STOCKS

News


బంధన్‌ బ్యాంక్‌ లాభం 10శాతం అప్‌

Friday 11th January 2019
Markets_main1547186348.png-23528

  • ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ప్రభావం ఈ బ్యాంక్‌పై కూడా
  • 10.3 శాతానికి చేరిన నికర వడ్డీ మార్జిన్‌
  • పెరిగిన స్థూల మొండి బకాయిలు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని బంధన్‌ బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 10 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.300 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.331 కోట్లకు ఎగసిందని బంధన్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ బ్యాంక్‌ నికర లాభంపై కూడా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ రుణ భారం ప్రభావం చూపించింది. ఈ సంస్థకు ఇచ్చిన రుణాలకు ఈ బ్యాంక్‌ పూర్తిగా కేటాయింపులు జరపాల్సి వచ్చింది. ఈ కేటాయింపులు లేకపోతే, నికర లాభం మరింతగా పెరిగి ఉండేది. కాగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఏ మాత్రం రుణాలిచ్చిందనేది ఈ బ్యాంక్‌ వెల్లడించలేదు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణాల పుణ్యమాని ఈ  బ్యాంక్‌ మొండి బకాయిలు భారీగా పెరిగాయి.
54 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం....
గత క్యూ3లో రూ. 1,336 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో  41 శాతం వృద్ధితో రూ.1,884 కోట్లకు ఎగసిందని బ్యాంక్‌ ఎమ్‌డీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌  చంద్ర శేఖర్‌ ఘోష్‌ తెలిపారు. రుణాలు 46 శాతం వృద్ధి చెంది రూ.35,599 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. రుణ వృద్ధి జోరుగా ఉండటం, మార్జిన్లు పటిష్టంగా(10.5 శాతం) ఉండటంతో నికర వడ్డీ ఆదాయం 54 శాతం ఎగసి  రూ.1,124 కోట్లకు పెరిగిందని తెలిపారు.  ఇతర ఆదాయం 48 శాతం పెరిగి రూ.234 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నిర్వహణ లాభం రూ.574 కోట్ల నుంచి 57 శాతం పెరిగి రూ.900 కోట్లకు చేరిందని తెలిపారు. గత క్యూ3లో 9.9 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్‌ ఈ క్యూ3లో 10.3 శాతానికి పెరిగిందని వివరించారు.
తగ్గిన రుణనాణ్యత...
ఇన్ని సానుకూలాంశాలున్నా  ఈ బ్యాంక్‌ రుణ నాణ్యత తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో 1.29 శాతంగా ఉన్న స్థూల మొండిబకాయిల నిష్పత్తి ఈ క్యూ3లో 2.41 శాతానికి పెరిగింది. అలాగే  నికర మొండి బకాయిలు 0.69 శాతం నుంచి 0.70 శాతానికి పెరిగాయి. ఈ క్యూ2లో రూ.124 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.474 కోట్లకు పెరిగాయని ఘోష్‌ పేర్కొన్నారు.  ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీకి ఇచ్చిన రుణాల కోసం రూ.385 కోట్ల మేర  కేటాయింపులు జరిపామని వెల్లడించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌  కేటాయింపులు లేకపోతే మొత్తం కేటాయింపులు రూ.90 కోట్లుగానే ఉండేవని వివరించారు. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌నకు చెందిన గృహ్‌ ఫైనాన్స్‌ కంపెనీని కొనుగోలు చేయడానికి ఈ బ్యాంక్‌  ఇటీవలనే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ దీర్ఘకాలంలో ప్రయోజనం కలిగిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.



You may be interested

వ్యవసాయంలో ఎగుమతులపై దృష్టి

Friday 11th January 2019

న్యూఢిల్లీ: వ్యవసాయ ఎగుమతుల పురోగతిపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ దిశలో రాష్ట్రాలకు రవాణా సబ్బిడీని అందించాలని యోచిస్తోంది. వాణిజ్య శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు గురువారం ఈ విషయం తెలిపారు. అంతకుముందు వాణిజ్యం అభివృద్ధి వ్యవహారాల మండలి సమావేశం జరిగింది. కర్ణాటక, పంజాబ్‌, తమిళనాడుసహా పలు రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.   వ్యవసాయ ఎగుమతుల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశం చర్చించినట్లు ప్రభు తెలిపారు. ఎగుమతిదారులు

టీసీఎస్‌ రికార్డు లాభాలు

Friday 11th January 2019

ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌) బంపర్‌ లాభాలతో క్యూ3 సీజన్‌కు బోణీ కొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో లాభం 24.1 శాతం ఎగిసి రూ. 8,105 కోట్లకు పెరిగింది. ఒక త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 8,000 కోట్ల మైలురాయి దాటడం ఇదే ప్రథమం. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో నికర లాభం రూ.6,531 కోట్లు. మరోవైపు, ఆదాయం కూడా 20.8

Most from this category