News


జనవరి నుంచి ఏపీ ఆర్‌వోసీ

Friday 28th December 2018
news_main1545971587.png-23277

- విజయవాడలో తాత్కాలిక కార్యాలయం
- తొలి ఆర్‌వోసీగా డెన్నింగ్‌ కె బాబు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌ రిజిష్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ) ప్రారంభం కానుంది. ఏపీ తొలి ఆర్‌వోసీగా డెన్నింగ్‌ కె బాబు, అసిస్టెంట్‌ ఆర్‌వోసీగా ఎల్‌.సాయి శంకర్‌లను నియమిస్తూ కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) జీవోను విడుదల చేసింది. అమరావతిలో సొంత భవనం నిర్మించే వరకూ విజయవాడలోని సూర్యారావుపేటలో తాత్కాలిక భవనాన్ని కేటాయించారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోని కంపెనీల పర్యవేక్షణ, నిర్వహణ సేవలను హైదరాబాద్‌ ఆర్‌వోసీనే నిర్వహిస్తోంది.
ఏపీ కంపెనీల పర్యవేక్షణ సులువు..
ఏపీలో ఆర్‌వోసీ కార్యాలయం ఏర్పాటు ద్వారా 13 జిల్లాల్లో కంపెనీల ఏర్పాటు, పర్యవేక్షణతో పాటు షేర్‌హోల్డర్ల ఫిర్యాదుల పరిష్కారం, నిర్వహణ సేవలు సులభతరమవుతాయని డెన్నింగ్‌ కె బాబు చెప్పారు. రాష్ట్రంలో సులభతర వాణిజ్య అవకాశాలు మెరుగుపడి త్వరితగతిన పారిశ్రామికాభివృద్ధి జరిగి రాష్ట్రం పురోగమిస్తుందన్నారు. 2011 ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీసెస్‌ (ఐసీఎల్‌ఎస్‌) బ్యాచ్‌కు చెందిన డెన్నింగ్‌ కె బాబు.. గతంలో తమిళనాడు అసిస్టెంట్‌ అఫీషియల్‌ లిక్విడేటర్‌గా, హైదరాబాద్‌ అసిస్టెంట్‌ ఆర్‌వోసీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ అసిస్టెంట్‌ ఆర్‌వోసీగా నియమితులైన సాయి శంకర్‌ లండ.. 2015 ఐసీఎల్‌ఎస్‌ బ్యాచ్‌ అధికారి. తెలుగు రాష్ట్రాల నుంచి ఐసీఎల్‌ఎస్‌కు ఎంపికైన తొలి వ్యక్తి ఈయన. గతంలో ఢిల్లీ అసిస్టెంట్‌ అఫీషియల్‌ లిక్విడేటర్‌గా, హైదరాబాద్‌ రీజియన్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఏపీలో 29,735 కంపెనీలు..
ఎంసీఏ రికార్డుల ప్రకారం డిసెంబర్‌ 2018 నాటికి ఏపీలో 29,735 కంపెనీలు నమోదయ్యాయి. ఇందులో 18,436 కంపెనీలు యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిల్లో 143 లిస్టెడ్‌ కంపెనీలు కాగా. 9,594 కంపెనీలు స్ట్రయిక్‌ ఆఫ్‌లో ఉన్నాయి. మరో 1,705 కంపెనీలు స్ట్రయిక్‌ ఆఫ్‌ ప్రాసెస్‌లో ఉన్నాయి. ఏపీలో గత మూడు నెలల్లో ప్రతి నెలా సగటున వెయ్యి కంపెనీలు నమోదవుతున్నాయి. సెప్టెంబర్‌లో 1,186 కంపెనీలు, అక్టోబర్‌లో 1,002, నవంబర్‌లో 858 కంపెనీలు నమోదయ్యాయి.



You may be interested

సవాళ్లున్నాయి... అధిగమిద్దాం!

Friday 28th December 2018

 టాటా గ్రూపు ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ లేఖ - 7 లక్షల మంది ఉద్యోగులకు న్యూఇయర్‌ సందేశం - గ్రూపు పునర్‌వ్యవస్థీకరణ, సరళీకరణ ప్రస్తావన - 2018లో బ్యాలన్స్‌ షీట్లను బలోపేతం చేసినట్లు వెల్లడి న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల ముందు రాజకీయ అనిశ్చితి సహా, 2019లో ఎన్నో స్థూల ఆర్థిక సవాళ్లు ఎదురు కానున్నాయని టాటా సన్స్‌ (టాటా గ్రూపు మాతృ కంపెనీ) చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ చెప్పారు. సమస్యలను అధిగమించడంపై దృష్టి సారించాలని టాటా గ్రూపు ఉద్యోగులకు

కట్టుతప్పిన ద్రవ్యలోటు

Friday 28th December 2018

2018-19 బడ్జెట్‌ లక్ష్యం రూ.6.24 లక్షల కోట్లు  నవంబర్‌ నాటికే రూ.7.16 లక్షల కోట్లకు చేరిక లక్ష్యానికన్నా 15 శాతం పెరుగుదల న్యూఢిల్లీ: భారత్‌ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కట్టుతప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రారంభమై మార్చి 2019తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ నెలకు వచ్చేసరికే ద్రవ్యలోటు బడ్జెట్‌ నిర్దేశాలను దాటిపోయింది. బడ్జెట్‌ లక్ష్యంలో​ 115 శాతాన్ని తాకింది. వివరాల్లోకి వెళితే... - ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో

Most from this category