STOCKS

News


అమెజాన్‌ ఫ్యూచర్‌ షాపింగ్‌

Wednesday 7th November 2018
news_main1541575471.png-21764

 - ఫ్యూచర్‌ రిటైల్‌లో 9.5 శాతం వాటా కొనుగోలు?
- త్వరలో డీల్‌; దీనికోసం రూ.2,500 కోట్ల వ్యయం
- ఆన్‌లైన్‌ గ్రోసరీ మార్కెట్లో దూసుకెళ్లడమే లక్ష్యం...
- ఇప్పటికే ‘మోర్‌’ కోనుగోలుతో దూకుడు...

న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ‘షాపింగ్‌’లో దూకుడు పెంచుతోంది. ఆన్‌లైన్‌ గ్రోసరీ (కిరాణా, ఆహారోత్పత్తులు ఇతరత్రా) మార్కెట్లో మరింత మార్కెట్‌ను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బిగ్‌బజార్‌, నీల్‌గిరీస్‌ బ్రాండ్‌లతో సూపర్‌మార్కెట్‌లను నిర్వహిస్తున్న ఫ్యూచర్‌ రిటైల్‌లో అమెజాన్‌ పాగా వేసేందుకు సిద్ధమైంది. 9.5 శాతం మైనారిటీ వాటాను అమెజాన్‌ కోనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఫ్యూచర్‌ రిటైల్‌ ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఫ్యూచర్‌ రిటైల్‌ విలువ దాదాపు రూ.25వేల కోట్లు. 9.5 శాతం వాటా కోసం అమెజాన్‌ కొంచెం అటూఇటుగా రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలియవచ్చింది. ఫ్యూచర్‌ రిటైల్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,100కు పైగా స్టోర్లు ఉన్నాయి. చర్చలు పూర్తయ్యాయని, కొద్ది రోజుల్లోనే ఒప్పందం కుదుతుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్‌ (ఎఫ్‌పీఐ) మార్గంలో అమెజాన్‌ ఈ 9.5 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఫ్యూచర్‌ రిటైల్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తర్వాత బహుశా ఈ నెల 14న డీల్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి’ అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఇటు ఫ్యూచర్‌ రిటైల్‌, అటు అమెజాన్‌ ఈ వార్తలపై నేరుగా స్పందించలేదు.
జనవరిలో బీజం...
కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌లో ఫ్యూచర్‌ రిటైల్‌ ప్రధానమైన కంపెనీ. ఇది రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం హెరిటేజ్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌లో 3.65 శాతం వాటా కూడా ఉంది. ఈ ఏడాది జనవరిలోనే ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా తీసుకోవాలని అమెజాన్‌ భావించింది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ను కిశోర్‌ బియానీ స్వయంగా సీటెల్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో కలిశారు కూడా. తర్వాత ఇరు కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు పలుమార్లు సమావేశమై చర్చలు జరిపారు. ప్రస్తుతం మల్టీబ్రాండ్‌ రిటైల్‌లో 49 శాతం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) భారత్‌ అనుమతిస్తోంది. దీంతో అమెజాన్‌ ఎఫ్‌పీఐ మార్గంలో దేశీ కంపెనీల భాగస్వామ్యంతో పెట్టుబడులకు మొగ్గుచూపుతోంది. ఇప్పటికే షాపర్స్‌ స్టాప్‌లో 5 శాతం వాటాను అమెజాన్‌కు చెందిన విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ అనుబంధ సంస్థ ఎఫ్‌పీఐ మార్గంలోనే కొనుగోలు చేసింది. ఏదైనా భారతీయ కంపెనీలో విదేశీ సంస్థలు సింగిల్‌ కంపెనీ ద్వారా 10 శాతం వాటాను ఎఫ్‌పీఐ రూట్‌లో కొనుగోలు చేయొచ్చు. అదేవిధంగా భారతీయ కంపెనీలు 49 శాతం వరకూ వాటాను బహుళ ఎఫ్‌పీఐలకు విక్రయించుకునే అవకాశం ఉంది. ఇటీవలే ఆదిత్య బిర్లా రిటైల్‌ నుంచి  మోర్‌ సూపర్‌మార్కెట్లను సమారా క్యాపిటల్‌తో కలిసి అమెజాన్‌ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ వాటా కూడా అమెజాన్‌ ఎఫ్‌పీఐ రూట్లోనే కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ దాదాపు రూ.4,200 కోట్లు. ఇక్కడ సమారా క్యాపిటల్‌ 51 శాతం, అమెజాన్‌ 49 శాతం వాటాను దక్కించుకున్నప్పటికీ... సాంకేతికంగా చూస్తే మోర్‌పై పూర్తి నియంత్రణ అమెజాన్‌ చేతికి వచ్చింది.
ఆన్‌లైన్‌కు ఆఫ్‌లైన్‌ దన్ను...
మోర్‌ కొనుగోలు ద్వారా అమెజాన్‌కు దాదాపు 500కు పైగా సూపర్‌ మార్కెట్‌ స్టోర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్‌లో దూసుకెళ్తున్న అమెజాన్‌... ఆఫ్‌లైన్‌ను ఉపయోగించుకోవటానికి దీనిద్వారా మార్గం సుగమమయింది. ఫ్యూచర్‌ రిటైల్లో పెట్టుబడి కూడా ఇలాంటిదేనని రిటైల్‌ కన్సల్టెన్సీ సంస్థ వాజిర్‌ అడ్వయిజర్స్‌ వ్యవస్థాపకుడు హర్మిందర్‌ సాహ్ని వ్యాఖ్యానించారు. ఈ వాటా కొనుగోలు ద్వారా అమెజాన్‌కు ఫ్యూచర్‌ గ్రూప్‌ భారీ ఆఫ్‌లైన్‌ నెట్‌వర్క్‌, గిడ్డంగులు, సరఫరా వ్యవస్థ ఇతరత్రా సదుపాయాలన్నీ అందుబాటులోకి వస్తాయని.. దీంతో ఆన్‌లైన్‌ బిజినెస్‌లో మరింత దూసుకెళ్లేందుకు వీలవుతుందని ఆయన విశ్లేషించారు. అత్యంత భారీ మార్కెట్‌ ఉన్న భారత గ్రోసరీ, ఆహారోత్పత్తుల మార్కెట్‌లో దూసుకెళ్లాలంటే ఆఫ్‌లైన్‌ కూడా కీలకం కావడంవల్లే అమెజాన్‌ ఈ దిశగా అడుగుల వేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే అమెజాన్‌ ప్యాంట్రీ, అమెజాన్‌ నౌ ద్వారా ఆన్‌లైన్‌ ఫుడ్‌, గ్రోసరీల్లో అమెజాన్‌ ప్రవేశించింది. భారత్‌లో 5 బిలియన్‌ డాలర్ల​ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన అమెజాన్‌ తాజాగా ఆహార రంగంలో 50 కోట్ల డాలర్ల పెట్టుడి ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదాన్ని కూడా పొందింది.
ఫ్యూచర్‌పైనే దృష్టి...
దేశంలో 95 శాతం రిటైల్‌ అమ్మకాలన్నీ ఇప్పటికీ సూపర్‌ మార్కెట్లు, కిరాణా స్టోర్ల ద్వారానే జరుగుతున్నాయి. ఇక కిశోర్‌ బియానీ ఫ్యూచర్‌ రిటైల్‌కు దేశవ్యాప్తంగా బలమైన నెట్‌వర్క్‌తో పాటు బిగ్‌బజార్‌ వంటి ప్రధానమైన బ్రాండ్‌ ఉంది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులను విక్రయిస్తూ లాభాల్లో ఉన్న ఈ సంస్థలో పెట్టుబడి తమ ‘ఫ్యూచర్‌’కు కీలమని అమెజాన్‌ బలంగా విశ్వసిస్తోంది. ప్రధానంగా ఫ్యూచర్‌ రిటైల్‌కు దుస్తులు, జనరల్‌ వస్తువులు, లగేజ్‌, ఫుట్‌వేర్‌ విభాగాల్లో చాలా పట్టుంది. 340 నగరాల్లో మొత్తం 14.8 మిలియన్‌ చదపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్‌ స్టోర్లను ఫ్యూచర్‌ రిటైల్‌ నిర్వహిస్తోంది. దీనికితోడు 50 కోట్ల మేర కస్టమర్ల డేటా కూడా ఫ్యూచర్‌ గ్రూప్‌ వద్ద ఉండటం అమెజాన్‌కు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్‌ ఆన్‌లైన్‌ రిటైల్‌ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగాలు ఫుడ్‌, గ్రోసరీలేనని మోర్గాన్‌ స్టాన్లీ ఇటీవలే పేర్కొంది. 2020 నాటికి ఈ విభాగం వార్షికంగా 141 శాతం చక్రీయ వద్ధిని నమోదు చేస్తుందని.. మార్కెట్‌ విలువ 15 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. మొత్తం ఆన్‌లైన్‌ రిటైల్‌ అమ్మకాల్లో  ఇది 12.5 శాతమని కూడా లెక్కగట్టింది. కాగా, మన రిటైల్‌ మార్కెట్‌ ప్రస్తుతం 672 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. 2020 నాటికల్లా 1.1 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. ఇంతలా ఊరిస్తున్న ఈ భారీ మార్కెట్‌ను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ల ద్వారా కొల్లగొట్టడమే లక్ష్యంగా ఇప్పుడు అంతర్జాతీయ రిటైల్‌ దిగ్గజాలు భారత్‌పై గురిపెట్టాయి. ఇదిలా ఉండగా.. ప్రధాన ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ దక్కించుకోడం కూడా ఆమెజాన్‌ దూకుడు పెంచేందుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బలమైన ఆఫ్‌లైన్‌ నెట్‌వర్క్‌ ఉన్న వాల్‌మార్ట్‌తో పోటీపడాలంటే అమెజాన్‌కు ఈ పెట్టుబడులు తప్పనిసరి. దీనికి అనుగుణంగానే అమెరికాలో కూడా అమెజాన్‌ హోల్‌ ఫుడ్స్‌ను దాదాపు 14.5 బిలియన్‌ డాలర్లతో చేజిక్కించుకోవడం గమనార్హం.



You may be interested

వచ్చే ఏడాదీ వడ్డీరేట్లు పైపైకే

Wednesday 7th November 2018

- భారత్‌పై మూడీస్‌ అంచనా... - కఠిన ద్రవ్య విధానాల - బాటనే కొనసాగుతుందని విశ్లేషణ న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే ఏడాదీ వడ్డీరేట్ల పెంపు కొనసాగుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌ మంగళవారం పేర్కొంది. దేశం 2019లో వృద్ధి బాటనే పయనించినా,  ఆర్థికంగా కొంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనక తప్పదని విశ్లేషించింది.  కఠిన  ఆర్థిక ద్రవ్య విధానాల బాటన దేశం కొనసాగుతుందని పేర్కొన్న మూడీస్‌, రాజకీయ ఇబ్బదులు, ఆర్థిక, ద్రవ్య సంస్కరణలపై అనిశ్చితి

స్వల్ప లాభంతో ముగింపు

Tuesday 6th November 2018

ముంబై:- ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు...రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీఎసీస్‌, ఐసీఐసీఐ షేర్ల ర్యాలీతో మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అయిన్పటికీ, సెన్సెక్స్‌ 35వేల మార్కును కోల్పోయి 41 పాయింట్ల స్వల్పలాభంతో 34,992 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 6 పాయింట్లు పెరిగి 10,530 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, మీడియా, రియల్టీ రంగాలకు చెందిన సూచీలు లాభపడ్డాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక, అటో, మెటల్‌, ఫార్మా రంగాలకు చెందిన సూచీలు నష్టపోయాయి.

Most from this category