వాటాలు ఉన్నాయి. అటు గృహ్‌ ఫైనాన్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీకి 57.83 శాతం వాటాలు ఉన్నాయి. విలీనానంతరం బంధన్‌ బ్యాంక్‌లో బంధన్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ వాటా 60.27 శాతానికి తగ్గుతుంది. అటు హెచ్‌డీఎఫ్‌సీకి 15 శాతం వాటాలు దక్కుతాయి. ఆ తర్వాత కొన్ని వాటాలను పబ్లిక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు లేదా సెకండరీ మార్కెట్లలో విక్రయించడం ద్వారా దీన్ని క్రమంగా పది శాతం లోపునకు తగ్గించుకుంటుంది. ఆర్‌బీఐ బ్యాంకింగ్‌ లైసెన్స్‌ నిబంధనల ప్రకారం.. కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్ల వ్యవధిలో బంధన్‌ బ్యాంక్‌లో బీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తన వాటాలు 82.3 శాతం నుంచి 40 శాతానికి తగ్గించుకోవాలి. కానీ అది జరగకపోవడంతో గతేడాది సెప్టెంబర్‌లో బంధన్‌ బ్యాంక్‌ కార్యకలాపాల విస్తరణ, సీఈవో చంద్ర శేఖర్‌ ఘోష్‌ జీతభత్యాలపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించినప్పటికీ ఇటీవల సడలించింది. తాజా డీల్‌ పూర్తయినా బంధన్‌ బ్యాంక్‌లో బీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వాటా 60.27 శాతం స్థాయికి మాత్రమే తగ్గుతుంది. ఇది ఆర్‌బీఐ నిర్దేశిత 40 శాతం కన్నా ఎక్కువే కావడంతో.. వాటాలను మరింత తగ్గించుకోవడానికి బీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉండనుంది. ఇక, అటు హెచ్‌డీఎఫ్‌సీకి విలీన బ్యాంకులో ప్రమోటరు హోదా లభిస్తుంది. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీకి.. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 19.72 శాతం వాటాలు ఉన్నాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ఒక బ్యాంకులో ప్రమోటరుగా ఉన్న సంస్థ మరో బ్యాంకులో ప్రమోటరుగా 10 శాతానికి మించి వాటాలు ఉండకూడదు దీంతో విలీన సంస్థలో ప్రారంభ దశలో 15.44 శాతం వాటాలు ఉన్నప్పటికీ.. హెచ్‌డీఎఫ్‌సీ కూడా క్రమంగా దీన్ని పది శాతం లోపునకు తగ్గించుకోవాల్సి రానుంది. 


 



You may be interested

వృద్ధి రేటు 7.2 శాతం

Tuesday 8th January 2019

- వ్యవసాయం, తయారీ పరిశ్రమల దన్ను - 2018-19పై సీఎస్‌ఓ అంచనాలు - ఆర్‌బీఐ అంచనాలకన్నా తక్కువ న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2018-19) వ్యవసాయం, తయారీ రంగాలు వెన్నుదన్నుగా నిలవనున్నాయని కేం‍ద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) పేర్కొంది. దీనితో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదుకానున్నట్లు అంచనావేసింది. 2017-18లో ఈ రేటు 6.7 శాతం​ కావడం గమనార్హం. సీఎస్‌ఓ సోమవారం విడుదల చేసిన జీడీపీ

ఐటీ క్యు3 ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Tuesday 8th January 2019

దేశీయ ఐటీ కంపెనీల క్యు3 ఫలితాల సీజన్‌ ఈ వారం ఆరంభం కానుంది. మూడో త్రైమాసికంలో ఐటీ కంపెనీలు మంచి ఫలితాలనే చూపవచ్చని, అయితే యూఎస్‌ వ్యాపారంలో కనిపిస్తున్న మందకొడితనం ఐటీ కంపెనీల గైడెన్స్‌పై ఉండొచ్చని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు యూఎస్‌ వ్యాపారం అప్‌మూవ్‌లో ఉండడం, బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో స్థిర వృద్ధి, రూపీ పతనం.. క్యు3లో ఐటీ కంపెనీలకు కలిసివస్తాయని భావిస్తున్నాయి. క్యు3లో ఐటీ కంపెనీల

Most from this category